
సాక్షి, తాడేపల్లి: టీడీపీ తోడేళ్లు.. జనసేన గుంటనక్కలు సోషల్ మీడియాలో మహిళలపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని.. ఈ నక్కలు, తోడేళ్లను పెంచి పోషిస్తోంది టీడీపీనే అంటూ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. శుక్రవారం ఆమె ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఫ్యామిలీ సహా అందరిపైనా ఇష్టానుసారం ట్రోల్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బరితెగించి పోస్టులు పెడతున్న వారిపై ఎందుకు కేసులు పెట్టటం లేదంటూ ఆమె ప్రశ్నించారు.
‘‘ఒకడ్ని అరెస్టు చేసినట్టు చూపించి మహిళా ఉద్దారకుల్లాగ ప్రమోషన్ చేసుకుంటున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ గుంటనక్కలు, తోడేళ్లను ఎందుకు అరెస్టు చేయలేదు?. వైఎస్ జగన్ ఫ్యామిలీ గురించి ఇష్టానుసారం మాట్లాడిన హోంమంత్రి అనితపై ఎందుకు కేసు పెట్టలేదు?. కేవలం కిరణ్ అనే వ్యక్తిని అరెస్టు చేయటం ఒక డ్రామా. టీడీపీ అంటేనే తెలుగు డ్రామా పార్టీ. అరెస్టయిన చేబ్రోలు కిరణ్ విచారణలో చంద్రబాబు, లోకేష్ పేర్లే చెప్పాడు. మరి చంద్రబాబు, లోకేష్‌లపై ఎందుకు కేసు పెట్టలేదు?’’ అంటూ శ్యామల ప్రశ్నలు గుప్పించారు.
‘‘మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే చంద్రబాబు, పవన్ స్టేజీల మీద స్కిట్‌లు చేసుకుంటున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు సైకో అని దుర్భాషలాడారు. ఇది కరెక్టా?. పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ దారుణంగా కించపరిచేలా మాట్లాడారు. వారిని చూసే వారి కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.ఐ-టీడీపీ పేరుతో విష వృక్షాన్ని పెంచి పోషిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులు కనీసం చదవడం లేదు. మహిళలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారు?. ఎంతమంది బాధితులను ఆమె పరామర్శించారు?’’ అని శ్యామల నిలదీశారు.
‘‘నా మీద కూడా దారుణంగా ట్రోల్స్ చేశారు. నా వ్యక్తిత్వహనానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో పీ4 కాదు ఏ4 అమలవుతోంది. ఏ4 అంటే అరాచకాలు, అక్రమాలు, అఘాయిత్యాలు, అప్పులు’’ అంటూ శ్యామల వ్యాఖ్యానించారు.
