జీబీలకు జీబీలు వాడేస్తున్నారు! | mobile internet usage in india | Sakshi
Sakshi News home page

జీబీలకు జీబీలు వాడేస్తున్నారు!

Published Thu, Sep 19 2024 4:23 AM | Last Updated on Thu, Sep 19 2024 8:07 AM

mobile internet usage in india

ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల జోరు..

మెట్రోలకు మించి భారీగా మొబైల్‌ డేటా వాడకం 

నెలకు ఒక్కో యూజర్‌ సగటు వినియోగం 38–42 జీబీ 

ఢిల్లీ, ముంబై వంటి చోట్ల ఇది 30–34 జీబీ మాత్రమే!

స్వాతి వైజాగ్‌లో ఓ ఫ్యాషన్‌ డిజైనర్‌. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో తాజా ట్రెండ్స్‌ చూసేందుకు గంటల కొద్దీ సమయం గడుపుతుంది. ఇక రాయ్‌పూర్‌లో ఉబెర్‌ ఆటో డ్రైవర్‌ కిశోర్‌ సాహు అయితే సిటీలో తిరిగే 12 గంటల్లో యూట్యూబ్, ఓటీటీ కంటెంట్‌లోనే మునిగితేలుతాడు. రోజువారీ మొబైల్‌ డేటా లిమిట్‌ 1.5–2 జీబీ డేటా అయిపోతే, మళ్లీ డేటా టాపప్‌ కూడా చేస్తాడు. చిన్న నగరాల్లో సైతం డేటా వినియోగం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే!

4జీ.. 5జీ పుణ్యమా అని దేశంలో మొబైల్‌ డేటా వాడకం ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. ఇదేదో మెట్రోలు, బడా నగరాలకే పరిమితం అనుకుంటే పొరబాటే! ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు డేటా వాడకంలో మెట్రోలను మించిపోతుండటం విశేషం. ముఖ్యంగా తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని చిన్న చిన్న నగరాలు ‘టాప్‌’లేపుతున్నాయి. ఇక్కడ యూజర్ల నెలవారీ సగటు డేటా వినియోగం 38–42 జీబీగా ఉన్నట్లు పరిశ్రమ గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో ఇది 30–42 జీబీ మాత్రమే కావడం గమనార్హం. 

అప్పుడైతే పీక్స్‌... 
ఐపీఎల్‌ మ్యాచ్‌లు, క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ఇతరత్రా ముఖ్యమైన క్రీడా ఈవెంట్ల సమయంలో అయితే డేటా వాడకం పీక్స్‌కు వెళ్తోంది. గ్రామాలు, పట్టణాలనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ సగటు నెలవారీ వినియోగం 50–58 జీబీలను తాకుతున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అధిక రోజువారీ డేటా ఉండే ప్యాక్‌లను రీచార్జ్‌ చేసుకోవడమే కాకుండా.. డేటా టాపప్‌లు కూడా హాట్‌ కేకుల్లా సేల్‌ అవుతున్నాయట! సోషల్‌ మీడియా, ఓటీటీ వీడియోలు, షోలు, గేమ్‌ స్ట్రీమింగ్‌తో పాటు క్రీడా ఈవెంట్లు దేశంలో డేటా వినియోగానికి బూస్ట్‌ ఇస్తున్నాయని  విశ్లేషకులు చెబుతున్నారు.  చౌక స్మార్ట్‌ ఫోన్లు, డేటా రేట్లు దీనికి దన్నుగా నిలుస్తున్నాయి. 

2029 నాటికి మనమే టాప్‌... 
అంతర్జాతీయ టెలికం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్‌సన్‌ అంచనా ప్రకారం 2023లో భారత్‌లో ఒక్కో యూజర్‌  సగటు నెలవారీ డేటా విని యోగం 29 జీబీలుగా ఉంది. నోకియా మాత్రం దీన్ని 24.1 జీబీగా అంచనా వేసింది. గడిచిన ఐదేళ్లలో 21.1% వార్షిక వృద్ధి నమోదైందని పేర్కొంది. కాగా, 2029 నాటికి నెలవారీ సగటు వాడకం 68 జీబీకి చేరుతుందని, చైనాను సైతం అధిగమించి డేటా వాడకంలో భారత్‌ నంబర్‌ వన్‌గా నిలుస్తుందని ఎరిక్‌సన్‌ చెబుతోంది.

జీడీపీకి దన్ను
పెద్ద నగరాల్లో ఇంట్లో, ఆఫీసుల్లో వైఫై బాగా అందుబాటులో ఉంటుంది. ఫోన్లు, పీసీల్లో వైఫై డేటాతోనే పనైపోతుంది. అయితే ద్వితీయ శ్రేణి మార్కెట్ల విషయానికొస్తే యూజర్లు ఎక్కువగా డేటా ప్యాక్‌లపైనే ఆధారపడుతున్నారని, అక్కడ మొబైల్‌ డేటా వాడకం భారీగా పెరిగేందుకు ఇది కూడా కారణమని టెలికం కన్సల్టెంట్, నెట్‌వర్క్‌ స్పెషలిస్ట్‌ పరాగ్‌ కర్‌ చెప్పారు.   కాగా, టెలికం కంపెనీలకు మాత్రం ఆ స్థాయిలో ఆదాయాలు పెరగడం లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 2020–21లో ఒక్కో జీబీ డేటాపై రూ.10.82 చొప్పున ఆదాయం లభించగా, 2023–24లో ఇది రూ.9.12గా తగ్గిందని ట్రాయ్‌ గణాంకాల్లో వెల్లడైంది. మరోపక్క, మొబైల్‌ కనెక్టివిటీ పెరగడం, బ్రాండ్‌బ్యాండ్‌ విస్తరణ వల్ల ఉద్యోగాల కల్పనతో పాటు ఎకానమీ వృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని అధ్యయనాల్లో వెల్లడైనట్లు గ్లోబల్‌ టీఎంటీ కన్సలి్టంగ్‌ సంస్థ ఎనాలిసిస్‌ మేసన్‌కు చెందిన అశ్విందర్‌ సేథి చెప్పారు.

అత్యధిక మొబైల్‌ డేటా వినియోగ మార్కెట్లు: తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, చత్తీస్‌గఢ్‌లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు
50-58జీబీ : గ్రామీణ, పట్టణ మార్కెట్‌ రెండింటిలో గరిష్ట స్థాయి (పీక్‌) నెలవారీ వినియోగం
ప్రతి 10%: బ్రాడ్‌బ్యాండ్‌ విస్తరణతో జీడీపీ 1% వృద్ధి చెందుతుందని అంచనా 
సోషల్‌ మీడియా, ఓటీటీ వీడియోలు, గేమ్‌ స్ట్రీమింగ్‌: డేటా వాడకం జోరుకు ప్రధాన కారణం

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement