
అంచనాలు అడ్డగోలు పెంపులో అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్
బ్యాంకుల అప్పుతో చేపట్టిన పనుల్లో భారీ దోపిడీ
ఎన్‌హెచ్–16 వరకు ఈ–13 రహదారి పొడిగింపు పనుల్లో మాయాజాలం!
6 లేన్లతో 7.29 కి.మీ. పొడవునా కాంట్రాక్టు విలువ రూ.384.78 కోట్లు
సీనరేజీ, జీఎస్టీ, న్యాక్ రూపంలో రూ.81.92 కోట్లు తిరిగి చెల్లింపు
అంటే ఈ–13 రహదారి పొడిగింపు పనుల కాంట్రాక్టు విలువ రూ.466.7 కోట్లు
ఇదే పద్ధతిలో కి.మీ.కు రూ.20 కోట్లతో హైవేలను నిర్మిస్తున్న ఎన్‌హెచ్‌ఏఐ
రాష్ట్రంలో సిండికేటు కాంట్రాక్టర్లకు కట్టబెట్టడానికే అంచనాలను పెంచేస్తున్నారంటున్న నిపుణులు
సాక్షి, అమరావతి: రాజధానిలో నిర్మాణ పనుల అంచనా వ్యయాలను ఏడీసీఎల్ (అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) అడ్డగోలుగా పెంచేస్తోంది. ప్రధానంగా రహదారుల విషయంలో తన రికార్డును తానే బద్దలు కొట్టింది. ఎన్–12 రహదారిలో మిగిలిన పనుల పూర్తికి కిలో మీటరుకు సగటున రూ.53.88 కోట్లుగా నిర్ణయించి కాంట్రాక్టర్లకు అప్పగించిన ఏడీసీఎల్.. తాజాగా ఈ–13 రహదారిని ఎన్‌హెచ్–16 (కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారి) వరకు పొడిగించే పనులకు కి.మీ.కు సగటున రూ.64.01 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించింది. ఈ నెల 7న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
» ఈ–13 రహదారిని నిర్మిస్తున్న పద్ధతిలోనే ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) దేశంలో ఇతర ఆరు లేన్ల రహదారులను అన్ని పన్నులతో కలిపి కి.మీ.కు సగటున రూ.20 కోట్లతో నిరి్మస్తోందని, కానీ, రాష్ట్రంలో మాత్రం ముఖ్య నేత ఏర్పాటు చేసిన సిండికేట్ కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టేందుకే అంచనా వ్యయాలను ఏడీసీఎల్ అధికారులు అమాంతంగా పెంచేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
» ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు), హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ నుంచి అధిక వడ్డీలకు తెచ్చిన అప్పుతో చేపట్టిన పనుల్లో భారీ దోపిడీకి తెర తీశారంటూ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
» రాజధానిని ఎన్‌హెచ్–16తో అనుసంధానం చేసేలా ఈ–13 రహదారిని 7.29 కిలోమీటర్ల పొడవునా ఒక్కో వరుస ఆరు లేన్‌లతో విస్తరించే పనులను ఏడీసీఎల్ చేపట్టింది.
» ఆరు లేన్‌లు.. ఒక్కో వైపు 50 మీటర్ల వెడల్పు (ఒక్క ఈ–3 రహదారి మాత్రమే ఒక్కో వైపు 60 మీటర్లు వెడల్పు)తో రహదారిని నిర్మించడం, వరద నీటి మళ్లింపు పనులు, వీధి దీపాలు, ఫుట్‌పాత్, స్ట్రీట్ ఫర్నిచర్‌తో ఈ–13 రహదారిని పొడిగించే పనులకు రూ.384.78 కోట్లతో ఏడీసీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
» న్యాక్, జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.81.92 కోట్లను రీయింబర్స్ చేస్తామని టెండర్ డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. ఈ లెక్కన 7.29 కి.మీ.ల పొడవున నిర్మిoచే రహదారి కాంట్రాక్టు విలువ రూ.466.7 కోట్లు అవుతుంది. అంటే.. అప్పుడు కిమీకు రూ.64.01 కోట్లు వ్యయం చేస్తుందన్నది స్పష్టమవుతోంది.
» సిండికేట్ కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టి.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ముట్టజెప్పిన దగ్గరనుంచి చేసిన పనులకు బిల్లులు చెల్లించేదాక నీకింత నాకింత అంటూ పంచుకోవడానికి ముఖ్య నేత ప్రణాళిక రచించారని, అందుకే ఏడీసీఎల్ భారీఎత్తున అంచనాలను పెంచేస్తోందనే అభిప్రాయం నిపుణుల్లో బలంగా వ్యక్తమవుతోంది.