
Flipkart price lock Feature: పండుగల సమయంలో ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారి కోసం ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులు.. తాము కొనుగోలు చేసేంత వరకూ ధరలు పెరగకుండా లాక్ చేసుకునేలా 'ప్రైస్ లాక్' ఫీచర్ (price lock feature)ను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తాజాగా ప్రకటించారు.
(ఇంత కంటే చీప్ ఇంకేమైనా ఉందా? రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లు రూ.100కే..)
"పండుగ సీజన్లలో తమకు కావాల్సిన ఉత్పత్తులు అమ్ముడైపోయాయని లేదా నిమిషాల్లోనే అందుబాటులో లేకుండా పోతున్నాయని కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. దీనికి పరిష్కారంగా ప్రైస్ లాక్ ఫీచర్‌తో కస్టమర్లు తమకు అవసరమైన ఇన్వెంటరీని లాక్ చేసుకోవచ్చు" అని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ప్రాడక్ట్ అండ టెక్నాలజీ ఆఫీసర్ (CPTO) జయందరన్ వేణుగోపాల్ ఫ్లిప్‌కార్ట్ మాతృ సంస్థ వాల్‌మార్ట్ నిర్వహించిన కన్వర్జ్ ఈవెంట్‌లో తెలిపారు. అయితే, ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనేది ఆయన చెప్పలేదు.
'ప్రైస్ లాక్' ఫీచర్ ఇలా..
ఫ్లిప్‌కార్ట్ తీసుకొస్తున్న 'ప్రైస్ లాక్' ఫీచర్ కింద కస్టమర్‌లు తమకు కావాల్సిన వస్తువులను లాక్ చేసుకునేందుకు కొంత మొత్తం ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పండుగ సమయాల్లో ఆయా వస్తువులకు డిమాండ్ పెరిగినప్పటికీ, లాక్ చేసుకున్న కస్టమర్లకు అవి అందుబాటులో ఉండేలా చేస్తారు. అలాగే ధరలు పెరిగినప్పటికీ లాక్ చేసుకున్న ధరకే ఆయా వస్తువులను కొనుక్కోవచ్చు. సాధారణంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల అమ్మకాలలో 50 శాతం పండుగ సీజన్లలోనే జరుగుతాయి.