
భానుడు భగభగ..మీటర్ గిరగిర!
సాక్షి, విశాఖపట్నం: ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఉక్కబోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందడానికి అంతా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు విపరీతంగా వినియోగిస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంటోంది. సాధారణంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో మార్చి మూడో వారం నుంచి నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో కరెంటు వినియోగం కూడా పెరుగుతుంటుంది. కానీ ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచి ఎండలు మండిపోతున్నాయి. అప్పటి నుంచి డిమాండ్ పీక్స్‌కు వెళ్లిపోయింది. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. లోడ్ పెరుగుతుండటంతో సరఫరాలోనూ లోపాలు తలెత్తుతున్నాయి.
తేదీ వినియోగం
(మిలియన్
యూనిట్లలో)
15– ఏప్రిల్ 14.196
16– ఏప్రిల్ 14.464
17– ఏప్రిల్ 15.612
18– ఏప్రిల్ 15.060
19– ఏప్రిల్ 15.074
20– ఏప్రిల్ 14.454
మండుతున్న ఎండలతో పెరుగుతున్న విద్యుత్ వినియోగం
విశాఖ సర్కిల్ పరిధిలో రోజూ సాధారణ వినియోగం 12 మిలియన్ యూనిట్లు
ప్రస్తుతం 14–15 మిలియన్ యూనిట్లకు..
ఒక్కసారిగా లోడ్ పెరగడంతోసరఫరాలో లోపాలు
2 మిలియన్ యూనిట్లు అదనంగా...
విశాఖ సర్కిల్ పరిధిలో ప్రతి రోజూ సగటున 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగుతుంది. అయితే భానుడి ప్రతాపంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. గత కొద్ది వారాలుగా సగటు విద్యుత్ వినియోగం రోజుకు 14 నుంచి 15 మిలియన్ యూనిట్లుగా మారిపోయింది. ఏప్రిల్ 1న రికార్డు స్థాయిలో 15.976 మిలియన్ యూనిట్లు విద్యుత్ వాడేశారంటే.. ఎండ తీవ్రత నుంచి రక్షించుకునేందుకు ప్రజలు ఎంతలా కరెంట్ వినియోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గత వారం రోజులుగా పరిశీలిస్తే ఏ రోజూ 14 మిలియన్ యూనిట్లకు దిగువన రీడింగ్ లేదు.