
మెగా డీఎస్సీలో ఏజెన్సీ పోస్టులు మినహాయించాలి
సాక్షి, పాడేరు: మెగా డీఎస్సీలో ఏజెన్సీ పోస్టులను మినహాయించి ఈనెల 30వతేదీ నాటికి ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ ప్రకటన చేయాలని, లేని పక్షంలో మన్యంలో నిరవధిక బంద్ చేపడతామని గిరిజన సంఘం జాతీయ సభ్యుడు పి.అప్పలనరస హెచ్చరించారు. గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం రాత్రి స్థానిక మోదకొండమ్మతల్లి ఆలయ సమావేశమందిరంలో ఆదివాసీ, ప్రజా సంఘాల అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ యువతకు అన్యాయం చేస్తోందన్నారు. గిరిజన సంక్షేమశాఖలో గల 881 పోస్టులకు గాను 42 ఉపాధ్యాయ పోస్టులను మాత్రమే ఆదివాసీలకు కేటాయించడం అన్యాయమన్నారు. జీవో నంబర్ 3ను పునరుద్ధరించి, ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టులను నూరుశాతం గిరిజనులతోనే భర్తీ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఈనెల 26న పాడేరులో జరిగే ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కంబిడి నీలకంఠం,డీఎల్‌వో కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.మాణిక్యం,బీటీఏ జిల్లా అధ్యక్షుడు వల్లా వెంకటరమణ,గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మానపడాల్,పలు సంఘాల నేతలు నాగేశ్వరరావు,రాజబాబు,జీవన్‌కృష్ణ,కాంతారావు తది తరులు పాల్గొన్నారు.
లేని పక్షంలో నిరవధిక మన్యం బంద్ నిర్వహిస్తాం
గిరిజన సంఘం జాతీయ సభ్యుడు అప్పలనర్స