
హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం
పాడేరు రూరల్: హామీలు అమలు చేయడంలో కూట మి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గిరిజన సంఘ ం,ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ నాయకులు ధ్వజమెత్తారు. ఆ సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీ నిరుద్యోగులు సోమవారం ఐటీడీఏ వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరుద్యోగులు, ప్రజాసంఘాల నాయకులు సోమవారం నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు కిల్లో సురేంద్ర మాట్లాడుతూ ఎన్నికల ముందు అరకులోయలో నిర్వ హించిన బహిరంగ సభలో ఆదివాసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబునాయుడు మోసం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నంబర్3ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స మాట్లాడుతూ మోసం చేయడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. జీవో నంబర్ 3ను పునరుద్ధరించకుండా డీఎస్సీని ప్రకటించడం ఆదివాసీలకు తీవ్ర అన్యా యం చేయడమేనని చెప్పారు. తక్షణం జీవో నంబర్ 3ను పునరుద్ధరించి, ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ హామీలను అమలు చేయకుండా కూట మి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. గిరిజనులహక్కులు,చట్టాల జోలికివస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి,నిరుద్యోగ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆదివాసీ, ప్రజా సంఘాల నాయకుల ధ్వజం
పాడేరు ఐటీడీఏ వద్ద నిరుద్యోగుల నిరసన
ర్యాలీని అడ్డుకున్న పోలీసులు