
మరో ఉద్యమానికి సిద్ధం కావాలి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది దాటినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు...
- అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా హామీలు అమలు కాలేదు
- రైతులు సంక్షోభంలో కూరుకుపోయూరు..
- దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది
- సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
నిజామాబాద్ అర్బన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది దాటినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. హామీలు నెరవేరాలంటే వీర తెలంగాణ ఉద్యమ వారసత్వం పుణికిపుచ్చుకున్న జిల్లా వాసులుగా మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన బహిరంగసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నైజాంను ఎదిరించిన ఘనత ఈ ప్రాంత వాసులకు ఉందని, ఆ స్ఫూర్తితోనే సమస్యల పరిష్కారానికి కూడా పోరాడాలని అన్నారు. అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతం వెనుకబడి ఉందని, ప్రత్యేక రాష్ట్రం వస్తే అభివృద్ధి చెందుతుందని ఆశిస్తే.. అదీ అడియూశే అరుుందని అన్నారు.
ప్రజాసమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్‌లో ఏ పార్టీలూ ఉద్యమించడం లేదన్నారు. ఉల్లిధర విపరీతంగా పెరిగిందని, కేంద్రప్రభుత్వం సబ్సిడీలు తగ్గించి ధరలు పెంచడంతో పేదలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వ్యవసాయరంగం నానాటికీ సంక్షోభంలో కూరుకుపోతోందని, రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించని ప్రభుత్వాలు.. పారిశ్రామిక వేత్తలకు ఎర్రతివాచీలు పరుస్తున్నాయని ఆరోపించారు. సెప్టెంబర్ 2న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయూలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక వేత్తలకు పెట్టుబడుల కోసం కేంద్రం రూ. 5 లక్షల కోట్ల పన్నులను మినహాయించిందని, అందులో సగం డబ్బుతో గ్రామాలను అభివృద్ధి చేయవచ్చని చెప్పారు.
ఎక్కడి గొంగళి అక్కడే : తమ్మినేని
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా రాష్ట్ర పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలను గాలికి వదిలి దొరల పాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే గోదావరిపై ఉన్న ప్రాజెక్టుల డిజైన్ల మార్పునకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, ఇంజనీర్లు, అఖిలపక్ష నాయకుల వాదనలు పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాణాహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిెహ ట్టి వద్ద నిర్మిస్తేనే ప్రయోజనం ఉంటుందని, కాళేశ్వరం తరలిస్తే ఉపయోగం ఉండదని చెప్పారు.
పర్సంటేజీల కోసమే ప్రాజెక్టుల డిజైన్లు మారుస్తున్నారని దుయ్యబట్టారు. ఇంటింటికీ ఉద్యోగం అని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేసీఆర్.. ఇప్పుడు 772 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కోసం వెయ్యిమందికిపైగా ప్రాణాలు అర్పిస్తే కేవలం వెయ్యి ఉద్యోగాలు కూడా అందుబాటులోకి రాలేదని అన్నారు. దళితులకు 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేస్తామని ప్రకటించి 1400 ఎకరాలకే పరిమితమయ్యూరని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ కేసీఆర్ చీప్‌లిక్కర్‌ను తక్కువ ధరకు తీసుకొచ్చి ఎక్కువ మద్యం తాగించాలని చూస్తున్నారని, తద్వారా ఆదాయం పెంచుకునేందకు యత్నిస్తున్నారని అన్నారు.
చీప్‌లిక్కర్‌తో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యంపై ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే రామోజీ ఫిల్మ్‌సిటీని లక్ష నాగళ్లతో దున్నుతామని కేసీఆర్ ప్రకటించారని, ఇప్పుడు ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కావాలంటే నిజామాబాద్ జిల్లా నుంచి లక్ష నాగుళ్లు, ఇక్కడి రైతులను తీసుకొస్తా.. భూములను దున్నుతావా అని సవాల్ విసిరారు. సభలో సీపీఎం రాష్ట కార్యవర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, బి.వెంకట్, జిల్లా కార్యదర్శి దండి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.