వన్నెతగ్గుతోన్న .. పాలిటెక్నిక్‌ విద్య | Admissions to polytechnic drop as students lose interest | Sakshi
Sakshi News home page

వన్నెతగ్గుతోన్న .. పాలిటెక్నిక్‌ విద్య

Published Tue, Apr 29 2025 6:08 AM | Last Updated on Tue, Apr 29 2025 6:09 AM

Admissions to polytechnic drop as students lose interest

దేశ వ్యాప్తంగా తగ్గుతున్న ప్రవేశాలు

సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్‌ విద్య వన్నె తగ్గుతోంది. ఓవైపు ఏటికేటికీ తగ్గుతోన్న ప్రవేశాలు..కళాశాలల్లో అధ్యాపకుల కొరత ...ఉపాధి సామర్థ్యాన్ని పెంచడంలో వెనుకబాటు..మరోవైపు కొత్త పుంతలు తొక్కుతోన్న అధునాతన ఇంజినీరింగ్‌ కోర్సులు..వెరసి పాలిటెక్నిక్‌ ఉనికికి సవాల్‌ విసురుతున్నాయి. పాలిటెక్నిక్‌ కళాశాలలకు స్వయం ప్రతిపత్తి (అటానమస్‌) హోదా కల్పించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రవేశపెట్టిన పథకాన్ని పరిశీలిస్తే విషయం స్పష్టమవుతోంది. ఈ స్వయం ప్రతిపత్తి విధానాన్ని రెండేళ్ల కిందట అమలు చేయగా...ఇప్పటిదాకా మహారాష్ట్ర, కర్నాటకలోని ఐదు కళాశాలలు మాత్రమే అర్హత సాధించడం గమనార్హం.  

59 శాతం ప్రైవేటు యాజమాన్యాలే.. 
పాలిటెక్నిక్‌లో ప్రవేశాలు సైతం క్రమంగా తగ్గుతున్నాయి. దీనికి తోడు సీట్ల సంఖ్య కూడా క్షీణిస్తూ వస్తోంది. ముఖ్యంగా పాలిటెక్నిక్‌ విద్యా వ్యవస్థలో ప్రైవేటు సంస్థలే కీలకంగా వ్యవహరిస్తున్నాయి. 2024–25లో ఏఐసీటీఈ ఆమోదించిన సంస్థల జాబితా ప్రకారం దేశంలో 3566 పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉంటే వాటిలో 59 శాతం ప్రైవేటు యాజమాన్యాల చేతిలో ఉండటం గమనార్హం. 

ఆదర్శం..ఆ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 
పాలిటెక్నిక్‌ విద్య ప్రారంభంలో ప్రభుత్వ హయాంలోనే నడిచేది. కాల క్రమేణా ప్రైవేటు పరం చేయడంతో కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.  దీంతో పాలిటెక్నిక్‌ విద్య నాసిరకంగా మారింది. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాలిటెక్నిక్‌ కళాశాలలను ప్రభుత్వమే నడిపిస్తోంది. వాటిలో గోవా, అరుణాచల్‌ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, లక్షద్వీప్, దాద్రా–నాగర్‌ హవేలీ ఉన్నాయి. ఇక్కడ పాలిటెక్నిక్‌ విద్య ప్రైవేటీకరణ జరగలేదు.  

ఏటా క్షీణిస్తున్న ప్రవేశాలు..
పాలిటెక్నిక్‌లో ఏటా సీట్ల భర్తీ కోసం కళాశాలలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే 2017–23 వరకు ఐదేళ్ల కాలంలో దాదాపు ఐదో వంతు (19.7 శాతం) సీట్లు తొలగించినట్టు తెలుస్తోంది. మరోవైపు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలు పూర్తయిన తర్వాత కూడా భారీ సంఖ్యలో సీట్లు మిగిలి­పోతున్నాయి. ఇటీవల అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) పరిశ్రమలకు అనుగుణంగా పాఠ్యాంశాలు సవరించిన సంగతి తెలిసిందే. అయిననప్పటికీ తగిన ఫలితం కనిపించట్లేదు. మరోవైపు పాలిటెక్నిక్‌ విద్యను ఢిల్లీ మాదిరిగా కొన్ని రాష్ట్రాలు నైపుణ్య విశ్వవిద్యాలయాల కిందకు తీసుకురావాలని భావిస్తున్నాయి. మరోవైపు ఫీజులు కూడా భారీగా పెరగడంతో విద్యార్థులు ప్రత్యామ్నాయ కోర్సుల వైపు మరలుతున్నారు.

మెరుగుపడాలంటే.. 
పాలిటెక్నిక్‌ కళాశాలలకు స్వయం ప్రతిపత్తి అంశంలో ఏఐసీటీఈ, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి.  
ప్రభుత్వాలు కళాశాలల్లో నాణ్యత ప్రమాణాలు పెంచాలి.  
స్వయం ప్రతిపత్తి హోదాకు నిర్దేశించిన అంశాలను సంతృప్తి పరచడంలో చాలా విద్యా సంస్థలు విఫలమవుతున్నాయి. దీన్ని అధిగమించాలి.  
ముఖ్యంగా అధ్యాపకుల కొరత పాలిటెక్నిక్‌ విద్యను ప్రభావితం చేస్తోంది. ఈలోటును భర్తీ చేయాలి. 
లైబ్రరీలు, ప్రయోగశాలలు, తగినన్ని వనరుల కల్పనపై దృష్టి సారించాలి. అలాగే  వర్క్‌షాప్‌లు నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement