
సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయ విధానాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆచరణలోకి తెచ్చిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుతమైన చర్యలు తీసుకున్నారని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ ప్రశంసించారు. ప్రకృతి వ్యవసాయ విధానాలపై నీతి ఆయోగ్ సోమవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వర్చువల్ సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి కీలక అంశాలను సదస్సు దృష్టికి తెచ్చినందుకు సీఎం జగన్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేసిందన్నారు.
ఆర్బీకేల సేవలు అభినందనీయం
వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల పని తీరును డాక్టర్ రాజీవ్‌కుమార్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు. తాను ప్రత్యక్షంగా ఆర్బీకేలను పరిశీలించానని, అవి అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.