
స్త్రీనిధి బ్యాంకుపై కూటమి కన్ను
విద్యాలక్ష్మి, కల్యాణలక్ష్మి రుణాలకు ‘స్త్రీ నిధి’ సొమ్ములు
ఏటా రూ.1,000 కోట్లు ఆ రెండు పథకాలకే..
అక్క చెల్లెమ్మల సాధికారతకు రుణాలు సమకూరుస్తున్న స్త్రీ నిధి బ్యాంక్.. మహిళల ఆర్థిక అవసరాలు తీర్చేలా 12 ఏళ్ల క్రితం ఏర్పాటు
కల్యాణలక్ష్మి, విద్యాలక్ష్మికి బడ్జెట్‌లో పైసా కూడా కేటాయించని ప్రభుత్వం.. హామీని నిలబెట్టుకోకుండా, బడ్జెట్‌లో పథకాలకు నిధులు కేటాయించకుండా దొంగాట
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. యావత్ ప్రపంచం మహిళల హక్కులు, ఆర్థిక స్వావలంబన, ఉన్నతి కోసం మాట్లాడుకుంటున్న తరుణంలో చంద్రబాబు సర్కారు ఏకంగా మహిళా దినోత్సవం రోజే వారి సాధికారతకు తూట్లు పొడిచింది! అక్కచెల్లెమ్మల అభ్యున్నతి కోసం ఏర్పాటైన స్త్రీ నిధి బ్యాంకును పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అడుగులు వేస్తోంది. కూటమి సర్కారు కొత్త పథకాలు విద్యాలక్ష్మి, కల్యాణలక్ష్మి కోసం ఇచ్చే రుణాలను స్త్రీ నిధి బ్యాంకు నుంచి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో బ్యాంకు మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది.
అదే అంతకు ముందు గత ఐదేళ్లూ మహిళా సాధికారతే ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రతి అడుగూ వేశారు. అన్ని పథకాలను మహిళల పేరిటే అమలు చేసి ఆర్థిక ఆసరా కల్పించారు. ప్రతి పథకానికి బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించి చిత్తశుద్ధిని చాటుకున్నారు. వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల ద్వారా ఏకంగా రూ.427.27 కోట్ల మొత్తాన్ని అర్హులకు పారదర్శకంగా అందించారు.
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలకు స్త్రీ నిధి బ్యాంకు ఇచ్చే రూ.4 వేల కోట్ల రుణాల్లో రూ.1,000 కోట్ల చొప్పున కళ్యాణలక్ష్మీ, విద్యాలక్ష్మీ పథకాలకు నాలుగు శాతం వడ్డీకి రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. మొత్తం రుణాల్లో నాలుగో వంతు రుణాలను తక్కువ వడ్డీకి ఇవ్వడం వల్ల స్త్రీ నిధి సంస్థ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోనుంది. గత ఐదేళ్లలో స్త్రీ నిధికి సంబంధించి దాదాపు రూ.4 వేల కోట్లు నిరంతరం పొదుపు సంఘాల మహిళల వద్ద రుణాలు రూపంలో ఉన్నాయి.
పథకాల అమలుకు చిత్తశుద్ధితో బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా ఇలా అడ్డదారిలో మళ్లించడం వల్ల పొదుపు సంఘాల వ్యవస్థ దెబ్బతింటుందనే ఆందోళన మహిళల్లో వ్యక్తమవుతోంది. కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా మహిళలను మోసం చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ‘స్త్రీ నిధి’ నిధులను వాడుకోవాలని నిర్ణయించింది. కోటి మందికి పైగా ఉన్న పొదుపు మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే సంస్థ నిధులను వాడుకోవడం అంటే.. ఆ మేరకు డ్వాక్రా మహిళల రుణాల లభ్యత తగ్గించడమేననే ఆందోళన వ్యక్తమవుతోంది.
అత్యవసర సమయాల్లో ఆర్థిక తోడ్పాటు అందించే స్త్రీ నిధి బ్యాంకును నష్టాల ఊబిలోకి గెంటేస్తోందని, సర్కారు నిర్వాకాలతో సంస్థ మూతపడితే పేద మహిళల ఆర్థిక అవసరాలకు తోడ్పాటు కరువై దిక్కుతోచని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పథకాల అమలుకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు లేకుండా.. స్త్రీ నిధి ద్వారా రుణాలు ఇప్పించాలన్న కూటమి సర్కారు యోచనపై అధికారులు విస్తుపోతున్నారు.
7 శాతం వడ్డీకి అప్పులు తెచ్చి... 4 శాతం వడ్డీకి రుణాలివ్వాలట!
సొంత నిధులు తక్కువగా ఉండే స్త్రీ నిధి బ్యాంకు ఇతర బ్యాంకుల నుంచి ఏడు శాతం వడ్డీకి తీసుకొచ్చిన డబ్బులనే 11 శాతం వడ్డీకి పొదుపు మహిళలకు రుణంగా ఇస్తూ ఉంటుంది. ఏడు శాతానికి పైన తీసుకొనే నాలుగు శాతం వడ్డీలో రెండు శాతం వడ్డీ డబ్బులను తిరిగి గ్రామ, మండల సమాఖ్యలకు, మిగిలిన 2 శాతం వడ్డీ డబ్బులను స్త్రీ నిధి సిబ్బంది జీతాలు, సంస్థ నిర్వహణకు వినియోగిస్తుంటారు.
స్త్రీ నిధి సంస్థ ఏడు శాతం వడ్డీకి తెచ్చుకుంటున్న నిధులను ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఆలోచన చేస్తున్న కళ్యాణలక్ష్మీ, విద్యాలక్ష్మీ పథకాల లబ్దిదారులకు నాలుగు శాతం వడ్డీకే రుణాలు ఇప్పించేలా కసరత్తు చేశారు. ఈ ప్రక్రియకు సంబంధించి ప్రణాళిక ఇప్పటికే దాదాపు కొలిక్కి వచ్చింది. అంటే మూడు శాతం చొప్పున వడ్డీ డబ్బులను స్త్రీ నిధి బ్యాంకు నష్టపోవాల్సి ఉంటుంది.
ఈ పథకాలు అమలు చేయడం వల్ల స్త్రీ నిధి సంస్థకు ఆర్థికంగా వాటిల్లే నష్టానికి సంబంధించి తిరిగి చెల్లింపులు, అదనపు సాయం అందించడం గురించి ఇప్పటిదాకా ప్రభుత్వ స్థాయిలో జరిగిన కసరత్తులో ఎక్కడా కనీసం చర్చ జరగలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. పూర్తిగా స్త్రీ నిధి సంస్థ నిధులతోనే ఈ పథకాలను అమలు చేసేలా అడుగులు పడుతున్నాయి. ఒకవైపు వడ్డీకి తెచ్చుకునే డబ్బులను మరోవైపు అంతకంటే తక్కువ వడ్డీకి రుణాలుగా ఇవ్వడం ద్వారా స్త్రీ నిధి సంస్థ నష్టాల ఊబిలోకి వెళ్లి మూతపడే అవకాశం ఉంటుందని మహిళా సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.
స్త్రీ నిధి బ్యాంకు నిబంధనలివీ..
స్త్రీ నిధి బ్యాంకు అందించే రుణాలను పేద మహిళల కుటుంబాల జీవనోపాధుల పెంపు లేదా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కోసమే వెచ్చించాలి. రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళల ఆదాయం పెరిగేలా తోడ్పాటునివ్వాలి.

స్త్రీ నిధి నిబంధనలు గాలికి..
సాధారణంగా పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండే మహిళలు బ్యాంకు లింకేజీ కార్యక్రమంలో కమర్షియల్ బ్యాంకు ద్వారా రుణాలు పొందుతుంటారు. బ్యాంకు లింకేజీ ద్వారా మహిళలు పొందే రుణాలను మూడు నాలుగేళ్ల కాల పరిమితితో నెలవారీ కిస్తీ రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం క్యాష్ అండ్ క్రెడిట్ విధానం అమలులో ఉన్నా.. ఒక్కో సంఘం మూడు నాలుగేళ్లకు ఒకసారే బ్యాంకు లింకేజీ లోన్లు తీసుకుంటాయి.
పొదుపు సంఘం ద్వారా మహిళలు ఒకసారి బ్యాంకు లింకేజీ రుణం పొందిన తర్వాత అత్యవసర సమయాల్లో స్త్రీ నిధి ద్వారా అదనపు ఆర్థిక రుణాన్ని పొందుతుంటారు. పొదుపు మహిళలకు బ్యాంకు లింకేజీ కార్యక్రమంలో రుణాలిచ్చినా, స్త్రీ నిధి ద్వారా రుణాలిచ్చినా నిబంధనల ప్రకారం ఆయా కుటుంబాల జీవనోపాధుల పెంపు లేదా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కోసమే వెచ్చించాలి.
ఆ రుణాలను ఉపయోగించుకొని తమ ఆదాయం పెంచుకోవాలి. అయితే కూటమి సర్కారు ఆలోచన దీనికి భిన్నంగా ఉంది. స్త్రీ నిధి బ్యాంకు నిబంధనలను తుంగలో తొక్కి కొత్త పథకాలకు మళ్లిస్తోంది.
జగన్ హయాంలో ప్రభుత్వమే నేరుగా సాయం..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పాటు పేద కుటుంబాల పిల్లల చదువులకు అండగా నిలుస్తూ అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యాదీవెన పథకాల ద్వారా తిరిగి చెల్లించే అవసరం లేకుండా నేరుగా పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసింది. కళ్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల ద్వారా రూ.427.27 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని విధానంలో అర్హులకు అందించింది.
ఎన్నికల ముందు ఎడాపెడా హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు లబ్ధిదారులంతా తప్పనిసరిగా తిరిగి చెల్లించాల్సిన రుణాల రూపంలో విద్యాలక్ష్మీ, కళ్యాణలక్ష్మీ పథకాల అమలుకు సిద్ధమైంది. ఇందుకోసం 12 ఏళ్లుగా కోటి మందికి పైగా పొదుపు మహిళల ఆర్థిక అవసరాలు తీర్చిన స్త్రీ నిధి సంస్థను బలి పెడుతోంది. స్త్రీ నిధిని నష్టాల్లోకి నెట్టి నిర్వీర్యం చేసేలా అడుగులు వేయటాన్ని మహిళా సంఘాలు, రాజకీయ వర్గాలు తప్పుబడుతున్నాయి.
నిధులు మళ్లిస్తే ఊరుకోం
స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాదులను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన స్త్రీ నిధి నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తే ఊరుకునేది లేదు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ప్రకటించిన కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలి. ఆ పథకాల అమలుకు బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడం అన్యాయం. పొదుపు మహిళల అభ్యున్నతికి ఉద్దేశించిన స్త్రీ నిధిని మళ్లించేందుకు యత్నిస్తుండటం దారుణం. దీనివల్ల పొదుపు మహిళల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలి. – పి.నిర్మలమ్మ, ఐద్వా సీనియర్ నాయకురాలు, కర్నూలు
స్త్రీ నిధిని మళ్లించడం దారుణం
టీడీపీ కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమ పథకాలకు గండికొడుతోంది. మహిళా సాధికారిత గురించి గొప్పలు చెబుతూ కల్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవటాన్ని బట్టి పాలకులకు చిత్తశుద్ధి లేదని రుజువవుతోంది. స్త్రీ నిధి బ్యాంకు రుణాలను ఇతర పథకాలకు మళ్లించే యత్నాలు సిగ్గుచేటు. ప్రభుత్వ మోసపూరిత విధానాలను మహిళలు గమనిస్తున్నారు. – ఎం.విజయ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రకాశం జిల్లా అధ్యక్షురాలు
ఊరుకునేది లేదు..
కూటమి ప్రభుత్వం స్త్రీ నిధిని ఇతర పథకాలకు మళ్లిస్తే ఊరుకునేది లేదు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో డ్వాక్రా మహిళలకు రుణాలు తగ్గే ప్రమాదం ఉంది. బ్యాంకు నిబంధనలను తుంగలో తొక్కి అసంబద్ధ నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. – చిట్టెమ్మ, డ్వాక్రా సంఘం సభ్యురాలు, చిత్తూరు జిల్లా.
నిధులు కేటాయించకపోవడం దారుణం
కళ్యాణలక్ష్మీ, విద్యాలక్ష్మి పథకాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం దారుణం. డ్వాక్రా మహిళల సాధికారతకు రుణాలు సమకూరుస్తున్న స్త్రీ నిధి బ్యాంకు నిధులను ఈ పథకాలకు మళ్లిస్తే డ్వాక్రా మహిళలకు సమస్యలు తప్పవు. డ్వాక్రా నిధులతో కుటుంబాలను నెట్టుకొస్తున్న పేద వర్గాల మహిళలు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పిస్తోంది.
డ్వాక్రా మహిళలకు స్త్రీ నిధి రుణాలు అందని పరిస్థితి ఉత్పన్నం కానుంది. డ్వాక్రా మహిళలకు ద్రోహం తలపెట్టే యత్నాలను విరమించుకోవాలి. కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలి. డ్వాక్రా మహిళలకు ఇబ్బంది లేకుండా బ్యాంకు రుణాలను సక్రమంగా అందించి ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – ఇ.చంద్రావతి, శ్రామిక మహిళా సంఘాల ప్రతినిధి, కాకినాడ జిల్లా