
రోడ్డు కోసం భారీ ర్యాలీ
సీలేరు: అంతర్రాష్ట్ర రోడ్డును తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేస్తూ అంతర్రాష్ట్ర రోడ్డు సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం దారకొండ నుంచి హనుమాన్ జంక్షన్ వరకు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఆర్వీనగర్ నుంచి దారకొండ, సీలేరు మీదుగా పాలగెడ్డ వరకు రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. దశాబ్ద కాలంగా ఈ రోడ్డుపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆందోళనకారులు తెలిపారు. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి ఆర్వీనగర్ నుంచి సీలేరు మీదుగా పాలగెడ్డ వరకు రోడ్డు నిర్మించేందుకు పనులు ప్రారంభించకపోతే ఆందోళన చేపట్టి, మండల బంద్కు పిలుపు ఇస్తామని అంతర్రాష్ట్ర రోడ్డు సాధన కమిటీ నాయకులు తెలిపారు. గంగవరం,అగ్రహారం,చోడిరాయి వద్ద గత ఏడాది కొట్టుకుపోయిన వంతెనలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని,ముంపునకు గురైన గిరిజనుల భూములకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాలికొండ ఎంపీటీసీ బుజ్జిబాబు, గుమ్మిరేవుల మాజీ సర్పంచ్ బాబురావు, అల్లంగి రాజు, సీలేరు మాజీ ఉప సర్పంచ్ కారె శ్రీనివాసు, పలు రాజకీయ పార్టీల నాయకులు సిద్ధాఽర్థ్ మార్క్, మల్లుదొర, సొన్ను బాబూరావు తదితరులు పాల్గొన్నారు.