
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు ప్రపంచంలోని వివిధ దేశాలతో పాటు యూఎస్‌కు ప్రతికూలంగా మారుతున్నాయి. ఇది అమెరికా వాణిజ్య విధానంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. దేశీయ పరిశ్రమలను రక్షించడం, వాణిజ్య లోటును తగ్గించాలనే ఉద్దేశంతో వీటిని ప్రవేశపెట్టినప్పటికీ ఈ సుంకాల అనాలోచిత నిర్ణయాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. ఇందులో యూఎస్ డాలర్ క్షీణించడం కీలకంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో డాలర్ క్షీణతకు కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వాణిజ్య అసమతుల్యత
సుంకాలు దిగుమతి చేసుకునే వస్తువుల ఖర్చును పెంచుతాయి. ఇతర దేశాలు కూడా ఇందుకు అనుగుణంగా తమ సొంత సుంకాలతో ప్రతీకారం తీర్చుకుంటాయి. ఇది అంతర్జాతీయ వాణిజ్యం క్షీణించడానికి దారితీస్తుంది. చైనా, కెనడా వంటి వాణిజ్య భాగస్వాములు ప్రతిచర్యలకు పూనుకోవడంతో అమెరికా ఎగుమతులకు డిమాండ్ తగ్గింది. ఫలితంగా వాణిజ్య అసమతుల్యతలు ప్రపంచ మార్కెట్లలో డాలర్ స్థానాన్ని బలహీనపరుస్తున్నాయి.
దెబ్బతింటున్న ఇన్వెస్టర్ల ఆత్మవిశ్వాసం
ఫైనాన్షియల్ మార్కెట్లు ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్తు అంచనాలపై వృద్ధి చెందుతాయి. సుంకాలను ప్రవేశపెట్టడం అనిశ్చితిని సృష్టించింది. ఇది అమెరికా విదేశీ పెట్టుబడులకు ఆకర్షించడంలో వెనుకపడేలా చేసింది. ఇన్వెస్టర్లు సురక్షితమైన మార్కెట్లను కోరుకోవడంతో డాలర్‌కు డిమాండ్ తగ్గింది.
గ్లోబల్ కరెన్సీ సర్దుబాట్లు
యూఎస్ సుంకాల ప్రభావానికి గురైన దేశాలు అంతర్జాతీయ మార్కెట్లో తమ వస్తువులకు పోటీని కొనసాగించడానికి తరచుగా వారి కరెన్సీ విధానాలను సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు, ప్రధాన వాణిజ్య భాగస్వామి అయిన చైనా యువాన్‌ను స్థిరీకరించడానికి చర్యలు తీసుకుంది. గ్లోబల్ కరెన్సీ విధానాల్లో ఇలాంటి సర్దుబాట్లు పరోక్షంగా అమెరికా డాలర్ విలువను ప్రభావితం చేశాయి.
ఇదీ చదవండి: టారిఫ్ పాజ్.. మార్కెట్ జోష్
ఆర్థిక వృద్ధి ఆందోళనలు
సుంకాలు రెండు వైపులా పదునున్న కత్తిలా పనిచేస్తాయి. అవి దేశీయ పరిశ్రమలను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, అవి స్థానిక వ్యాపారాలు, వినియోగదారులకు ఖర్చులను పెంచుతాయి. దాంతో ఆర్థిక వృద్ధిని నెమ్మదిస్తుంది. ఇది యూఎస్ ఆర్థిక వ్యవస్థ పట్ల భవిష్యత్తు అంచనాలను తగ్గిస్తుంది.