
ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి
ఏలూరు రేంజ్ ట్రైనీ ఎస్‌ఐలకు ఎస్పీ సూచన
పాడేరు: ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వచ్చే వారితో మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలని, కేసుల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఎస్పీ అమిత్ బర్దర్ సూచించారు. నెలరోజుల శిక్షణ కోసం జిల్లాకు వచ్చిన ఏలూరు రేంజ్‌కు చెందిన 37 మంది ట్రైనీ ఎస్‌ఐలు మంగళవారం ఎస్పీని కలిశారు. స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో వారితో ఎస్పీ సమావేశమయ్యారు. వివిధ కేసులను చేధించే పద్ధతులను ఎస్పీ తెలియజేశారు. పోలీస్ స్టేషన్లలో రికార్డుల నిర్వహణ, సైబర్ నేరాలు, శక్తి యాప్ తదితర అంశాలపై వారికి వివరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేశారు. అనంతరం శిక్షణ కోసం వచ్చిన వారికి పోలీస్ స్టేషన్లను కేటాయించారు.