
పెరుగుతున్న డిజిటల్ మోసాలను అరికట్టేందుకు బ్యాంకులు పటిష్ట, క్రియాశీలక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) కోరారు. అలాగే నష్టాలను తగ్గించడానికి థర్డ్–పార్టీ సర్వీస్ ప్రొవైడర్లపై పర్యవేక్షణను మెరుగుపరచాలని సూచించారు.
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎం.రాజేశ్వర్ రావు, టి.రబి శంకర్, జె.స్వామినాథన్‌తో కలిసి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల ఎండీలు, సీఈఓలతో ఆయన సమావేశమయ్యారు. డిజిటల్ మోసాల పెరుగుదలపై మల్హోత్రా ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.
డిసెంబరులో శక్తికాంత దాస్ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ మల్హోత్రా బ్యాంకులతో నిర్వహించిన మొదటి సమావేశం ఇది. ఆర్బీఐ తన పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల ఉన్నతాధికారులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తుంటుంది.
సీనియర్ ఐఏఎస్ అధికారి, రెవెన్యూ కార్యదర్శిగా పనిచేసిన సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ 26వ గవర్నర్‌గా గత డిసెంబర్ 11న బాధ్యతలు చేపట్టారు. గత గవర్నర్ శక్తికాంతదాస్ పదవీకాలం ముగియడం ఆయన స్థానంలోకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ మల్హోత్రాను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మూడేళ్లపాటు ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు.