1.25 ఎకరాల అనుమతితో పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు
పి.గన్నవరం: మండలంలోని పెదకందాలపాలెం లంకలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. కూటమి నేతలు నదీగర్భాన్ని కొల్లగొడుతూ దొరికినంత దోచుకుంటున్నారు. మానేపల్లి లంకలో 1.25 ఎకరాలకు తీసుకున్న అనుమతితో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళితే ప్రభుత్వ పనుల కోసం మానేపల్లిలంకలో 1.25 ఎకరాల భూమిలో మట్టి తవ్వకాలకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో పెదకందాలపాలెంలంక నుంచి నదీగర్భం మీదుగా సుమారు 3 కిలో మీటర్ల మేర టిప్పర్ల రాకపోకలకు బాటలు వేశారు.
పద్ధతి ప్రకారం మానేపల్లిలంక నుంచి మాత్రమే మట్టిని తీయాల్సి ఉండగా లంకలో బాటలకు ఇరువైపులా ఉన్న తువ్వమట్టిని అక్రమంగా తరలించేస్తున్నారు. శనివారం మైన్స్ అధికారులు వస్తున్నారన్న సమాచారంతో లంకలోకి టిప్పర్లు రాకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారని స్థానికులు వివరించారు.
మైన్స్ ఆర్‌ఐ పరిశీలన
ఇదిలా ఉండగా శనివారం మైన్స్ రాయల్టీ ఇన్‌స్పెక్టర్ సుజాత మానేపల్లిలంకలో ప్రభుత్వం అనుమతి ఇచ్చిన భూమిని పరిశీలించారు. ఈ నెల 17 నుంచి 25 రోజుల పాటు 1.25 ఎకరాల భూమిలో 3 వేల క్యూబిక్ మీటర్ల మేర మట్టిని తరలించడానికి తాత్కాలిక అనుమతి ఇచ్చారని, ఆ భూమిలో ఎన్ని క్యూబిక్ మీటర్లు తవ్వారో నిర్థారించేందుకు వచ్చినట్టు తెలిపారు. జీప్‌లో మానేపల్లిలంకకు వెళ్లేందుకు వీలులేకపోవడంతో ఆమె మూడు కిలోమీటర్లకు పైగా ట్రాక్టర్‌పై వెళ్లి లంకను పరిశీలించారు. బాటల వెంబడి అక్రమ తవ్వకాలపై విలేకరులు ప్రశ్నించగా ఆ ప్రాంతం ఇరిగేషన్ శాఖ పరిధిలోకి వస్తుందని, వారు చూసుకుంటారన్నారు. ఆమె వెంట మానేపల్లి వీఆర్వో వానరాశి సత్యనారాయణ, హెడ్‌వర్‌ుక్స ఏఈఈ టీవీఎల్‌ఎన్ మూర్తి పాల్గొన్నారు.
అత్యాశకు పోయి రూ.30 లక్షల గోల్‌మాల్
అమలాపురం టౌన్: ఆన్‌లైన్ మోసాలకు గురై అమలాపురానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రూ.30 లక్షలు పోగొట్టుకున్నాడు. వడ్డీకి ఆశపడి ఓ యాప్‌లోకి వెళ్లి భారీగా డబ్బు సమర్పించుకున్నాడు. సీఐ పి.వీరబాబు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని ఎస్‌కేబీఆర్ కళాశాల రోడ్డుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ భోజనపల్లి రాజగోపాల్ తన స్మార్ట్ ఫోన్‌లో గోగూల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి పెట్టుబడిపై వడ్డీ ఇచ్చే పాల్కన్ ఇన్‌వాయిస్ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాడు.
రెండేళ్ల పాటు పెట్టుబడికి వడ్డీ పొందుతున్నాడు. యాప్‌పై నమ్మకం కలగడంతో అతడు రూ.50 వేల నుంచి రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. రూ.30 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టాక యాప్ క్లోజ్ అయినట్లు కనిపించడంతో తాను మోసపోయినట్లు గమనించాడు. రాజ్ గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ వీరబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.