
తల్లిదండ్రులు పిల్లల కోసం కష్టపడుతుంటారు. పిల్లలు చదువులతో కష్టపడాలి వాస్తవంగా. కాని వారికి సోషల్ మీడియాలోని చెత్తా చెదారం, తప్పుడు సమాచారం, ఉద్రిక్త ఆకర్షణలు, హింసాత్మక భావజాలాలు... ఇవి కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. ఇటీవల వచ్చిన ‘అడోలసెన్స్’ వెబ్‌సిరీస్ మీద సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఇది హెచ్చరిక అంటున్నారు. ఈ సిరీస్ మనల్ని ఎలా నిద్ర లేపుతున్నది?
మీ పిల్లలు మీతో ఇంట్లో మాట్లాడే భాష మీకు తెలుసు. వాళ్లు సోషల్ మీడియాలో మాట్లాడే భాష మీకు తెలుసా? వాళ్లు ఉపయోగించే ‘ఎమోజీ’ల అర్థాలు తెలుసా? మాటలు లేకుండా ఎమోజీలతో గాయపరిచే వీలు ఉంటుందని తెలుసా? కిడ్నీ బీన్స్, రెడ్ పిల్, బ్లూ పిల్, డైనమైట్, రెడ్ హార్ట్, పర్పుల్ హార్ట్, ఎల్లో హార్ట్.... ఈ ఎమోజీల అర్థం ప్రతి దానికీ మారుతుంది. అవి ఎందుకు ఉపయోగిస్తున్నారు. ఇంట్లో మన ఎదురుగా పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో మీకు తెలుసు. సోషల్ మీడియాలో ఎలా ప్రవర్తిస్తున్నారో మీకు తెలుసా?
ముఖ్యంగా వారి వయసు 12– 14 సంవత్సరాల మధ్య ఉంటే వారికి తెలిసింది ఎంత... తెలియంది ఎంత... తెలిసీ తెలియంది అంత. జాగ్రత్త సుమా... అని హెచ్చరించడానికి వచ్చింది ‘అడోలసెన్స్’ అనే వెబ్ సిరీస్.
నాలుగు ఎపిసోడ్స్‌ల సిరీస్
‘అడోలసెన్స్’ అనేది నాలుగు ఎపిసోడ్ల మినీ వెబ్ సిరీస్. బ్రిటిష్ క్రైమ్ డ్రామా. బ్రిటన్‌లో టీనేజ్ పిల్లల్లో పెరుగుతున్న హింసా ప్రవృత్తిని గమనించి ఈ సిరీస్‌ను తీశారు. జాక్ థోర్న్ స్క్రిప్ట్ రాస్తే, ఫిలిప్ బరాన్‌టిని దర్శకత్వం వహించాడు. ఒక్కో ఎపిసోడ్ ఒక గంట ఉంటుంది. విశేషం ఏమిటంటే ప్రతి ఎపిసోడ్ సింగిల్ షాట్. అంటే మధ్యలో కట్ లేకుండా కెమెరా కదులుతూ దృశ్యాలను చూపుతూ వెళుతుంది. ఈ మేకింగ్‌లో వినూత్నత వల్ల కూడా ఈ సిరీస్ ప్రశంసలు అందుకుంటోంది.
ఆ పసివాడి సంఘర్షణ
ఈ సిరీస్ మొదలు కావడమే ‘జెమీ మిల్లర్’ అనే 13 ఏళ్ల పిల్లవాడి అరెస్టుతో మొదలవుతుంది. ముందు రోజు రాత్రి స్కూల్లో తన క్లాస్‌మేట్ అమ్మాయి కేటీని కత్తితో ఏడుసార్లు పొడిచి చంపాడని అభియోగం. తండ్రి, తల్లి, సోదరి హడలిపోతాడు. జెమీ మిల్లర్ అయితే పోలీసులను చూసి ప్యాంట్ తడుపుకుంటాడు. ఆ తర్వాత జేమీనే కేటీని చంపాడని ఇందుకు ఒక స్నేహితుడు కూడా పురిగొల్పాడని విచారణలో ప్రేక్షకులకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇందులో ఎవరి తప్పు ఎంత? దీనికి బాధ్యులు ఎవరెవరు? శిక్ష మాత్రం ఒక్కడికే పడబోతోందా?
ఇన్‌స్టా గొడవ
జెమీ వయసు 13 ఏళ్లే అయినా అతనికి ఇన్‌స్టా అకౌంట్ ఉంది. అందమైన ఫిమేల్‌మోడల్స్ బొమ్మలను అప్పుడప్పుడు షేర్ చేస్తుంటాడు. అతని పోస్టులకు కేటీ కామెంట్స్ పెడుతూ ఉంటుంది. వాటికి రకరకాల ఎమోజీలు వాడుతుంటుంది. అవి జెమీని బాధ పెట్టాయని మనకు తెలుస్తుంది. జెమీ తన వయసులో అపరిపక్వత వల్ల తను ఆకర్షణీయంగా లేడని తనను ఎవరూ ఇష్టపడరని న్యూనతతో ఉంటాడు. కేటీ కామెంట్స్ ఇందుకు ఆజ్యం పోస్తాయి. అంతే కాదు సాటి మనిషి పట్ల, ఆడపిల్లల పట్ల సెన్సిటివ్‌గా ఉండాలనే భావజాలం కాకుండా వాళ్లను ఏమైనా అనొచ్చు ఎలాగైనా ఉండొచ్చు అనే ఆధిపత్యపు భావజాలమే ఎక్కువగా జెమీకి పరిచయం అవుతుంటుంది. వీటన్నింటి దరిమిలా అతడు కేటీప్రాణం తీసేవరకూ వెళతాడు.
టీనేజ్ పిల్లలు ఎంతో సున్నితమైన దశలో ఉండే సీతాకోక చిలుకలు. వారిని గురించి అందరికీ బాధ్యత ఉండాలని చెబుతోంది ఈ సిరీస్. ఇందులోని ముఖ్య పాత్రను ఒవెన్ కూపర్ అనే బాల నటుడు అద్భుతంగా పోషించాడు. దిన పత్రికల వార్తలు కూడా మనకు రోజూ టీనేజ్ పిల్లల సమస్యలు, కుటుంబాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ లోపం పట్టి ఇస్తున్నాయి. తల్లిదండ్రులు ఈ సిరీస్ చూడటం మంచిదంటున్నారు అభిరుచి ఉన్న ప్రేక్షకులు. కొందరైతే టీనేజ్ పిల్లలతో పాటుగా తల్లిదండ్రులూ చూడాలని సూచిస్తునారు. ముందు పెద్దలు చూడండి. ఆ తర్వాత మీకు సబబని అనిపిస్తే పిల్లలకు చూపించండి. కానీ ఆలోచించండి.
ఎవరు నిందితులు?
సోషల్ మీడియాను, ఎమోజీలను కనిపెట్టిన వారా? వాటిని ఫోన్లకు అనుసంధానం చేసిన వారా? పిల్లలకు ఫోన్లు కొనిచ్చిన తల్లిదండ్రులా? వాళ్లు ఏ మీడియాను ఉపయోగిస్తున్నారో చూడని తల్లిదండ్రుల నిర్బాధ్యతా? వారితో గడపలేని బిజీతో ఉన్న తల్లిదండ్రుల నిర్లక్ష్యమా? సరిగా పెంచని, సరిగా విద్యాబుద్ధులు చెప్పని వారంతా ఇందుకు బాధ్యులు కాదా? సమాజంలో పేరుకున్న హింసా ప్రవృత్తిని దూరం చేయలేని పాలనా వ్యవస్థ, శాసన వ్యవస్థ, పౌర వ్యవస్థలో ఉన్న వీరంతా కాదా బాధ్యులు.