మెడకోసి కొడుకును, తలనరికి తల్లిని..
ఆస్తి వివాదాల నేపథ్యంలో సవతి కుమారుడిపై అనుమానం
ఏలూరు జిల్లాలో దారుణం
మండవల్లి/కైకలూరు: ఏలూరు జిల్లా మండవల్లి మండలం గన్నవరంలో శుక్రవారం రాత్రి తల్లి, కొడుకు దారుణహత్యకు గురయ్యారు. శనివారం తెల్లవారి చుట్టుపక్కలవారు మృతదేహాలను గమనించడంతో హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి తగాదాల నేపథ్యంలో వీరి హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నవరం గ్రామానికి చెందిన రొయ్యూరు సుబ్బారావు, నాంచారమ్మ దంపతులకు నగేష్‌బాబు (55) సంతానం.
అతడు పుట్టిన తర్వాత నాంచారమ్మ మరణించడంతో ఆమె చెల్లెలు భ్రమరాంబను సుబ్బారావు రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి సురేష్ (35) సంతానం. సుబ్బారావు 20 సంవత్సరాల కిందట మరణించాడు. నగేష్‌బాబు విజయవాడలో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. ఐటీడీపీలో యాక్టివ్ మెంబర్‌గా కొనసాగుతున్న సురేష్ స్వగ్రామంలోనే ఉంటున్నాడు. ఈ కుటుంబానికి గన్నవరంలో 40 సెంట్ల పొలం, ఒక భవనం, 6 సెంట్ల స్థలం తండ్రి ఆస్తిగా ఉన్నాయి. వీటి విషయంలో నగేష్‌బాబు, సురేష్‌ల మధ్య విభేదాలున్నాయి.
కోర్టుల్లో కేసులు కూడా ఉన్నాయి. ఇటీవల 40 సెంట్ల పొలాన్ని చెరిసగం పంచుకున్నారు. భవనం విషయంలో గొడవలు ముదిరాయి. సురేష్ భార్య గాయత్రి తండ్రి సంవత్సరీకం కావడంతో భార్య, భర్త, పిల్లలు గురువారం ముసునూరు వెళ్లారు. తల్లి ఇంటివద్ద ఒంటరిగా ఉందని సురేష్ శుక్రవారం గన్నవరం వచ్చేశాడు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు ఇంట్లో మంచంపై పడుకున్న సురేష్ మెడను కోసి హత్యచేశారు.
బయట పడుకున్న భ్రమరాంబను తలపై నరికి చంపేశారు. శనివారం తెల్లవారిన తరువాత భవనం వరండాలో రక్తపుమడుగులో ఉన్న భ్రమరాంబను చుట్టుపక్కలవారు గమనించారు. వచ్చి చూడగా రెండు హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఘటనాస్థలాన్ని ఏలూరు డీఎస్పీ శ్రవణ్‌కుమార్, కైకలూరు సీఐ వి.రవికుమార్, ఎస్‌ఐ రామచంద్రరావు పరిశీలించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఆస్తి వివాదాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్టు భావిస్తున్నామన్నారు. మొదటి భార్య కుమారుడు నగేష్‌బాబు పాత్రతో పాటు ఇతర కారణాలపై విచారిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment