
కోనసీమ కళాకారులు
జాతీయ కళా డాక్యుమెంటరీ ప్రోగ్రాంలో
కొత్తపేట: దేశ వ్యాప్త కళాకారులతో న్యూఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన డాక్యుమెంటరీ ప్రోగ్రాంలో రాష్ట్రం నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఇద్దరు గరగ నృత్యం కళాకారులు పాల్గొన్నారు. కొత్తపేట మండలం పలివెలకు చెందిన కొమారిపాటి ఏసువెంకటప్రసాద్, మండపేట రూరల్ మండలం తాపేశ్వరానికి చెందిన కొరివి కళ్యాణ్‌కు ఈ అవకాశం దక్కింది. ఈ ఏడాది జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో దేశ వ్యాప్తంగా వివిధ కళారూపాలకు చెందిన 5,196 మంది కళాకారులు పాల్గొని ప్రదర్శనలు ఇచ్చారు. ఆ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. కాగా భారత సంగీత నాటక అకాడమీ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో ఆయా కళాబృందాల్లో ఒక్కో బృందం నుంచీ ఇద్దరి చొప్పున మొత్తం 100 మందిని ఎంపిక చేసి శ్రీజయతి జయమమ భారతంశ్రీ పేరుతో డాక్యుమెంటరీ ప్రోగ్రాం చేశారు. ఆ ప్రోగ్రాంలో కోనసీమ జిల్లాకు చెందిన ఏసువెంకటప్రసాద్, కళ్యాణ్ గరగ నృత్యం ప్రదర్శించారు. ఈ సందర్భంగా సంగీత నాటక అకాడమీ చైర్మన్ సంధ్యాపుణిచ, సెక్రటరీ రాజుదాస్ తదితర ప్రముఖులు అభినందించి, సర్టిఫికెట్స్ అందజేశారు. ఏసువెంకటప్రసాద్ గరగ నృత్యం జానపద కళా విభాగంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆయన జిల్లా కళాస్రవంతి సంగీత, వాయిద్య, నృత్య కళాకారుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడిగా కళాకారులకు సేవలందిస్తున్నారు.

కోనసీమ కళాకారులు