
వర్గపోరులో ఢీసీసీబీ
సాక్షి, అమలాపురం: కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులు పందేరం పుణ్యమా అని సామాజికవర్గాలు, పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు పొడచూపుతోంది. తొలుత ఒక పేరు ప్రచారంలో ఉంచడం, చివరకు మరొకరికి పదవి కేటాయించడం టీడీపీలో కొత్త వ్యూహంగా మారింది. ప్రాథమిక సహకార సంఘాలు (పీఏసీఎస్)లకు త్రీమెన్ కమిటీ పదవుల నుంచి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ పదవి వరకు ఇదే పంథా అవలంబిస్తోంది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులకు పేర్లను ఖరారు చేసే పనిలో టీడీపీ అధిష్టానం సిద్ధమైంది. దీనిలో డీసీసీబీ చైర్మన్ పదవి కీలకమైంది. తొలి నుంచి ఈ పదవికి అమలాపురానికి చెందిన పార్టీ నాయకుడు మెట్ల రమణబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో డీసీసీబీకి నిర్వహించిన ఎన్నికల్లో రమణబాబు టీడీపీ తరఫున పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దివంగత వరుపుల జోగిరాజు (రాజా)పై పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి రమణబాబు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. 2014–19 మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ రమణబాబుకు ఈ పదవి కేటాయించలేదు. కేవలం గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ పదవితో సరిపెట్టారు. ఈసారి తనకు ఈ పదవి వస్తుందని రమణబాబు బలంగా నమ్మకం పెట్టుకున్నారు. పార్టీలో సైతం అతని పేరు ప్రముఖంగా వినిపించింది. కాని వారం రోజులుగా పరిస్థితి తల్లకిందులైంది. డీసీసీబీ చైర్మన్ పదవి బీసీలకు కేటాయించాలని, అందునా శెట్టిబలిజ సామాజికవర్గానికి ఇవ్వాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. దీనిలో భాగంగా కొత్తపేటకు చెందిన శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం (ఆర్‌ఎస్) పేరు ప్రముఖంగా వినిపించింది. దీనిపై ఆర్‌ఎస్‌ను పార్టీ అధిష్టానం సంప్రదించిన విషయం తెలిసిందే. క్యాబినెట్ ర్యాంకు పదవి చేసిన తాను డీసీసీబీ చైర్మన్ పదవి చేయలేనని ఆయన సున్నితంగా తిరస్కరించారు.
తెరపైకి పిల్లి సత్తిబాబు
డీసీసీబీ చైర్మన్ పదవిని ఆర్‌ఎస్ తిరస్కరించడంతో కాకినాడ రూరల్‌కు చెందిన పిల్లి సత్తిబాబు పేరు తెరపైకి తీసుకువచ్చారు. సత్తిబాబు సతీమణి పిల్లి అనంతలక్ష్మి ఎమ్మెల్యేగా పనిచేసిన విషయం తెలిసిందే. కూటమి పార్టీల మధ్య కుదిరిన పొత్తులలో భాగంగా కాకినాడ రూరల్ స్థానాన్ని జనసేనకు కేటాయించగా, ఆ పార్టీ తరఫున పోటీ చేసిన పంతం నానాజీ విజయం సాధించారు. జనసేనకు ఆ సీట్టు ఇవ్వడంతో అవకాశం కోల్పోయిన సత్తిబాబుకు సముచిత స్థానం కల్పిస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దీనితో సత్తిబాబు ఎమ్మెల్సీ పదవిపై ఆశ పెట్టుకున్నారు. పిఠాపురం నుంచి ఈ పదవి ఆశిస్తున్న ఎస్.వి.ఎస్.ఎన్.వర్మకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చి ఎన్నికల పూర్తయిన తరువాత పక్కన పెట్టడం చూసిన సత్తిబాబు డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చినా చాలన్నట్టుగా చూస్తున్నారు. పార్టీ అధిష్టానం ఇందుకు సముఖంగా ఉన్నట్టు తెలిసిందే.
రమణబాబు చివరి యత్నాలు
డీసీసీబీ చైర్మన్ పదవి చేజారిపోతోందని తెలియడంతో రమణబాబు చివరి యత్నాలు ప్రారంభించారు. పార్టీ అధిష్టానం వద్ద తేల్చుకునేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. దీనిలో భాగంగా ఆయన అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుతో కలిసి పార్టీ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను కలవనున్నారు. డీసీసీబీ చైర్మన్ పదవి తనకు కేటాయించాలని ఆయన పట్టుబట్టనున్నారు. అయితే రమణబాబుకు నామినేటెడ్ పదవి ఇచ్చే ఉద్దేశం టీడీపీ అధిష్టానానికి లేదని పార్టీలో కొంతమంది ప్రముఖులు చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో రమణబాబు పట్టుబట్టడంతోనే అమలాపురం అసెంబ్లీ స్థానం ఆనందరావుకు కేటాయించారు. గతంలో ఒకసారి రమణబాబుకు నామినేటెడ్ పదవి ఇవ్వాలని పార్టీ పెద్దలు కలిశారు. ‘రమణబాబు కోటాలోనే ఆనందరావుకు సీటు ఇచ్చామని, ఇద్దరు కలిసి పనిచేసుకోవాలి’ అని అప్పుడు లోకేష్ అన్న మాటలను పార్టీ క్యాడర్ గుర్తు చేసుకుంటోంది. పదవిపై హామీ ఇవ్వకుండా పరోక్షంగా రమణబాబుకు నామినేటెడ్ పదవి ఇచ్చేది లేదని తేల్చినట్టుగా క్యాడర్ భావిస్తోంది.
దీనికితోడు గత ప్రభుత్వంలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన సమయంలో అమలాపురం మున్సిపాలిటీ ఓసీ మహిళ రిజర్వ్ అయ్యింది. ఆ సమయంలో రమణబాబు సతీమణిని పోటీలో పెట్టాల్సిందిగా లోకేష్ సూచించారని, ఇందుకు రమణబాబు అంగీకరించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ఎన్నికల్లో పట్టణంలో పార్టీ మూడవ స్థానంలో నిలిచింది. దీనిపై లోకేష్ అసంతృప్తితో ఉన్నారని సమాచారం. అయితే తూర్పు డీసీసీబీ చైర్మన్ పదవి తొలి నుంచి కాపు సామాజికవర్గానికి కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సైతం అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు), ఆకుల వీర్రాజుకు ఇచ్చిన విషయాన్ని రమణబాబు వర్గీయులు గుర్తు చేస్తున్నారు. ఈ ఆనవాయితీని కాదని బీసీలకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న వారు.. ఇదే విషయాన్ని లోకేష్ వద్ద తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.
చైర్మన్ పదవుల కోసం
తూర్పు డీసీసీబీ పరిధిలో 198 సహకార సంఘాలున్నాయి. వీటికి సంబంధించి త్రీమెన్ కమిటీల నియామకం పూర్తయ్యింది. ఇందుకు సంబంధించిన జాబితాను ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి పంపించారు. ఒకటి, రెండు చోట్ల తప్ప పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. గత ఫిబ్రవరిలోనే ఈ ప్రక్రియ పూర్తయ్యింది. ప్రభుత్వం నుంచి జీవో విడుదల అవుతుందనుకున్న సమయంలోనే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడంతో ఏఏసీఎస్ పదవుల పందేరానికి అవాంతరాలు ఏర్పడ్డాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసినా పదవులకు సంబంధించిన ప్రకటన మాత్రం విడుదల కాకపోవడంతో పదవులు దక్కినవారు ఆశగా ఎదురుతెన్నులు చూస్తున్నారు.
చైర్మన్ పీఠం కోసం నేనంటే నేను
బీసీలకే అంటున్న టీడీపీ అధిష్టానం
రేసులో పిల్లి సత్తిబాబు...
మెట్ల వర్గంలో ఉలికిపాటు
చివరి యత్నంగా చినబాబు దగ్గరకు
జిల్లాలో పదవుల కోసం ఎదురుచూపులు

వర్గపోరులో ఢీసీసీబీ

వర్గపోరులో ఢీసీసీబీ

వర్గపోరులో ఢీసీసీబీ