
సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరిలో సంచలనం రేపిన పరువు హత్య ఘటనలో మిస్టరీ వీడింది. చంద్రగిరి మండలం నరసింగాపురంలో నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనలో తల్లే నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. కూతురు నిఖిత ప్రేమ వ్యవహారం నచ్చకే ఆమె తల్లి సుజాత నిఖితను తలగడతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. నిఖిత తల్లి సుజాతను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
మిట్టపాళెనికి చెందిన అజయ్ అనే వ్యక్తిని 17 ఏళ్ల నిఖిత ప్రేమించింది. ఏడాది క్రితం కూతురు నిఖిత గర్భం దాల్చడంతో కడుపులోని బిడ్డను డెలివరీ చేసి మరి తల్లి సుజాత హత్య చేసినట్లు సమాచారం. నిఖిత తల్లిదండ్రులు పిర్యాదుతో అజయ్‌పై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. జైలుకు పంపారు. నాలుగు నెలల పాటు జైలులో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది.

బెయిల్ బయటకు వచ్చిన అజయ్‌ను మళ్లీ కలిసిన నిఖితపై కోప్పడిన తల్లి సుజాత.. గత శుక్రవారం నిద్రిస్తున్న కూతురిని చంపి గంటల వ్యవధిలో మృతదేహాన్ని కాల్చివేసింది. సాధారణ మరణంగా బంధువులను సుజాత నమ్మించింది. ఈ కేసులో సుజాతకు సహకరించిన వారు ఎవరనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో వాట్సాప్ చాట్ ద్వారా నిజాలు వెలుగు చూశాయి. తనకు విషం పెట్టి చంపేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ప్రియుడు అజయ్‌కు నిఖిత తెలిపింది. మా అత్త, అమ్మ, తాతయ్య విషం పెట్టీ చంపేందుకు కుట్రలు చేస్తున్నారంటూ నిఖిత పేర్కొంది. వాట్సాప్ చాట్.. పోలీసులకు కీలక ఆధారంగా మారింది.