రబీలో మొక్కజొన్న సాగులో అధిక దిగుబడి సాధించేందుకు సాగునీటిని సక్రమంగా పారించాలి.
ఖమ్మం వ్యవసాయం: రబీలో మొక్కజొన్న సాగులో అధిక దిగుబడి సాధించేందుకు సాగునీటిని సక్రమంగా పారించాలి. మొక్కలకు నీరు, సూర్యరశ్మిని పెరుగుదలకు అనుకూలంగా ఉపయోగించుకునే శక్తి ఎక్కువ. తడుల మెలకువలను జిల్లా ఏరువాక శాస్త్రవేత్తలు డాక్టర్ జె.హేమంత్ కుమార్(99896 23813), డాక్టర్ ఎం.వెంకట్రాములు(89856 20346), డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు (83329 51138) చెబుతున్నారు.
విత్తేముందు జాగ్రత్తలు
నేలలో తేమ సరైన స్థాయిలో ఉండాలి. విత్తనం నీటిని గ్రహించి దాదాపు రెండింతల బరువు పొందిన తరువాత మొలకెత్తుతుంది.
మొక్కజొన్న అధికనీరు(నీటి ముంపు) లేక బెట్ట(నీటి ఎద్దడి) పరిస్థితులను తట్టుకోలేకపోవటం వల్ల నష్టం జరుగుతుంది. విత్తిన మొదటి రెండు రోజులు నీటి ముంపునకు గురైతే అంకురోత్పత్తి శాతం తగ్గుతుంది.
పైరు లేత దశలో (విత్తిన తరువాత 30రోజుల వరకు) నేలలో నీరు నిలువ ఉంకుండా జాగ్రత్త పడాలి. నీటిముంపు ఉండే భూముల్లో మొక్కజొన్న లేత పసుపు పచ్చగా మారి, పెరుగుదల తగ్గి దిగుబడి పడిపోతుంది. నేలలో మురుగు నీరు పోయే విధంగా చూసుకోవాలి. లేదా బోదెసాళ్ల పద్ధతులను పాటించాలి.
తేమ సున్నిత దశలు
పంట మోకాలెత్తు దశ, పూతదశ, గింజపాలుపోసుకునే దశ, గింజనిండే దశ.
విత్తిన వెంటనే నీటి తడి ఇవ్వడం ద్వారా మంచి మొలక శాతం పొందొచ్చు. పంట లేత దశలో నీటి ఎద్దడికి గురైతే మగ, ఆడ పుష్పించు దశలు ఆలస్యమవుతాయి. మొక్క 30-40 సెం.మీ ఎత్తు పెరిగే వరకు నీటి వినియోగం తక్కువ. పూత దశలో (జల్లు, పీచు వేసి పరాగ సంపర్కం జరగటం) అత్యధికంగా అంటే రోజుకు 8-12 మి.మీ ఉంటుంది. ఈ దశలోని 15-20 రోజులు మొక్కకు అత్యంత కీలకం.
పూతదశ కీలకం
పూత దశ నుంచి గింజలు పాలు పోసుకునే వరకు పంట నీడి ఎద్దడికి గురైతే 40-80 శాతం వరకు దిగుబడులు తగ్గుతాయి. గింజకట్టే సమయంలో నీటి ఎద్దడి ఏర్పడితే గింజ పరిమాణం తగ్గుతుంది. కానీ గింజ గట్టి పడే సమయంలో నీటి ఎద్దడి ఏర్పడితే పెద్దగా నష్టం ఉండదు. నీటి ఎద్దడి వలన మగపూత దశలో 25 శాతం, ఆడపూత దశలో 50 శాతం పరాగ సంపర్కం తరువాత 21 శాతం గింజ దిగుబడి తగ్గుతుంది. పూత దశలో తక్కువ వ్యవధిలో నీరు పెట్టాలి.
ఎన్నితడుల నీరు కట్టాలంటే...
నీరు సమృద్ధిగా ఉంటే నల్లరేగడి నేలల్లో 5-6 తడులు, ఎర్రనేలల్లో 8 తడుల వరకు అవసరం. ఒకవేళ 6 తడులు ఇవ్వడానికి అవకాశం ఉంటే ఒక తడి మొలక దశ, ఒక తడి పంట మోకాలెత్తు దశ, ఒక తడి పూత దశ, రెండు తడులు పూత దశ నుంచి గింజపాలు పోసుకునే వరకు, గింజ నిండే దశలో ఇవ్వాలి.
ఒకవేళ 5 తడులు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటే పంట మొలక దశ ను తీసివేసి మిగతా దశల్లో ఇచ్చుకోవాలి. అదే విధంగా సాగు నీరు 4 తడులకే ఉంటే ఒక తడి మోకాలెత్తు దశలో, ఒక తడి పూత దశలో, రెండు తడులు పూత దశ నుంచి గింజపాలు పోసుకునే దశ వరకు ఇవ్వాలి.