
ఇన్‌చార్జుల పాలన ఇంకెన్నాళ్లు?
రెగ్యులర్ పీవోలేని పాడేరు ఐటీడీఏ
రెండు నెలలుగా జాయింట్ కలెక్టర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు
గిరిజన సంక్షేమ డీడీ పోస్టుదీ అదే పరిస్థితి
సాక్షి,పాడేరు: రాష్ట్రంలోని ఐటీడీఏల్లో పెద్దదైన, ఏడు లక్షల గిరిజన జనాభా కలిగిన పాడేరు ఐటీడీఏలో ప్రధాన పోస్టుల భర్తీలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. పాడేరు ఐటీడీఏకు ప్రాజెక్టు అధికారిని గత రెండు నెలలుగా నియమించలేదు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని 244 పంచాయతీల గిరిజనుల సమస్యలను పరిష్కరించడంతో పాటు గిరిజనుల అభివృద్ధికి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని, నిధులు ఖర్చుపెట్టాల్సిన బాధ్యత ఐటీడీఏ పీవోదే. ఇంత కీలకమైన పోస్టును జాయింట్ కలెక్టర్‌తోనే అదనపు విధుల్లో భాగంగా ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇక్కడ ఐటీడీఏ పీవోగా పనిచేసిన అభిషేక్‌ను పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్‌గా ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 3న బదిలీ చేసింది. అయితే ఆయన స్థానంలో మరో ఐఏఎస్ అధికారిని ఐటీడీఏ పీవోగా నియమించాల్సి ఉన్నప్పటికీ పాడేరు జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అభిషేక్‌గౌడకు ఐటీడీఏ పీవోగా ఎఫ్‌ఏసీ బాధ్యతలను అప్పగించింది. అప్పటి నుంచి ఆయన జేసీగాను, ఐటీడీఏ పీవోగాను విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇంతవరకు ఐటీడీఏ పీవో పోస్టును భర్తీ చేయకపోవడంతో ఐటీడీఏ పరంగా గిరిజనులకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ప్రతి శుక్రవారం ఐటీడీఏలో జరిగే మీ–కోసంలో మాత్రమే ఇన్‌చార్జి పీవో అయిన జేసీకి సమస్యలు చెప్పుకుంటున్నామని, మిగిలిన రోజుల్లో ఇబ్బందిగా ఉంటుందని గిరిజనులు వాపోతున్నారు. పూర్తిస్థాయి పీవో లేకపోవడంతో ఐటీడీఏలో పరిపాలన పరమైన అంశాలలోను ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. పూర్తిస్థాయి పీవో లేకుండానే పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం సోమవారం జరగనుంది. డాక్టర్ అభిషేక్‌గౌడ నేతృత్వంలో సమావేశం నిర్వహించనున్నారు. పాలకవర్గ సమావేశానికి ముందే ఐటీడీఏకు రెగ్యులర్ పీవో నియమిస్తారని భావించినా, కూటమి ప్రభుత్వం స్పందించలేదు.
ఆరు నెలలుగా గిరిజన సంక్షేమ డీడీ పోస్టు ఖాళీ
గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సిన కీలకమైన పాడేరు ఐటీడీఏలోని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ పోస్టును ప్రభుత్వం ఆరు నెలలుగా భర్తీ చేయలేదు.గతంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసిన కొండలరావును క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సెప్టెంబర్ 30న ప్రభుత్వం గిరిజన సంక్షేమశాఖకు సరెండర్ చేసింది.ఆయన స్థానంలో పాడేరు సహాయ గిరిజన సంక్షేమశాఖ అధికారి(ఏటీడబ్ల్యూవో) ఎల్.రజనీని ఇన్‌చార్జి డీడీగా నియమించారు. పూర్తిస్థాయి డీడీ లేక గిరిజన విద్యకు సంబంధించిన పలు అంశాలలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పాడేరు ఐటీడీఏలో కీలకమైన పీవోతో పాటు గిరిజన సంక్షేమశాఖ డీడీ పోస్టులను భర్తీ చేయాలని జిల్లా ఇన్‌చార్జి,రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి కూడా వినతులు అందినాఇంతవరకు ఎలాంటి నియామకాలు జరపకపోవడం గమనార్హం.
పూర్తిస్థాయి పీవో లేకుండానే
ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నేడు
పీవో, డీడీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి
పాడేరు ఐటీడీఏలో కీలకమైన ప్రాజెక్టు అధికారి,గిరిజన సంక్షేమశాఖ డీడీ పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి.ఏ కష్టమొచ్చిన గిరిజనులు నేరుగా ఐటీడీఏకు వెళ్లి పీవోకు సమస్యలు చెప్పుకునే పరిస్థితి ఉండేది.పాత పీవో అభిషేక్ బదిలీ అయిన నాటి నుంచి గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.పాత డీడీని సరెండర్ చేసి ఆరు నెలలు కావస్తున్నా ఇంతవరకు మరో డీడీని నియమించకపోవడం అన్యాయం.జిల్లా ఇన్‌చార్జి మంత్రి వెంటనే దృష్టిపెట్టాలి.
– పొద్దు బాలదేవ్,
గిరిజన సంఘం జిల్లా నేత, అరకులోయ
రెగ్యులర్ పీవో లేక ఇబ్బందులు
పాడేరు ఐటీడీఏకు రెగ్యులర్ పీవోను ప్రభుత్వం నియమించకపోవడంతో పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. చింతపల్లి మాక్స్‌కు కాఫీ పండ్లు విక్రయించిన రైతులకు బోనస్ చెల్లించడంలో జాప్యం జరుగుతోంది. రైతుల ఇతర సమస్యల పరిష్కారంలోనూ ఇదే పరిస్థితి. రెగ్యులర్ పీవో అయితే నిరంతరం ఐటీడీఏలో అందుబాటులో ఉంటారు.ఇన్‌చార్జి పీవో అయిన జేసీకి సమస్యలు చెప్పుకున్నా... వెంటనే పరిష్కారం కావనే భావనలో రైతులు ఉన్నారు.
– పాలికి లక్కు,
కాఫీ రైతు సంఘం నేత, పాడేరు

ఇన్‌చార్జుల పాలన ఇంకెన్నాళ్లు?