
రాజ్యసభలో కేంద్రమంత్రి జయంత్ చౌదరి వెల్లడి
ఆ ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 7.86 లక్షల మంది పారిశ్రామికవేత్తల రాక
పీఎంఈజీపీ కింద 14,969 కుటీర పరిశ్రమలు.. 2,106 స్టార్టప్‌లు..
7,69,447 ఎంఎస్‌ఎంఈ యూనిట్ల ఏర్పాటు
పరిశ్రమలు రాలేదంటూ టీడీపీ కూటమి దుష్ప్రచారానికి కేంద్రం కళ్లెం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలు మూతపడిపోయాయని, కొత్తగా ఒక్కటి కూడా రాలేదంటూ టీడీపీ కూటమి నేతల అడ్డగోలు ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేసింది. గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో కొత్తగా 7,86,984 మంది కొత్త పారిశ్రామికవేత్తలు తయారైన విషయాన్ని రాజ్యసభకు వెల్లడించింది.
ఈ కాలంలో రాష్ట్రంలోకి కొత్తగా వచ్చిన పరిశ్రమలు, కొత్త పారిశ్రామికవేత్తల వివరాలను సంవత్సరాల వారీగా గణాంకాలతో కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ మంత్రి జయంత్ చౌదరి వివరించారు. ఇప్పటికే అప్పుల విషయంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై టీడీపీ కూటమి అడ్డగోలుగా బురదజల్లుతూ అభాసుపాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు పరిశ్రమల విషయంలోనూ కేంద్రం చేసిన తాజా ప్రకటనతో కూటమి దుష్ప్రచారానికి కళ్లెం వేసినట్లయింది.
కొత్తగా 7,69,447 ఎంఎస్‌ఎంఈ యూనిట్ల ఏర్పాటు..
ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘ఉద్యమ్’ పోర్టల్‌లో సంవత్సరాల వారీగా కొత్తగా ఏర్పాటైన యూనిట్ల సంఖ్యనూ వివరించింది. దీని ప్రకారం.. జూన్ 1, 2020 నుంచి ఈ ఏడాది మార్చి 15 వరకు రాష్ట్రంలో కొత్తగా 7,69,447 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇందులో అత్యధికంగా సూక్ష్మస్థాయి (మైక్రో) యూనిట్లు మహిళల పేరిట ఉండటం గమనార్హం. అలాగే, ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జెనరేషన్ ప్రోగ్రాం (పీఎంఈజీపీ) కింద గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో కొత్తగా 14,969 యూనిట్లు ప్రారంభం కాగా.. ఇందులో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఊపిరిపోసుకున్నాయి.
స్టార్టప్‌ల జోరు..
గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో భారీగా స్టార్టప్‌లు ఏర్పాటైనట్లు కేంద్రం ప్రకటించింది. డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) గుర్తింపు పొందిన 2,106 సార్టప్‌లు రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో వచ్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు. వినూత్నమైన ఆలోచనలతో వచ్చిన విద్యార్థులను చేయిపట్టి వారి ఆలోచనను ఒక కంపెనీగా రూపుదిద్దించడానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏ విధంగా నడిపించిందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.
ఇందులో 1,159 స్టార్టప్‌లకూ మహిళలే నేతృత్వం వహిస్తుండటం గమనార్హం. ఇక సంకల్ప పథకం కింద 212 యూనిట్లు, పీఎం సూర్యఘర్ పథకం అమలుకు అవసరమైన పరికరాలు అందించడానికి రెండు యూనిట్లు, అలాగే.. గడిచిన ఐదేళ్లలో 248 అగ్రి క్లినిక్ యూనిట్ల ఏర్పాటు ద్వారా అనేకమంది ఉపాధి పొందుతున్నట్లు కేంద్రం వెల్లడించింది.