
దేశంలోని 23 ఐఐటీల్లోనూ క్యాంపస్ ఎంపికల్లో అసాధారణ క్షీణత
సగానికిపైగా ఐఐటీల్లో 10 శాతం మేర తగ్గుదల
2021–22తో పోలిస్తే 2023–24 నాటికి భారీగా డౌన్‌ఫాల్
రూ.4లక్షల కనిష్ట స్థాయికి పడిపోయిన వార్షిక ప్యాకేజీలు!
ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్లేస్‌మెంట్ల అసాధారణ
క్షీణతపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన
ఐఐటీ రూర్కీలో.. 2021–22లో ప్లేస్‌మెంట్ల శాతం 98.54
2023–24లో ప్లేస్‌మెంట్ల శాతం79.66
మొత్తం తగ్గుదల(శాతంలో)18.88
సాక్షి, అమరావతి: దేశంలోని ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో అసాధారణ క్షీణత కనిపిస్తోంది. కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే సగానికి పైగా ఐఐటీల్లో సగటున 10% మేర తగ్గుదల నమోదవడం గమనార్హం. తొలి తరం ఐఐటీల్లో ఒకటైన ఐఐటీ–ఖరగ్‌పూర్‌లో మాత్రమే స్వల్పంగా 2.28% తగ్గుదల కనిపించింది.
మిగిలిన అన్నింటిలోనూ క్యాంపస్ ప్లేస్‌మెంట్ల పరిస్థితి దారుణంగా ఉంది. మొత్తం 23 ఐఐటీలు ఉండగా.. చాలా ఐఐటీల్లో 2022–23లో మొదలైన తగ్గుదల... 2023–24లోనూ కొనసాగింది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లోనూ ప్లేస్‌మెంట్ల క్షీణతపై పార్లమెంట్ స్టాడింగ్ కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. దీనిని అసాధారణ తగ్గుదలగా గుర్తించింది. దేశంలో విద్యపై ఖర్చు భూటాన్, మాల్దీవుల కంటే తక్కువగా ఉందని అభిప్రాయపడింది.
తొలి తరం ఐఐటీల్లోనూ ఎదురుగాలే..
» తొలి తరం ఐఐటీల్లోనూ క్యాంపస్ ప్లేస్‌మెంట్ల తగ్గుదల నమోదవుతోంది. ప్లేస్‌మెంట్ల కోసం నమోదు చేసుకునేవారు తగ్గుతుంటే.. అందులోనూ ఉద్యోగాలు పొందేవారు మరింత తగ్గిపోతున్నారు.
» తాజా గణాంకాల ప్రకారం ఐఐటీ రూర్కీలో ప్లేస్‌మెంట్లు గణనీయంగా పడిపోయాయి. 2021–22లో 98.54 శాతం ఉన్న ప్లేస్‌మెంట్లు... 2023–24కు వచ్చేసరికి 79.66 శాతానికి తగ్గాయి. అంటే ఏకంగా 18.88 శాతం తగ్గిపోయాయి. ఐఐటీ ఢిల్లీలో 15 శాతం, ఐఐటీ బొంబాయిలో 12.72 శాతం మేర క్షీణత నమోదైంది. ఐఐటీ మద్రాస్‌లో 12.42 శాతం, ఐఐటీ కాన్పూర్‌లో 11.15 శాతం ప్లేస్‌మెంట్లు పడిపోయాయి.
» ఐఐటీ భువనేశ్వర్‌లో 2021–22తో పోలిస్తే 2022–23లో ప్లేస్‌మెంట్లు మెరుగైనప్పటికీ.. 2023–24లో మాత్రం 7.58 శాతం తగ్గుదల నమోదైంది.
» రెండో తరం ఐఐటీల్లోనూ పరిస్థితి చెప్పుకోతగ్గట్టు లేదు. 2008–09 మధ్య స్థాపించిన ఐఐటీల్లో హైదరాబాద్ అత్యంత ఎక్కువ క్షీణతను (17.17 శాతం) నమోదు చేసింది. ఆ తర్వాత స్థానాల్లో ఐఐటీ మండీ (14.1శాతం), రోపర్ (13.15శాతం), ఇండోర్ (11.03శాతం) ఉన్నాయి.
» ఇక 2015–16 మధ్య స్థాపించిన మూడో తరం ఐఐటీల్లోనూ ప్లేస్‌మెంట్ల పరిస్థితి ఏమీ బాగాలేదు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2023–24లో ఐఐటీ జమ్మూలో 21.83 శాతం ప్లేస్‌మెంట్లు తగ్గిపోయాయి.
ఆర్థిక మందగమనం ఓ కారణం..
కోవిడ్ తర్వాత కూడా ఐఐటీల్లో క్యాంపస్ నియామకాలు ఆశాజనకంగానే ఉన్నాయి. కానీ, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగనమనం కారణంగా రెండేళ్లుగా ప్లేస్‌మెంట్‌లపై ప్రభావం పడుతోందని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు ఉన్నత విద్య వైపు వెళ్లడం, స్టార్టప్‌లపై దృష్టి సారించడం వంటి కారణాల వల్ల కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్లు తగ్గుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.
క్యాంపస్ కొలువులు మార్కెట్ ట్రెండ్‌లపై ఆధారపడి ఉన్నప్పటికీ, విభాగాల వారీగా కొత్త మార్గాలను కనుగొని తదనుగుణంగా ఉపాధి పొందే అవకాశాలను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని సూచిస్తున్నారు. గత సంవత్సరం చాలా ఐఐటీలు తమ క్యాంపస్ ప్లేస్‌మెంట్లు వెల్లడించలేదు.
అయితే, సెప్టెంబర్‌లో ఐఐటీ బొంబాయి విడుదల చేసిన నివేదిక ప్రకారం... గత పరిస్థితులతో పోలిస్తే తక్కువ మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్లు పొందారని, ఇందులోనూ అత్యల్ప ప్యాకేజీ ఏడాదికి రూ.4లక్షలకు పడిపోయిందని పేర్కొంది. దీనిని బట్టి చూస్తే ఉద్యోగ మార్కెట్‌లో ఆందోళనకర మార్పు కనిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఐఐటీల్లో ప్లేస్‌మెంట్స్ శాతంలో తగ్గుదల ఇలా...
ఐఐటీ 2021–22 2023–24
ఖరగ్‌పూర్ 86.79 83.91
బొంబాయి 96.11 83.39
మద్రాస్ 85.71 73.29
కాన్పూర్ 93.63 82.48
ఢిల్లీ 87.69 72.81
గౌహతి 89.77 79.10
రూర్కీ 98.54 79.66
వారణాసి 83.15 88.04
ధన్‌బాద్ 87.89 75.38
గాంధీనగర్ 91.85 82.39
భువనేశ్వర్ 94.78 86.07
హైదరాబాద్ 86.52 69.33
జోద్‌పూర్ 96.59 92.98
రోపర్ 88.49 75.34
పాట్నా 97.65 90.03
ఇండోర్ 96.74 85.71
మండీ 98.13 84.03
పాలక్కాడ్ 97.27 82.03
తిరుపతి 94.57 86.57
జమ్మూ 92.08 70.25
భిలాయ్ 89.92 72.22
గోవా 98.65 92.73
ధార్వాడ్ 90.20 65.56
–––––––––––––––––––––––––––––
మొత్తం 449/410