
విశ్వంలో ప్రతిదీ అద్భుతమే. మన పుట్టుక, పరిణామం, మెదడు, మాటతో సహా అన్నీ అద్భుతాలే. అద్భుతాల మధ్య జీవించడం అలవాటుగా మారి, వాటిని చటుక్కున గుర్తించం. అలాంటి అద్భుతాలలో మాట్లాడగలగడం ఒకటి. జీవపరిణామక్రమంలో, డెబ్బై వేల సంవత్సరాల క్రితం మనిషిలో మాట జన్యువు అభివృద్ధి చెంది, మాట్లాడడం నేర్చాడని శాస్త్రవేత్తలు అంటారు.
మాటలన్నీ భాషగా మారి, ఆ భాష క్రమంగా అనేక భాషలుగా విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున వేల సంఖ్యలో భాషలున్నాయి. ఒక్క మనదేశంలోనే భాషలు, యాసలు కలసి రెండువేలకు పైగా లెక్క కొచ్చాయి. వాటిలో లిపిలేనివీ ఉన్నాయి. తెలుగుతో సహా, కేవలం 22 భాషలనే రాజ్యాంగం గుర్తించింది. ఆ విధంగా భాషల మధ్య స్వాభావికంగానే ఆధిపత్యం, అసమానతలు ఉన్నాయన్నమాట.
బ్రిటిష్ పాలనతో ఇంగ్లీషు వచ్చి చేరింది. స్వతంత్రులమయ్యాక దానిని పక్కన పెట్టి దేశీయ మైన ఒక భాషను జాతీయభాషగా చేసుకోవాలన్న ఆలోచన వచ్చి, హిందీ అందుకు అనువుగా కనిపించింది. ఇంగ్లీషును వెంటనే పక్కన పెట్టలేని స్థితిలో పాఠశాల, కళాశాలల స్థాయిలో ఇంగ్లీషు, మాతృభాష, హిందీ అనే త్రిభాషా సూత్రాన్ని కేంద్రం అమలులోకి తెచ్చింది.
హిందీని వ్యతిరేకిస్తూ తమిళులు ఉద్యమించడంతో కేంద్రం మెట్టుదిగి ఇంగ్లీషు, తమిళం అనే ద్విభాషాసూత్రాన్ని వారు అమలు చేసుకోడానికి అవకాశమిచ్చింది. ఇప్పుడు మళ్ళీ కేంద్రం త్రిభాషా సూత్రం అమలు దిశగా వివిధ మార్గాలలో తమిళనాడుపై ఒత్తిడి తేవడం ప్రారంభించింది. అది చినికి చినికి పెద్ద రాజకీయ వివాదంగా పరిణమించడం చూస్తున్నాం.
ఇదంతా విద్యాలయాల స్థాయిలో మూడు భాషలను నేర్పడం గురించి! నిజానికి భాష, లేదా భాషలు నేర్చుకోవడమనేది ఆసక్తీ, అభిరుచులతోనూ; అంతకన్నా అత్యవసరంగా ఉపాధితోనూ, అందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాలకూ, విదేశాలకూ వెళ్లగలగడంతోనూ ముడిపడినది. జాతీయ సమైక్యత కోసమే అయినా అన్యభాషా బోధనను సిలబస్‌లో భాగం చేసినప్పుడు, అందులో విద్యార్థి ఆసక్తి, అభిరుచులకు బదులు నిర్బంధానిదే పై చేయి అవుతుందనీ, అలాంటి ఏ మొక్కు బడి భాషాభ్యసనమైనా విద్యార్థి దశతోనే ముగిసిపోయి నిరుపయోగమవుతుందనీ, చివరికి తమ అభిరుచికి తగిన, ఉపాధికి సాయపడే భాషకే పరిమితమవుతారనే అభిప్రాయాన్ని తోసి పుచ్చలేం.
భాషలే కాదు; ఏది నేర్చుకోవడానికైనా ఆసక్తి, అవసరాలే కీలకాలు. భాషాప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడకముందు అధికసంఖ్యాక భాషాజనమూ, సరిహద్దుల్లోని అల్పసంఖ్యాక భాషా జనమూ కూడా మాతృభాషతోపాటు మరికొన్ని భాషలు మాట్లాడే అవకాశం ఉండేది. అది ఆ భాష లపై ఆసక్తికీ, వాటిలో ప్రావీణ్యానికీ దారితీయించి పలువురికి బహుభాషావేత్తలుగా గుర్తింపు నిచ్చింది.
వెనకటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుకు తెలుగు, సంస్కృతాలతోపాటు హిందీ, కన్నడం, మరాఠీ, ఉర్దూ, పారశీక భాషల్లో అభినివేశమూ, రచన చేయగలిగిన పాండిత్యమూ ఉండేవి. భారత మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు పదిహేడు దేశ, విదేశభాషలు తెలిసిన పండితుడిగా, రచయితగా ప్రఖ్యాతులు. ఆయన తెలుగు సాహిత్యం గురించి మాట్లాడినంత అనర్గళంగా, మరాఠీ, ఒరియా తదితర భాషా సాహిత్యాల గురించి కూడా మాట్లాడేవారు.
వెనకటి పండితులలో వేలూరి శివరామశాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు తదితరులు కూడా బహుభాషావేత్తలుగా ప్రసిద్ధులు. భారతీయభాషలే కాక; అనేక యూరోపియన్ భాషలు కూడా తెలిసిన పుట్టపర్తివారు గ్రీకు విషాదాంతనాటకాల నమూనాలో, సుయోధనుడు నాయకుడుగా, ఎలిజబెతెన్ ఆంగ్లంలో ‘ది హీరో’ అనే రచన చేశారు. విశ్వనాథవారి ‘ఏకవీర’ను మలయాళంలోకి అనువదించి, కేరళ ప్రభుత్వ ఆహ్వానంపై మలయాళ పద వ్యుత్పత్తి నిఘంటు సంపాదక వర్గంలో సభ్యులుగా చేరారు. వీరందరినీ బహుభాషావేత్తలను చేసింది అభిరుచి, ఆసక్తులే తప్ప ఇతరేతర నిర్బంధాలు కావు.
అవసరమూ, ఆసక్తీ బహుభాషానైపుణ్యాలవైపు నడిపించిన ప్రముఖులలో 19వ శతాబ్దికి చెందిన హైన్రిశ్ ష్లీమన్ ఒకడు. అంతర్జాతీయ వ్యాపారవేత్తే కాక; ట్రాయ్, మైసీనియాలలో తవ్వ కాలు జరిపి, తొలితరం పురాతత్వవేత్తలలో ఒకడుగా పేరొందిన ష్లీమన్ –తన మాతృభాష జర్మన్‌కు అదనంగా, గ్రీకు సహా అనేక యూరోపియన్ భాషలను నేర్చుకున్న తీరూ, చూపిన పట్టుదలా స్ఫూర్తిదాయకాలు.
రైల్లో ప్రయాణిస్తున్నా, నడుస్తున్నా, ఏ పని చేస్తున్నా అతని పరభాషాభ్యాసం సమాంతరంగా సాగేది; తనున్న లాడ్జిలో, ఆ భాషకు చెందిన శ్రోతకు డబ్బిచ్చి మరీ ఎదురుగా ఉంచుకుని ఆ భాషలో ఉపన్యసించేవాడు; అది ఇతరులకు నిద్రాభంగం కలిగించేది కనుక అతను లాడ్జీలు మారవలసివచ్చేది.
ప్రేమకు భాషాభేదాలు లేకపోయినా, ప్రేమికుల మధ్య సంభాషణకు భాష తప్పనిసరి. ఆ ఇతి వృత్తంతో జైలు గువో అనే రచయిత్రి చైనీస్–ఇంగ్లీష్ నిఘంటువు పేరుతో ప్రేమికుల కోసం నవల రాసింది. అందులో చ్వాంగ్ అనే చైనా అమ్మాయి లండన్ వెళ్ళి ఓ బ్రిటిష్ యువకుడితో ప్రేమలో పడుతుంది.
రోజూ కొన్ని ఇంగ్లీష్ మాటలను, వాటి అర్థాలను డైరీలో రాసుకుంటూ, ప్రియుడితో సంభాషించే మేరకు క్రమంగా ఆ భాషలో నేర్పు సాధిస్తుంది. కనుక, పరభాషాభ్యసనానికి అవసరమూ, ఆసక్తీ తోడ్పడినంతగా నిర్బంధం తోడ్పడదు. దేశీయమైన ఒక ఉమ్మడి భాషను నేర్చుకోవడానికి ఇతరేతర మార్గాలు చూడాలి; అందులోనూ భాషా ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేయాలి.