
2030 నాటికి 60 శాతం అప్
పీఎన్‌జీఆర్‌బీ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: వాహనాలు, గృహాలు, పరిశ్రమల అవసరాల కోసం సహజ వాయువును విరివిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో 2030 నాటికి గ్యాస్ వినియోగం 60 శాతం పెరగనుంది. 2023–24లో రోజుకు 188 మిలియన్ ఘనపు మీటర్లుగా (ఎంసీఎండీ) ఉన్న వినియోగం, 2030 నాటికి 297 ఎంసీఎండీకి చేరనుంది. వివిధ పరిస్థితుల్లో గ్యాస్ వినియోగ ధోరణులను విశ్లేషిస్తూ చమురు నియంత్రణ సంస్థ పీఎన్‌జీఆర్‌బీ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం ఒక మోస్తరు వృద్ధి, సానుకూల పరిణామాలతో కూడుకున్న ’గుడ్ టు గో’ పరిస్థితుల్లో గ్యాస్ వినియోగం 2030 నాటికి 297 ఎంసీఎండీకీ, 2040 నాటికి 496 ఎంసీఎండీకి కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక వృద్ధి వేగవంతమై, పాలసీలు సానుకూలంగా అమలవుతూ, భారీగా పెట్టుబడులు వచ్చే ’గుడ్ టు బెస్ట్’ పరిస్థితుల్లో 2030 నాటికి 365 ఎంసీఎండీకి, 2040 నాటికి 630 ఎంసీఎండీకి వినియోగం పెరగవచ్చు.
ఈ రెండు సందర్భాల్లోనూ కొత్తగా ఏర్పడే డిమాండ్‌లో సిటీ గ్యాస్ డిస్టిబ్యూషన్ (సీజీడీ) సంస్థల వాటా గణనీయంగా ఉండనుంది. ‘గ్యాస్ వినియోగ వృద్ధికి సీజీడీ రంగం కీలక చోదకంగా నిలుస్తుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 37 ఎంసీఎండీ స్థాయి నుంచి 2030 నాటికి 2.5–3.5 రెట్లు, 2040 నాటికి 6–7 రెట్ల వరకు ఇది పెరిగే అవకాశం ఉంది‘ అని నివేదిక పేర్కొంది. పీఎన్‌జీఆర్‌బీ ఇటీవల 307 భౌగోళిక ప్రాంతాల్లో సిటీ గ్యాస్ లైసెన్సులు ఇచ్చింది.
నివేదికలోని మరిన్ని విశేషాలు..
→ రిఫైనరీ, పెట్రోకెమికల్స్ కార్యకలాపాలు జోరందుకోవడం కూడా సహజ వాయువు వినియోగానికి దోహదపడనుంది. 2030 నాటికి పెరిగే అదనపు వినియోగంలో ఈ విభాగం వాటా 21 ఎంసీఎండీగా, 2040 నాటికి మరో 10 ఎంసీఎండీగా ఉండనుంది.
→ విద్యుదుత్పత్తి, ఎరువుల రంగంలో గ్యాస్ వినియోగం ఒక మోస్తరుగా పెరగనుంది.
→ డిమాండ్ పెరిగే కొద్దీ ద్రవీకృత సహజ వాయువు దిగుమతులు కూడా పెరగనున్నాయి. సుదూర ప్రాంతాలకు రవాణాకు సంబంధించి డీజిల్ స్థానాన్ని ఎల్‌ఎన్‌జీ భర్తీ చేసే అవకాశం ఉంది. 2030 తర్వాత, చైనా తరహాలో డీజిల్‌పై ఆధారపడటం తగ్గి ఎల్‌ఎన్‌జీ వినియోగం పెరగవచ్చు. డిమాండ్ దన్ను, దేశీయంగా ఉత్పత్తి నెమ్మదించే పరిస్థితుల కారణంగా అప్పటికి ఎల్‌ఎన్‌జీ దిగుమతులు రెట్టింపు కావచ్చు. 2030–2040 నాటికి గ్యాస్ వినియోగం అనేక రెట్లు పెరగనుండటంతో, డిమాండ్–సరఫరా మధ్య వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు ఎల్‌ఎన్‌జీపై ఆధారపడటమూ భారీగా పెరగనుంది. అంతర్జాతీయంగా ఎల్‌ఎన్‌జీ లభ్యత మెరుగ్గా ఉండటం వల్ల ధరలు తగ్గే అవకాశం ఉంది.
→ 2030, 2040 నాటికి భారత్ నిర్దేశించుకున్న సహజ వాయువు లక్ష్యాలను సాధించాలంటే మౌలిక సదుపాయాల విస్తరణ, ఎల్‌ఎన్‌జీ ధరలు.. విధానాలు సానుకూలంగా ఉండాలి. అయితే, భౌగోళిక–రాజకీయ పరిస్థితులు, పాలసీపరంగా అనిశ్చితి మొదలైన అంశాల కారణంగా గ్యాస్ ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలూ ఉన్నాయి. 2015–16 నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో సహజ వాయువు వినియోగం 45 శాతం వృద్ధి చెంది 131 ఎంసీఎండీ నుంచి 188 ఎంసీఎండీకి పెరిగింది.