
నాడు ఊరికో సచివాలయం, ఆర్బీకే, డిజిటల్ లైబ్రరీ
ఆధునిక సౌకర్యాలతో విలేజ్ క్లినిక్, పాఠశాలలూ కళకళ
బడ్జెట్‌లో వీటి ఊసెత్తని ప్రభుత్వం.. గ్రామీణుల ఆగ్రహం
సాక్షి, అమరావతి : పల్లెలు కళ తప్పుతున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వంలో కళావిహీనంగా తయారవుతున్నాయి. బడ్జెట్‌లో పల్లెల ప్రగతి కోసం పైసా కూడా కేటాయించక పోవడం పట్ల గ్రామీణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతికి బాటలు పడ్డాయి. 2 వేల జనాభా కలిగిన ప్రతి గ్రామంలో ఓ సచివాలయం, ఆ పక్కనే రైతుల కోసం ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రం, పల్లెవాసుల ఆరోగ్య పరిరక్షణ కోసం విలేజ్ క్లినిక్, పిల్లల చదువుల కోసం డిజిటల్ లైబ్రరీ.. నాడు–నేడు ద్వారా ఆధునిక సౌకర్యాలతో రంగు రంగుల స్కూళ్లు.. ఇలా గ్రామ స్వరూపాన్నే మార్చేశారు.
ప్రతి గ్రామంలో కోట్ల రూపాయల ఆస్తులు ఏర్పాటు చేశారు. ఈ విధంగా రూ.4,750 కోట్లతో 10,893 సచివాలయ భవనాలు మంజూరు చేయగా, 9,585 సచివాలయాల భవన నిర్మాణాలు చేపట్టి, 6,879 సచివాలయాలు పూర్తి చేసి అప్పగించారు. రూ.575 కోట్లతో 3,589 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపట్టారు. నాడు–నేడు పథకం కింద గ్రామాల్లో ఉండే పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు శ్రీకారం చుట్టి.. తొలి విడతలో రూ.3,669 కోట్లతో 15,715 స్కూల్స్‌ను అభివృద్ధి చేశారు.
రెండో విడతలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలలు, 447 జూనియర్ కళాశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.1,726 కోట్లతో 8,299 విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం చేపట్టి, 3,104 భవనాల నిర్మాణం పూర్తి చేశారు. రూ.2,446 కోట్లతో 10,216 ఆర్బీకేల నిర్మాణం చేపట్టగా, దాదాపు రూ.1,300 కోట్లు ఖర్చు చేసి 5,333 ఆర్బీకే భవనాలు పూర్తి చేసి అప్పగించారు. రూ.281 కోట్లతో 1,589 బల్క్ చిల్లింగ్ సెంటర్లు నిర్మించారు. నిర్మాణంలో ఉన్న మిగిలిన భవనాలన్నీ దాదాపు 70–80 శాతం పూర్తయ్యాయి.
కొద్దిపాటి నిధులు కేటాయిస్తే వీటి నిర్మాణం పూర్తవుతుంది. అలాంటిది బడ్జెట్‌లో వీటి ప్రస్తావన మాట మాత్రంగా కూడా లేకపోవడం విచారకరం. గతేడాది బడ్జెట్‌లో పైసా కేటాయించలేదు. కనీసం ఈ ఏడాదైనా నిధుల కేటాయింపులుంటాయని భావించారు. వీటిని పూర్తి చేస్తే వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందనే దురాలోచనతోనే ఇలా నిర్లక్ష్యం చేశారని ప్రజలు మండి పడుతున్నారు.