
బాక్సు గరిష్ట ధర రూ.90
కనిష్టం కేవలం రూ.30
రైతులకు కోత కూలి సైతం దక్కని దైన్యం
ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతుకు తీరని కష్టం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులకు ఏటా వేసవిలో టమాటానే ప్రధాన పంట. ఈ దఫా సీజన్ మొదలైనప్పటినుంచి టమాటా ధర భారీగా పతనమయ్యింది. పలమనేరు టమాటా మార్కెట్‌లో గురువారం 15 కిలోల బాక్సు గరిష్ట ధర రూ.90, కనిష్ట ధర రూ.30 మాత్రమే పలికింది. దీనితో కనీసం టమాటాలను కోసే కూలీల ఖర్చు సైతం రైతులకు దక్కని పరిస్థితి నెలకొంది. – పలమనేరు
పలమనేరు హార్టికల్చర్ డివిజన్‌లో సాగు వివరాలు
వేసవిలో టమాటా సాధారణ సాగు: 5 వేల హెక్టార్లు
ప్రస్తుతం సాగైన పంట: 7వేల హెక్టార్లు
ఇప్పుడు కోత దశలో ఉన్న తోటలు: 600 హెక్టార్లు
బయటి రాష్ట్రాల్లో సీజన్...
ప్రస్తుతం చత్తీస్‌ఘడ్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణాల్లో సీజన్ ఆఖరు దశలో ఉంది. అక్కడి అవసరాలకు లోకల్ సరుకు సరిపోతోంది. దీంతో అక్కడి వ్యాపారులు ఇక్కడికి రావడం లేదు. ఈ పరిస్థితుల్లో లోకల్ వ్యాపారులు మాత్రమే ఇక్కడి టమాటాలను కొనుగోలు చేస్తున్నారు. దీనితో టమాటా ధర అమాంతం పడిపోయింది.
అనంతపురం జిల్లాలో రోజుకు 700 మెట్రిక్ టన్నులు...
ఇక అనంతపురం జిల్లానుంచి ఎక్కువగా టమాటాలు స్థానిక మార్కెట్లకు చేరుతున్నాయి. ప్రస్తుతం ఆ జిల్లాలో 700 మెట్రిక్ టన్నుల టమాటా ప్రతిరోజూ మార్కెట్లకు వస్తోంది. నిత్యం అక్కడినుంచి 300 టన్నుల దాకా సరుకు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లోని పలు మార్కెట్లకు చేరుతోంది. ఫలితంగా డిమాండ్ కంటే ఎక్కువగా సరఫరా ఉంటోంది.
ప్రభుత్వం ఆదుకోవాలి
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎకరా పొలంలో టమాటా పేపర్ చేసి నాటాలంటే రూ.2 లక్షలు పెట్టుబడిగా పెట్టాలి.ఈ ధరతో పంట పెట్టుబడి కూడా దక్కదు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. – రామన్న, కురపల్లి, పలమనేరు మండలం
వచ్చేనెల నుంచి ఎగుమతులకు అవకాశం
నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఏప్రిల్ 2 నుంచి ఎగుమతులకు టెండర్లను పిలిచాం. ఆ తర్వాత ధరలు ఆశాజనకంగా ఉండొచ్చు. – సంజీవ కుమార్, ఏఎంసీ సెక్రటరీ, పలమనేరు