
ఆసియాలో అగ్రగామి లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ టెక్ ఫోరమ్ అయిన బయో ఆసియా సదస్సు 22వ ఎడిషన్ ఫిబ్రవరి 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనుంది. లైఫ్ సైన్సెస్ రంగంలో భారతదేశాన్ని తిరుగులేని శక్తిగా మార్చడానికి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలకు వేదికగా నిలిచేందుకు సిద్దమైంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్వీన్స్‌ల్యాండ్ గవర్నర్ డాక్టర్ జెన్నెట్ యంగ్, జీ20 షెర్పా అమితాబ్ కాంత్, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ వంటి వారి ప్రసంగాలు ఎజెండాలో ఉన్నాయి. వీరితో పాటుగా బయో ఆసియా 2025లో భారతదేశంతో పాటు, ప్రపంచ పరిశ్రమల నాయకులు కూడా స్ఫూర్తిదాయకంగా ప్రసంగించనున్నారు.
ప్రముఖ ప్రపంచ సంస్థల నుండి ప్రముఖ పరిశ్రమల నాయకులు రాబర్ట్ ఎ. బ్రాడ్‌వే (ఛైర్మన్&సీఈఓ, ఆమ్జెన్), ప్రొఫెసర్ పాట్రిక్ టాన్, (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జీనోమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్), డాక్టర్ కెన్ వాషింగ్టన్ (సిటీఓ , మెడ్‌ట్రానిక్), డాక్టర్ బోరిస్ స్టోఫెల్ (మేనేజింగ్ డైరెక్టర్, మిల్టెని బయోటెక్) తో పాటుగా ఇతర ప్రపంచ ఆరోగ్య సంరక్షణ సంస్థల నాయకులు హాజరవుతున్నారు.
"బయోఆసియా 2025 ఏఐ -ఆధారిత ఆరోగ్య సంరక్షణ పరివర్తన, లైఫ్ సైన్సెస్‌లో ఆవిష్కరణలు, డేటా ఇంటర్‌ఆపరేబిలిటీ, క్లినికల్ ట్రయల్స్‌లో భారతదేశ సామర్థ్యాన్ని చర్చించడానికి ప్రపంచ నాయకులను ఒకచోట చేర్చనుంది. ఇది చరిత్రలో అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన బయోఆసియా సదస్సు అవుతుందని నమ్ముతున్నాను" అని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.