
అమెరికా ప్రతీకార సుంకాలతో భారత్‌పై ప్రడే ప్రభావాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖతోపాటు, ఆర్థిక శాఖ ప్రకటించాయి. దేశీ పరిశ్రమ, ఎగుమతిదారులు సహా భాగస్వాములు అందరితో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు, వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్టు వాణిజ్య శాఖ తెలిపింది. అమెరికా కొత్త వాణిజ్య విధానం ఫలితంగా ఏర్పడే కొత్త అవకాశాలపైనా అధ్యయనం చేస్తున్నట్టు ప్రకటించింది.
పరస్పర ప్రయోజనకరమైన, బహుళ రంగాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) త్వరగా అంగీకారానికి వచ్చేందుకు భారత్–అమెరికా వాణిజ్య బృందాలు చర్చిస్తున్నట్టు తెలిపింది. అమెరికాతో సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని భారత్ గౌరవిస్తుందని.. రెండు దేశాల ప్రయోజనాల విషయంలో అమెరికాతో కలసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్టు వాణిజ్య శాఖ పేర్కొంది. ఢిల్లీలో ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. ‘ట్రంప్‌నకు అమెరికాయే ప్రథమం. మోదీకి భారతే ప్రథమం. అమెరికా మోపిన ప్రతీకార సుంకాల ప్రభావాన్ని అంచనా వేస్తున్నాం’ అని చెప్పారు. భారత్ నుంచి వచ్చే ఫార్మా, సెమీకండక్టర్, ఇంధన ఉత్పత్తుల దిగుమతులను టారిఫ్‌ల నుంచి అమెరికా మినహాయించగా, మిగిలిన దిగుమతులపై 10 శాతం బేసిక్ డ్యూటీకి అదనంగా 26 శాతం సుంకాలు మోపింది.
ఇదీ చదవండి: రైల్లో ఎంత లగేజీ తీసుకెళ్లొచ్చు?
భారత్‌పై సుంకాల మోత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల బాంబు పేల్చారు. అనుకున్నట్లుగా విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. వియత్నాం ఉత్పత్తులపై 46 శాతం, చైనాపై 34 శాతం, యూరోపియన్ యూనియన్(ఈయూ)పై 20 శాతం, స్విట్జర్లాండ్‌పై 31, తైవాన్‌పై 32, జపాన్‌పై 24, యూకేపై 10 శాతం సుంకాలను ఖరారు చేశారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఏప్రిల్ 2వ తేదీని ‘విముక్తి దినం’గా ట్రంప్ ప్రకటించారు.