
బాకీ వసూలు పేరిట అనుచితంగా ప్రవర్తించరాదు
అలాంటి చర్యలను ఉపేక్షించక్కర్లేదు
పరువుకు భంగం కలిగిస్తే కోర్టులో కేసు వేయొచ్చు
బ్యాంక్‌తో రాజీ ఒప్పందానికి ప్రయత్నించొచ్చు
ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించొచ్చు
ఢిల్లీకి చెందిన అనుజ్ (35) వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. తాను తీసుకున్న వ్యక్తిగత రుణం ఈఎంఐలను సకాలంలో చెల్లించలేకపోయాడు. దాంతో రుణ వసూళ్ల ఏజెంట్ల బృందం ఆయన ఇంటి ముందు వాలిపోయింది. నినాదాలూ చేస్తూ, ఆ దారిలో వెళ్లే ఒక్కొక్కరిని పిలిచి అనుజ్ రుణం ఎగ్గొట్టాడంటూ దు్రష్పచారం మొదలు పెట్టారు. తద్వారా అనుజ్‌కు పరువుపోయినట్టయింది. ఇది అనుజ్ ఒక్కడి సమస్యే అనుకుంటే పొరపాటు.
ఏటా లక్షలాది మంది ఇలా రుణ రికవరీ ఏజెంట్ల వేధింపులకు గురవుతున్నవారే. వీటిని భరించలేక బలవన్మరణానికి పాల్పడిన వారూ ఉన్నారు. రుణ గ్రహీతలకూ కొన్ని హక్కులు ఉన్న విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. రుణం చెల్లించకపోతే వసూలు చేసుకునే విషయంలోనూ బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు/వాటి ఏజెంట్లకూ నిర్దేశిత నిబంధనలు, పరిమితులు ఉన్నాయి. వాటిని హద్దుమీరి వ్యవహరిస్తుంటే సహించక్కర్లేదు. అనుచిత చర్యల నుంచి రక్షణ కోరడమే కాదు, ఉపశమనం పొందొచ్చు. ఈ విషయమై సమాచారం అందించే కథనమే ఇది.
గతంతో పోల్చితే నేడు రుణాలు ఎంతో సులభంగా లభిస్తున్నాయి. దీంతో రుణ ఎగవేతలు కూడా పెరిగాయి. సూక్ష్మ రుణాలు, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు రుణాల్లో ఇటీవలి కాలంలో చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. కొన్ని వర్గాల రుణ గ్రహీతలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల ప్రభావం బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల రుణ వసూళ్లపై ప్రభావం చూపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలల పాటు వసూలు కాకుండా ఉండిపోయిన రుణాలను మొదట బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు తమ రుణ రికవరీ బృందాలకు అప్పగిస్తాయి.
లేదా రుణ రికవరీ ఏజెన్సీలకు అప్పగిస్తుంటాయి. ఫలితం లేకపోతే అస్సెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలకు (ఏఆర్‌సీలు) విక్రయిస్తాయి. రుణ రికవరీ ఏజెన్సీలు రుణం వసూలు చేసినందుకు ఇంత చొప్పున తీసుకుంటాయి. ఏఆర్‌సీలు అయితే మొండి బాకీలను తక్కువ రేటుకు కొనుగోలు చేసుకుని, వాటిని వసూలు చేసుకునేందుకు చర్యలు మొదలు పెడతాయి. ఇక్కడ ఎక్కువ సందర్భాల్లో కనిపించేది.. రుణం తీసుకున్న వారిని నయానో, భయానో నానా రకాలుగా వెంటపడి, వేధించి వసూలు చేసుకోవడమే ఏజెంట్ల పని.
స్పష్టమైన నిబంధనలు
రుణ వసూళ్లకు రుణదాతలు కఠిన చర్యలకు పాల్పడుతున్న విషయం ఆర్‌బీఐ దృష్టికి రావడంతో.. రుణ రికవరీ ఏజెంట్ల నియంత్రణ విషయమై, వారి నడవడికపై లోగడే సమగ్రమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ తర్వాత పలు విడతలుగా వాటిని మెరుగుపరుస్తూ నోటిఫికేషన్‌లను జారీ చేసింది. రుణ గ్రహీతలకు ఉన్న హక్కులను గౌరవిస్తూనే, నైతిక విధానాల్లో వసూలుకు నిబంధనలు అమల్లో పెట్టింది. వీటి ప్రకారం.. రుణాన్ని పారదర్శకమైన విధానాల్లోనే వసూలు చేసుకోవాలి. మాటలతో లేదా చేతలతో వేధింపులకు దిగకూడదు.
రుణానికి సంబంధించి, రుణ గ్రహీతకు సంబంధించి గోప్యత, గౌరవాన్ని కాపాడాలి. వారి పరువు నష్టానికి భంగం కలిగించకూడదు. బెదిరించకూడదు. రుణం చెల్లించలేదంటూ నోటీసు జారీ చేసి చట్టబద్ధమైన మార్గాల్లోనే వసూలుకు చర్యలు తీసుకోవాలి. అంతేకాదు రుణ గ్రహీతకు కాల్స్ చేయడం కూడా ఉదయం 8 గంటల తర్వాత, రాత్రి 7గంటల్లోపేనని నిబంధలు చెబుతున్నాయి. రుణం చెల్లింపులు ఆగిపోయిన అన్ని కేసుల్లోనూ ఉద్దేశపూర్వకమని చెప్పలేం. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవడం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు ఎదురుకావడం వంటివి చోటు చేసుకోవచ్చు. కనుక చెల్లింపులు చేయని రుణ గ్రహీతలు అందరినీ ఒకే గాటన కట్టడాన్ని సమర్థించలేం.
గుర్తింపును ధ్రువీకరించుకోవాలి..
నేడు సైబర్ మోసాలు పెరిగిపోయాయి. తమకు వస్తున్న కాల్స్ అన్నీ రుణం వసూలు కోసమని భావించడానికి లేదు. అందులో సైబర్ మోసగాళ్ల కాల్స్ కూడా ఉండొచ్చు. అందుకని రుణం విషయమై వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అవతలి వ్యక్తి బ్యాంక్ అదీకృత ఉద్యోగియేనా? లేదంటే సంబంధిత వ్యక్తికి బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీ ధ్రువీకరణ ఉందా? అన్నది నిర్ధారించుకోవాలి. వారి గుర్తింపు కార్డ్‌ను చూపించాలని కోరాలి. ఆ ఐడీ కార్డ్ మీరు రుణం తీసుకున్న బ్యాంక్ లే దా ఎన్‌బీఎఫ్‌సీ జారీ చేసిందేనా? అని పరిశీలించాలి. సరైనదని భావిస్తేనే వారితో వివరాలు పంచుకోవచ్చు. లేదంటే నేరుగా బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీ సిబ్బందితోనే డీల్ చేసుకుంటామని తెగేసి చెప్పేయాలి.
నిబంధనలు పాటించాల్సిందే..
ఆర్‌బీఐ నియంత్రణలోని బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు, కోపరేటివ్ బ్యాంక్‌లు అన్నీ కూడా ఆర్‌బీఐ ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాల్సిందే. ఈ విషయంలో ఏజెంట్లకు సరైన శిక్షణ ఇవ్వాలని, వారి ప్రవర్తనకు బ్యాంక్‌లే బాధ్యత వహించాలని ఆర్‌బీఐ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. బ్యాంక్‌లు తమ వెబ్‌సైట్లలో రికవరీ ఏజెన్సీల వివరాలను వెల్లడించాలి. ఫలానా రికవరీ ఏజెంట్ లేదా ఏజెన్సీకి రుణ వసూలు బాధ్యత అప్పగించామని రుణగ్రహీతకు బ్యాంక్ ముందస్తు సమాచారం ఇవ్వాలి.
బ్యాంక్ అదీకృత లేఖ, బ్యాంక్ నోటీసును ఏజెంట్లు చూపించాలి. ఒకవేళ ఏజెంట్ల నుంచి అనుచిత, అనైతక తీరును ఎదురైతే అప్పుడు రుణ గ్రహీతలు తమ హక్కులను కాపాడుకునేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కాల్స్ చేసి వేధించినట్టయితే కాల్ రికార్డులను భద్రపరుచుకోవాలి. ఈ మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌ల రూపంలో వేధిస్తే వాటిని సైతం జాగ్రత్త పరుచుకోవాలి. ఇంటికొచ్చి వేధిస్తుంటే వీడియో తీసి సేవ్ చేసుకోవాలి. ముందుగా సంబంధిత బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలి. స్పందన లేకపోతే అప్పుడు ఆర్‌బీఐని ఆశ్రయించొచ్చు.
ఇలా చేస్తే నయం..
→ ఆర్‌బీఐ రిజిస్టర్డ్ సంస్థల నుంచే రుణాలను తీసుకోవాలి. ఒకవేళ సమస్య ఎదురైతే పరిష్కరించుకోవడం సులభం.
→ రుణాన్ని సకాలంలో చెల్లించలేకపోవడానికి సహేతుక కారణాలను బ్యాంక్ సిబ్బందికి తెలియజేసి, తగిన సమయం కోరొచ్చు. రుణాన్ని తిరిగి చెల్లించే ప్రణాళికను సమరి్పంచొచ్చు.
→ రుణం తీసుకునే ముందు ఒప్పందం నిబంధనలను, తమ హక్కుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
వేధింపులపై చర్యలు
→ రుణ రికవరీ ఏజెంట్ల వేధింపులు, బెదిరింపులకు సంబంధించి ఆధారాలను సేకరించాలి. వీటిని బ్యాంక్ లోన్ ఆఫీసర్ లేదా నోడల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లాలి.
→ స్పందన లేకపోతే, వేధింపులు ఆగకపోతే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
→ బ్యాంక్ సేవలపై కన్జ్యూమర్ కోర్టులో ఫిర్యాదు దాఖలును పరిశీలించొచ్చు.
→ వేధింపుల నుంచి ఉపశమనం కోసం స్థానిక కోర్టులో సివిల్ వ్యాజ్యం దాఖలు చేసి ఇంజంక్షన్ ఉత్తర్వులు పొందొచ్చు.
→ తమ ఆందోళనలను బ్యాంక్ పట్టించుకోకపోతే అప్పుడు ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ప్రతీ ప్రాంతానికి ప్రత్యేక అంబుడ్స్‌మన్ ఉంటారు. వారి చిరునామా, కాంటాక్ట్ వివరాలను ఆర్‌బీఐ వెబ్‌సైట్ నుంచి పొందొచ్చు.
→ వేధింపులకు సంబంధించి ఆధారాలకు దొరకకుండా ఉండేందుకు రికవరీ ఏజెంట్లు గుర్తించడానికి వీల్లేని ఫోన్ నంబర్లు లేదా వాట్సాప్ ద్వారా సంప్రదింపులు చేసే అవకాశం లేకపోలేదు. అలా గుర్తించినట్టయితే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు.
→ రికవరీ ఏజెంట్లు రుణ గ్రహీత కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితుల నంబర్లకు కాల్ చేసి బెదిరిస్తున్న ఘటనలు కూడా చూస్తున్నాం. ఇలా చేసినా లేదా పనిచేసే కార్యాలయం, నివాస సమీపంలో సమస్యలు సృష్టించినట్టయితే వారిపై పరువునష్టం కేసు దాఖలు చేయొచ్చు.
→ అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించినట్టయితే కోర్టులో కేసు వేయొచ్చు.
→ రుణ రికవరీ ఏజెంట్ల వేధింపులపై న్యాయ నిపుణులతో చర్చించి వారి సలహా మేరకు సరైన చర్యలు చేపట్టొచ్చు.
ఆర్‌బీఐ కఠిన చర్య హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఇటీవలే రూ.కోటి జరిమానా విధించింది. రికవరీ ఏజెంట్లకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలడంతో కఠినంగా వ్యవహరించింది. అది కూడా నిర్దేశించిన వేళల్లో (ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటలు) కాకుండా ఇతర సమయంలో కాల్స్ చేసి రుణ గ్రహీతలను వేధించినట్టు బయటపడింది. రుణ వసూళ్లలో పేరున్న సంస్థలు సైతం ఎలా వ్యవహరిస్తున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ.
కఠిన చట్టాలు...
సూక్ష్మ రుణ గ్రహీతల కోసం కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే ఓ సంచలనాత్మక చట్టాన్ని తీసుకొచ్చింది. వేధింపులు, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు, శిక్షలకు ఇందులో చోటు కల్పించింది. రాష్ట్రంలో రుణ వసూళ్ల ఆగడాలు పెరిగిపోవడంతో ఇలాంటి చర్యకు దిగింది. సూక్ష్మ రుణ సంస్థల నుంచి రుణాలు తీసుకున్న వారి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఆర్‌బీఐ నిర్దేశించిన రుణ వసూలు నిబంధనలను ఉల్లంఘించే రుణ రికవరీ ఏజెంట్లు, ఫైనాన్స్ కంపెనీ యజమానులపై సుమోటో కేసులు నమోదు చేసేందుకు, హెల్ప్‌లైన్ ఏర్పాటుకు ప్రతి జిల్లా స్థాయిలో చర్యలకు ప్రభుత్వం ఆదేశించడం గమనార్హం.
– సాక్షి, బిజినెస్ డెస్క్