
స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ఫైనల్ జాబితా విడుదల
మహారాణిపేట: స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి సంబంధించిన అభ్యర్థుల ఫైనల్ జాబితాను శుక్రవారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రాధారాణి విడుదల చేశారు. ఈ జాబితాను https@//cfw.ap.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ ఫైనల్ జాబితాపై కూడా అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను రేసపువానిపాలెంలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయంలో అందజేయాలని ఆర్డీ తెలిపారు. వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఎంపిక జాబితాను విడుదల చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 27న ప్రాథమిక (ప్రొవిజనల్) జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ జాబితాపై మూడు రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించారు. అయితే, ఇంతలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి అమలులోకి రావడంతో జాబితా పరిశీలన కార్యక్రమం నిలిచిపోయింది. ఎన్నికల కోడ్ ముగియడంతో మళ్లీ జాబితాల పరిశీలన ప్రారంభించారు.
దరఖాస్తుల వివరాలు: మొత్తం 6 జిల్లాల్లోని 106 స్టాఫ్ నర్సు పోస్టుల కోసం డీఎంహెచ్‌వో కార్యాలయంలోని వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ (ఆర్డీ) కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించారు. ఆ తరువాత పోస్టులు మరో 264 పెరిగాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుంచి ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్‌లో కలిపి మొత్తం 8300 దరఖాస్తులు వచ్చాయి. ప్రాథమిక జాబితాపై అభ్యంతరాలు తెలుపుతూ ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి 1,570 దరఖాస్తులు చేరుకున్నాయి.
దళారులను నమ్మవద్దు
పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది. దళారులను ఎవరూ నమ్మవద్దు. అర్హత ప్రమాణాలు, మెరిట్, రోస్టర్ ప్రకారం ఫైనల్ జాబితా రూపొందించాం. అభ్యర్థులు ఎవరితోనూ సిఫార్సు చేయించవద్దు.
– డాక్టర్ పి. రాధారాణి, ఆర్డీ