
సాక్షి, రాజంపేట (అన్నమయ్య): మనసున్న ముఖ్యమంత్రి అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి నిరూపించుకున్నారని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. గురువారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చెయ్యేరులో వరద బీభత్సానికి సర్వం కోల్పోయిన వారికి ఇంటి స్థలంతోపాటు, ఇంటి నిర్మాణానికి అదనంగా రూ.5లక్షలు మంజూరు చేయాలని సీఎంను కోరామన్నారు. దీంతో ఒక్కో ఇంటికి రూ.5లక్షలు పెంచుతూ ప్రభుత్వం జీఓ జారీ చేసిందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు వివరించారు. పులపుత్తూరులో మొదటి లే అవుట్‌లో 160, రెండవ లే అవుట్‌లో 101, మూడవ లే అవుట్‌లో 62, తొగురుపేటలో 69, రామచంద్రాపురంలో 56 ఇళ్లను మంజూరు చేశారని ఎమ్మెల్యే తెలిపారు.
రాజంపేట నుంచి ఏ కార్యాలయం తరలింపు లేదు
పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రం రాజంపేట నుంచి ఏ కార్యాలయం తరలించేది లేదని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి స్పష్టంచేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పీసీ యోగీశ్వరరెడ్డి, ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ ఉమామహేశ్వరరెడ్డి, మాజీ చైర్మన్ పోలి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.