పంబన్‌ 2.0 | India First Vertical Lift Pamban Bridge Ready for launch | Sakshi
Sakshi News home page

పంబన్‌ 2.0

Published Sun, Feb 9 2025 4:42 AM | Last Updated on Sun, Feb 9 2025 4:42 AM

India First Vertical Lift Pamban Bridge Ready for launch

ప్రారంభానికి సిద్ధమైన నిలువునా పైకి లేచే వంతెన 

దేశంలో మరో ఇంజనీరింగ్‌ అద్భుతం 

మండపం– రామేశ్వరాన్ని కలుపుతూ నిర్మాణం 

17 మీటర్లు నిటారుగా లేచే వంతెనలోని 73 మీటర్ల భాగం 

భారీ ఓడలు వెళ్లేందుకు వీలుగా నిర్మాణం 

త్వరలో జాతికి అంకితం చేయనున్న ప్రధాని  

పంబన్‌ (రామేశ్వరం) నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి  
దేశంలో మరో ఇంజనీరింగ్‌ అద్భుతం ప్రారంభానికి సిద్ధమైంది. సముద్రంలో నిర్మించిన తొలి వ ర్టీకల్‌ లిఫ్ట్‌(Vertical Lift) (నిలువునా పైకి లేచే) వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. భారీ పడవలు వెళ్లటానికి వంతెనలోని 73 మీటర్ల పొడవు, 660 టన్నుల బరువున్న ఒక భాగం అమాంతం 17 మీటర్ల ఎత్తుకు లేవటం దీని ప్రత్యేకత. తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ ఆధునిక హంగులతో దీనిని నిర్మించారు. 111 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించిన పాత వంతెన కాలం తీరిపోవటంతో దాని పక్కనే ఈ కొత్త వంతెనను నిర్మించారు. త్వరలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దీనిని జాతికి అంకితం చేయనున్నారు. వంతెనపై ట్రయల్స్‌ను శనివారం విజయవంతంగా చేశారు.

దూర ప్రయాణాన్ని తగ్గించేందుకు.. 
1914లో నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం తమిళనాడులోని మండపం (సముద్రం ప్రారంభమయ్యే ప్రాంతం) నుంచి పంబన్‌ (రామేశ్వరం దీవి ప్రారంభ చోటు) వరకు రైలు వంతెనను నిర్మించింది. ఆ సమయంలోనే వంతెన మధ్యలో పడవలకు దారిచ్చేందుకు రోలింగ్‌ లిఫ్ట్‌ ఏర్పాటు చేశారు. మధ్య భాగంలో వంతెన స్పాన్‌లు విడిపోయి ఉంటాయి. సిబ్బంది వాటికి ఏర్పాటు చేసిన చట్రంలో ఇనుప కమ్మీలతో తిప్పగానే ఆ రెండు భాగాలు రోడ్డు లెవల్‌ క్రాసింగ్‌ రైలు గేటు తరహాలు పైకి లేస్తాయి.

దీంతో పడవలు ముందుకు సాగుతాయి. ఆ తర్వాత మళ్లీ మూసి విడిపోయిన రైలు పట్టాలు కలిసిపోయేలా చేస్తారు. సముద్రపు నీటి ప్రభావంతో ఈ వంతెన తుప్పుపట్టి బలహీనపడింది. దీంతో రోలింగ్‌ లిఫ్ట్‌కు బదులుగా వ ర్టీకల్‌ లిఫ్ట్‌తో కొత్త వంతెనను నిర్మించారు. వంతెన మధ్యలో ఈ లిఫ్ట్‌ లేకపోతే నౌకలు రామేశ్వరం దాటిన తర్వాత ఉన్న మనదేశ చిట్టచివరి భూభాగం ధనుషో్కడి ఆవలి నుంచి తిరిగి రావాల్సి ఉంటుంది. దీనివల్ల 150 కి.మీ. అదనపు దూరాభారం అవుతుంది.  

వంతెన ప్రత్యేకతలు..
వంతెన నిర్మాణ వ్యయం రూ.540 కోట్లు. పొడవు 2.10 కి.మీ. 
 పిల్లర్లతో కూడిన పైల్స్‌ సంఖ్య 333 
సముద్రగర్భంలో సగటున 38 మీటర్ల లోతు వరకు పిల్లర్లు. వీటికోసం వాడిన స్టెయిన్‌లెస్‌ స్టీలు 5,772 మెట్రిక్‌ టన్నులు (రీయిన్‌ఫోర్స్‌మెంట్‌), స్ట్రక్చరల్‌ స్టీల్‌ 4,500 మెట్రిక్‌ టన్నులు. 

 సిమెంటు వినియోగం 3.38 లక్షల బస్తాలు. 25,000 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ 
పైకి లేచే భాగం బరువు 660 మెట్రిక్‌ టన్నులు. 
 స్పెయిన్‌ టెక్నాలజీతో ఈ వంతెనను నిర్మించారు. ఆ దేశానికి చెందిన టిప్స సంస్థను కన్సల్టెన్సీగా నియమించుకుని వంతెనను డిజైన్‌ చేయించారు. రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ దీనిని నిర్మించింది.  

 ప్రపంచంలో సముద్రపు నీరు, ఉప్పు గాలి ప్రభావంతో ఇనుము అతి వేగంగా తుప్పుపట్టే ప్రాంతం మియామీ. ఆ తర్వాత పంబన్‌ ప్రాంతమే. దీంతో కొత్త వంతెన తుప్పు బారిన పడకుండా జింక్, 200 మైక్రాన్ల ఆప్రోక్సీ సీలెంట్, 125 మైక్రాన్ల పాలీ సిలోక్సేన్‌తో కూడిన రంగు డబుల్‌ కోట్‌ వేశారు. కనీసం 35 సంవత్సరాల పాటు ఈ పొర తుప్పును అడ్డుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ పూస్తే మరికొంతకాలం తప్పు పట్టదు. 

  పాత వంతెనలో 16 మంది సిబ్బంది 45 నిమిషాల పాటు చట్రం తిప్పితే రెండు భాగాలు రెక్కాల్లా పైకి లేచేవి. కొత్త వంతెనలో కేవలం 5.20 నిమిషాల్లో 660 టన్నుల బరువున్న 72 మీటర్ల భాగం 17 మీటర్ల ఎత్తుకు లేస్తుంది.  
 ఈ వంతెనపై రైళ్లను గంటకు 80 కి.మీ. వేగంతో నడిపే వీలుంది. కానీ, రైల్వే సేఫ్టీ కమిషనర్‌ 74 కి.మీ. వేగానికి అనుమతించారు. పాత వంతెనపై గరిష్ట వేగం గంటకు 10 కి.మీ. మాత్రమే.  
  నిర్మాణ పనులు 2019లో మొదలయ్యా­యి. కొవిడ్‌ వల్ల కొంతకాలం ఆలస్యమైనా, మొత్తంగా 2 సంవత్సరాల్లోనే పూర్తిచేశారు.  

 2022 డిసెంబర్‌లో పాత వంతెనపై రైళ్ల రాకపోకలు నిలిపేశారు. అప్పట్లో రోజుకు 18 ట్రిప్పుల రైళ్లు తిరిగేవి. కొత్త వంతెన అందుబాటులోకి వస్తే మరిన్ని రైళ్లు తిప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  
లిఫ్టు టవర్లకు 310 టన్నుల బరువు తూగే భారీ స్టీల్‌ దిమ్మెలు రెండు వైపులా కౌంటర్‌ వెయిట్స్‌గా ఏర్పాటు చేశారు. కరెంటు శక్తితో వంతెన భాగం పైకి లేవటం మొదలుకాగానే కౌంటర్‌ వెయిట్స్‌ మరోవైపు దిగువకు జారటం ద్వారా వంతెన భాగం పైకి వెళ్లేలా చేస్తాయి. దీంతో 5 శాతం కరెంటు మాత్రమే ఖర్చవుతుంది.  

 లిఫ్ట్‌ టవర్‌ పైభాగంలో ప్రత్యేకంగా స్కాడా (సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డేటా అక్విజిషన్‌) సెంటర్‌ ఏర్పాటు చేశారు. వంతెన భాగంలో ఎక్కడైనా లోపాలు తలెత్తితే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. అక్కడి భారీ కంప్యూటర్‌లో లోపాలను చూపుతుంది.  
  రైల్వేలో సీనియర్‌ ఇంజనీర్, విజయనగరం జిల్లాకు చెందిన నడుకూరు వెంకట చక్రధర్‌ ఈ వంతెన నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం దాని ఇన్‌చార్జిగా ఉన్నారు.  

1964 డిసెంబర్‌ 22న పెను తుఫాను కారణంగా 25 అడుగుల ఎత్తులో ఎగిసిపడ్డ అలలు, బలమైన గాలులతో పంబన్‌ వంతెన ధ్వంస­మైంది. రాత్రి 11.50 సమయంలో వంతెన మీదుగా వెళ్తున్న 653 నంబర్‌ రైలు కొట్టుకుపోయి అందులోని 190 మంది ప్రయాణికులు మృతి చెందారు. కానీ, వంతెనలోని షెర్జర్‌ రోలింగ్‌ లిఫ్ట్‌ భాగం మాత్రం కొట్టుకుపోకుండా నిలిచింది. మెట్రో మ్యాన్‌గా పిలుచుకుంటున్న ఈ. శ్రీధరన్‌ ఆధ్వర్యంలో 46 రోజుల్లోనే వంతెనను పునరుద్ధరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement