
దద్దరిల్లిన ఐటీడీఏ
1/70 చట్టం నిర్వీర్యం
పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, దీంతో గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఎల్‌టీఆర్ కేసులను త్వరగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలన్నారు. ఐటీడీఏలో అవినీతి రాజ్యమేలుతోందని, పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పాడేరు మెడికల్ కళాశాలలో భర్తీ చేస్తున్న 256 సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాల నియామకాల్లో గిరిజన నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం జరుగుతోందని, తక్షణమే పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త నోటీఫికేషన్ జారీ చేయాలని, సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలన్నీ స్థానిక గిరిజన నిరుద్యోగ అభ్యర్థులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు అనారోగ్యం బారినపడి పిట్టల్లా రాలిపోతున్నారని, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని, హెల్త్ వలంటీర్లను నియమించాలన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలని కోరారు.