
స్టీల్‌ప్లాంట్ సెక్యూరిటీ విధుల్లో ఏపీ ఎస్‌పీఎఫ్
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ సెక్యూరిటీ విధుల్లోకి సీఐఎస్‌ఎఫ్ సిబ్బందితో పాటు రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్‌పీఎఫ్)ను నియమించబోతున్నారు. స్టీల్‌ప్లాంట్ పొదుపు చర్యల్లో భాగంగా సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా స్టీల్‌ప్లాంట్ సీఐఎస్‌ఎఫ్ యూనిట్ నుంచి సుమారు 438 మందిని తగ్గించి ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. వారి స్థానంలో మొదట హోంగార్డులను నియమించాలనుకున్నారు. స్టీల్‌ప్లాంట్ వంటి సున్నితమైన పరిశ్రమలో హోంగార్డులు సరికాదని నిర్ణయించి, ఆ స్ధానంలో ఎస్‌పీఎఫ్ సిబ్బందిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఎట్టకేలకు ఆదివారం కేంద్ర ఉక్కు సహాయమంత్రి శ్రీనివాసవర్మ, ఉక్కు కార్యదర్శి సందీప్ పౌండ్రిక్‌లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరించినట్టు తెలిసింది. ఇందులో భాగంగా విజయవాడలోని ఏపీ ఎస్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం ఒక సర్క్యులర్ విడుదల చేసింది. స్టీల్‌ప్లాంట్‌లో విధులు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన వారు ఈ నెల 10లోగా తమ అంగీకారం తెలపాలని అందులో పేర్కొన్నారు. మొదటి దశలో 100 మందిని, ఆ తర్వాత దశల వారీగా సిబ్బందిని నియమించేందుకు అంగీకరించినట్లు ఉక్కు అధికార వర్గాల సమాచారం.