సూపర్‌ సిక్స్‌పై పిల్లి మొగ్గలు | Chandrababu Naidu on Super Six promises | Sakshi
Sakshi News home page

సూపర్‌ సిక్స్‌పై పిల్లి మొగ్గలు

Published Sun, Mar 30 2025 3:28 AM | Last Updated on Sun, Mar 30 2025 10:21 AM

Chandrababu Naidu on Super Six promises

ఎన్నికలకు ముందు అమలు చేయగలనని అనుకున్నానని చంద్రబాబు కొత్త రాగం 

హామీలపై బాబు మరోసారి మోసం

అప్పులపై అబద్ధాలతో తప్పించుకునేందుకు ఎత్తుగడ 

2014–19లోనూ హామీలకు ఎగనామం 

ఇప్పుడూ అదే పంథాలో ప్రజలను ఏమార్చే ప్రయత్నాలు

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి ప్రజలను బుట్టలో వేసుకున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎగ్గొట్టేందుకు సాకులు వెతుక్కొంటున్నారు. ఇప్పటికే సూపర్‌ సిక్స్‌ హామీలు ఎలా అమలు చేయాలో అర్థం కావడంలేదని, డబ్బుల్లేవంటూ కూనిరాగాలు తీసిన చంద్రబాబు.. తాజాగా ఎన్నికలకు ముందు బయట నుంచి చూసినప్పుడు సూపర్‌ సిక్స్‌ అమలు చేయగలనని అనుకున్నానని, కానీ పరిస్థితులు మరోలా ఉన్నాయని టీడీపీ ఆవిర్భావ సభలో కొత్త రాగం మొదలెట్టారు. సంపద సృష్టించకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తే తర్వాత వాటిని కొనసాగించలేమంటూ మాయమాటలు చెబుతున్నారు. 

అదేపనిగా అబద్ధాలు చెప్పి ఇప్పుడు ప్లేటు ఫిరాయింపు 
2014లో మోసం చేసినట్లే, 2024లోనూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు, దొంగ హామీలిచ్చారు. సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రజల జీవితాలను మార్చేస్తానని మభ్యపెట్టారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో రూ.15 వేలు ఇస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఏటా రూ. 18 వేలు ఇస్తామన్నారు.  20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇలా అనేక హామీలిచ్చి అన్నీ ఎగ్గొట్టారు. ఏ కుటుంబానికీ ఒక్క రూపాయి కూడా లబ్ధి చేకూర్చలేదు.   

అప్పుల పైనా తప్పుడు లెక్కలే 
సూపర్‌ సిక్స్‌ అమలు ప్రస్తావన వచ్చినప్పుడల్లా అప్పులను బూచిగా చూపిస్తున్న చంద్రబాబుకు.. ఆ అప్పులపైనా తప్పుడు లెక్కలే చెబుతున్నారు. మొన్నటి వరకు గత ప్రభుత్వం అప్పులు రూ. 14 లక్షల కోట్లంటూ అసత్యాలు ప్రచారం చేశారు. ఆయన చెప్పిన లెక్క తప్పని ఆయన ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిన గణాంకాలే స్పష్టం చేశాయి. ప్రభుత్వ అప్పులు రూ. రూ. 6.54 లక్షల కోట్లని వెల్లడించారు. మళ్లీ పార్టీ ఆవిర్భావ సభలో రాష్ట్రం అప్పు రూ. 9.74 లక్షల కోట్లంటూ మరో లెక్క చెప్పి, ప్రజలను ఏమార్చి, హామీలను ఎగ్గొడుతున్నారు. 

2014లోనూ అదే మోసం 
నిజానికి చంద్రబాబుకు ఇచ్చిన హామీలను అమలుచేసే అలవాటు మొదటి నుంచీ లేదు. అవసరం కోసం ఏదైనా చెప్పడం, ఆ తర్వాత ప్రజలను మోసం చేయడం బాబు నైజం. 2014 ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్లు 600కి పైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. బేషరతుగా రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని, ఎవరూ రుణాలు చెల్లించద్దంటూ ఊరూవాడా చెప్పారు. 

ఈమాటల్ని నమ్మిన మహిళలు, రైతులు ఓట్లేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేయకుండా వారిని మోసం చేశారు. వడ్డీలు పెరిగిపోయి వారంతా డిఫాల్టర్లుగా మారిపోయారు. డ్వాక్రా రుణాలూ  రద్దు చేస్తానని చెప్పి మహిళలకు నయవంచన చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, లేదంటే నిరుద్యోగ భృతి అంటూ యువతనూ వంచించారు.     

వైఎస్‌ జగన్‌ ఆనాడే చెప్పారు 
చంద్రబాబు ఎడాపెడా ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదని ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా చెప్పారు. గణాంకాలతో సహా వివరించారు. వైఎస్‌ జగన్‌ చెప్పిందే నిజమైంది. చంద్రబాబు ఒక్క హామీనీ అమలు చేయకుండా ప్రజలను నిలువునా ముంచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement