వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ సైదులు
సాక్షి, మెదక్: నవమాసాలు కని పెంచిన కన్న తల్లిని ఆస్తి కోసం హతమార్చింది కన్న కూతురు. ఎవరికీ తెలియకుండా ప్రమాదవశాత్తు చనిపోనట్లు నమ్మించే ప్రయత్నం చేసినా, పోలీసు జాగిలం పసిగట్టి పట్టించింది. హవేలీఘనపూర్ మండలం తొగిట గ్రామంలో గురువారం జరిగిన హత్యకేసును పోలీసులు చేధించారు. గ్రామానికి చెందిన పుష్టి బాలమణి(50)ని కూతురు నర్సమ్మ హత్యచేసినట్లు ఒప్పుకుంది. కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం డీఎస్పీ సైదులు వివరించారు.
తల్లి బాలమణి పేరున ఉన్న 16 గుంటల పొలాన్ని తన పేరున పట్టా చేయాలని నర్సమ్మ ఒత్తిడి చేయగా, తాను బతికి ఉన్నంత వరకు పొలం ఇవ్వనని తల్లి ఖరాకండిగా చెప్పింది. దీంతో తల్లిపై కక్ష్య పెంచుకున్న నర్సమ్మ పథకం ప్రకారం తల్లికి మద్యం తాగించి, నూతనంగా నిర్మిస్తున్న భవనంపైకి తీసుకువెళ్లి కిందకు తోసింది. కింద పడిన తల్లి తలపై బండరాయి, కర్రతో కొట్టి చంపేసింది. ఎవరికి అనుమానం రాకుండా భవనంపై నుంచి తల్లి కిందపడిందంటూ గట్టిగా అరించింది.నర్సమ్మ కొడుకు 108 అంబులెన్స్‌కు ఫోన్‌చేయగా, సిబ్బంది వచ్చి, బాలమణి చనిపోయినట్లు నిర్దారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, డాగ్‌స్క్వాడ్‌తో పరిశీలించగా, నర్సమ్మ వద్దకు వెళ్లి ఆగింది. అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా నేరం ఒప్పుకుంది. ఈమేరకు నర్సమ్మపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment