
అక్రమంగా తరలిస్తున్న బియ్యం, కందిపప్పు పట్టివేత
రంపచోడవరం: స్థానిక సినిమాహాల్ రోడ్డులో ఉన్న గిరిజన సంక్షేమ వసతి గృహం నుంచి అక్రమంగా తరలిస్తున్న బియ్యం, కందిపప్పు, గోధుమ పిండి బస్తాలను పోలీసులు పట్టుకున్నారు. వసతి గృహానికి చెందిన ఒక గోధుమ పిండి, రెండు కందిపప్పు, పది బియ్యం బస్తాలను శనివారం అర్ధరాత్రి ఆటోలో తరలిస్తుండగా స్థానికులు అడ్డుకుని పోలీసులు, ఐటీడీఏ పీవోకు సమాచారమిచ్చారు.దీంతో స్థానిక పోలీసులు హాస్టల్ వద్దకు వచ్చి సరుకులను, ఆటోను స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్
ఈ ఘటనకు సంబంధించి గిరిజన సంక్షేమ హాస్టల్ వార్డెన్ కత్తుల కృష్ణాబాయిని సస్పెండ్ చేసినట్టు ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. హాస్టల్ నుంచి బియ్యం, ఇతర సరుకుల అక్రమ తరలింపుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, తదుపరి చర్యలు చేపడతామన్నారు.
క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
గిరిజన సంక్షేమ హాస్టల్‌లో బియ్యాన్ని వ్యాపారులకు విక్రయించిన వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ మట్ల వాణిశ్రీ డిమాండ్ చేశారు. కొనుగోలు చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. వసతి గృహాలపై పర్యవేక్షణ లేకపోవడం వల్లే సరుకులు అక్రమంగా తరలిపోతున్నాయని చెప్పారు. కొంత మంది అధికారుల సహకారంతోనే వార్డెన్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
హాస్టల్ నుంచి ఆటోలో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఇద్దరిపై కేసు నమోదు