
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్కెట్ వర్గాలు ఊహించిన విధంగానే మరోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇది 6 శాతానికి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఫిబ్రవరి తర్వాత తాజాగా ఇలా రేటు తగ్గింపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) ఏప్రిల్ 7న మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించింది. బుధవారం వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ ప్రకటన చేశారు. పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన తర్వాత, సంజయ్ మల్హోత్రా గత డిసెంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది రెండో ద్రవ్య విధాన కమిటీ సమావేశం. అంతకుముందు ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో భాగంగా రెపోరేటును గడిచిన ఐదేళ్లలో తొలిసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. తాజాగా మరోసారి అందరూ అంచనా వేసినట్లుగానే ఆర్‌బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బెంచ్‌మార్క్ రుణ రేటు ప్రస్తుతం 6.25 శాతం నుంచి తాజాగా 6 శాతానికి తగ్గింది.
సుస్థిర వృద్ధికి ఊతమిచ్చేలా..
‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అసాధారణ అనిశ్చితిలో ఉంది. దీంతో విధానాల రూపకల్పనకు సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ ఉన్న వనరులను వినియోగించుకుని మెరుగైన ఆర్థిక వ్యవస్థను రూపొందించేందుకు కట్టుబడి ఉన్నాం. నేను గతంలో చెప్పినట్లుగానే దేశీయ వృద్ధి, ద్రవ్యోల్బణం విషయంలో అప్రమత్తంగా ఉంటున్నాం. అదే సమయంలో ప్రధాన వృద్ధికి మద్దతు ఇచ్చే ద్రవ్య విధానాన్ని పాటిస్తున్నాం. మెరుగైన డిమాండ్, సరఫరాలు, సుస్థిర స్థూల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేలా ద్రవ్యోల్బణేతర వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాం. గతంలోలాగే స్పష్టమైన, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల కోసం విధానాలను అమలు చేస్తాం’ అని మల్హోత్రా అన్నారు.
రెపో రేటు అంటే..
రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్‌లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్‌పై ప్రభావం చూపినప్పుడు ఆర్‌బీఐ రెపో రేటును పెంచుతుంది.

కస్టమర్లకు ఊరట
వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు కూడా కస్టమర్లకు ఇచ్చే రీటైల్ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను ఆ మేరకు సవరించే అవకాశం ఉంటుంది. దీంతో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నవారికి ఊరట కలుగుతుంది.