
ఓపెన్ ప్లాటా? అపార్ట్‌మెంటా? ఎందులో పెట్టుబడులకు ఆసక్తి ఉందనే ప్రశ్నకు సగానికి పైగా తొలిసారి ప్రాపర్టీ కొనుగోలుదారుల అభిప్రాయం ఓపెన్ ప్లాటనే సమాధానం. 58 శాతం మంది కస్టమర్లు స్థలం మీద పెట్టుబడులకు మొగ్గు చూపిస్తున్నారని మ్యాజిక్ బ్రిక్స్ సర్వేలో తేలింది. దీర్ఘకాలిక మూలధన లాభాలు, అధిక రాబడులే ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరో
దేశంలోని సుమారు 2,200 మంది గృహ కొనుగోలుదారులతో సర్వే నిర్వహించింది. ఇందులో 17.1 శాతం మంది కస్టమర్లు పెట్టుబడులకు రెండో ప్రాధాన్యత ఆస్తిగా వాణిజ్య స్థలాలను ఎంచుకున్నారు. ఓపెన్ ప్లాట్లలో అత్యధికంగా బెంగళూరు స్థలాలకు డిమాండ్ ఉంది. 36.5 శాతంతో గ్రీన్ సిటీ అగ్రస్థానంలో ఉండగా.. చెన్నై ప్లాట్లకు 11 శాతం, లక్నో స్థలాలకు 8.9 శాతం ఆసక్తి చూపిస్తున్నారు. 1,000–2,000 చ.అ. మధ్య తరహా ప్లాట్లకు 46.76 శాతం డిమాండ్ ఉంది.
రూ.50 లక్షల వరకూ..
రూ.50 లక్షల వరకు ధర ఉండే స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 50.83 శాతం మంది ప్లాట్లలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. గ్రేటర్‌లో షాద్‌నగర్, కడ్తాల్, సదాశివపేట వంటి ప్రాంతాలలో ప్లాట్ల సరఫరా అత్యధికంగా ఉంది. ఇక్కడ ప్లాట్ల సగటు ధర చ.అ.కు రూ.2,765గా ఉంది. లక్నోలో రూ.2,836, చెన్నైలో రూ.3,208లు పలుకుతున్నాయి. అత్యధికంగా నోయిడాలో రూ.22,523, గుర్గావ్‌లో రూ.21,901లతో ఖరీదైన మార్కెట్లుగా ఉన్నాయి.