
షడ్రసోపేత విందు సాగుతుండగా హఠాత్తుగా ఎవరోవచ్చి పంక్తి నుంచి అమర్యాదగా మెడపట్టి గెంటేస్తే? కాళ్లకింది నేల ఒక్కసారిగా బద్దలై మింగేస్తే? పశ్చిమబెంగాల్‌లో పదేళ్లుగా కొలువులు చేస్తున్న వేలాది ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది స్థితి అలాంటిదే. 2016లో స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ద్వారా ఎంపికైన మొత్తం 25,752 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలు చెల్లబోవని, వారిని తక్షణం తొలగించాలని గత వారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో వారంతా రోడ్డున పడ్డారు.
కేన్సర్ బారినపడిన ఒకే ఒక్క ఉపాధ్యాయురాలిని మాత్రం ధర్మాసనం మినహాయించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదలుకొని అందరూ ఉద్యోగాలు కోల్పోయినవారిపై సానుభూతి ప్రకటిస్తున్నారు. మమత అయితే తీర్పును తప్పుబట్టారు. ఉద్యోగాలు కోల్పోయినవారు ఎప్పటిలాగే విధి నిర్వహణ చేయొచ్చని, వేరే ప్రభుత్వ ఉద్యోగాల్లో సర్దుతామని బింకంగా ప్రకటించారు. వారికోసం జైలుకు పోవటానికీ సిద్ధమేనన్నారు.
రేపటి సమాజం తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందంటారు. సగటు విద్యార్థులను సమున్నతంగా తీర్చిదిద్దటం, వారి సృజనాత్మకతను వెలికితీసి మెరికల్లా మార్చటం, పటుతర శక్తిగా మల చటం ఉపాధ్యాయులు చేసే పని. ఇంతటి మహత్కార్యాన్ని నిర్వర్తించాల్సినవారు కాస్తా ముడుపులు సమర్పించుకుని దొడ్డిదారిన వచ్చిచేరారంటే అంతకన్నా దారుణం మరొకటుండదు. ఈ రిక్రూట్ మెంట్‌పై ఆ రోజుల్లోనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.
అభ్యర్థుల ర్యాంకులు తలకిందులు చేశారని, అధిక మార్కులు వచ్చినవారికి అన్యాయం జరిగిందని, అసలు మెరిట్ లిస్టులోగానీ, వెయిటింగ్ లిస్ట్‌లోగానీ లేనివారు చివరిలో విజేతల జాబితాకెక్కారని, మెరుగైన మార్కులతో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూలో సైతం నెగ్గినవారికి ఉద్యోగాలు నిరాకరించారని ఆ ఆరోపణల సారాంశం. అయినా ప్రభుత్వం కిమ్మనలేదు. దీనిపై హైకోర్టు నియమించిన విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలోని నలుగురు సభ్యుల కమిటీ 2021లో ఎన్నో అవకతవకలు బయటపెట్టింది.
అభ్యర్థుల ఓఎంఆర్ షీట్‌ల మూల్యాంకనానికి నియమించిన సంస్థ దాన్ని మరో సంస్థకు అప్పగించటమూ వెల్లడైంది. సీబీఐ దర్యాప్తులో కీలక సాక్ష్యాధారాలున్న మూడు హార్డ్ డిస్క్‌లు స్వాధీనమయ్యాయి. అయిదుగురు అరెస్టయ్యారు. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు గల్లంతయినట్టు కనుక్కుంది. తమ అవకతవకలు కప్పి పుచ్చేందుకు నిబంధనల సాకుచూపి 2019లోనే వాటిని ధ్వంసం చేసినట్టు నిర్ధారణైంది.
ఆ సంస్థ నివేదిక ఆధారంగా మొత్తం రిక్రూట్‌మెంట్ ప్రక్రియను రద్దుచేస్తూ, తిరిగి నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేయాలని ఆదేశిస్తూ నిరుడు ఏప్రిల్‌లో కలకత్తా హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై మొదట్లో సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ ఈ నెల 3న తీర్పునిచ్చింది. మొత్తం రిక్రూట్‌మెంట్ రద్దు చేయటం భావ్యంకాదని, ఇందులో నిజాయితీగా ఎంపికైనవారూ ఉన్నారని ప్రభుత్వం చేసిన వాదనతో సుప్రీం ఏకీభవించలేదు. ఓఎంఆర్ షీట్లు లేకుండా ఆ సంగతెలా నిర్ధారిస్తామంది.
హఠాత్తుగా ఉద్యోగాల నుంచి గెంటేయటం బాధాకరమనటంలో సందేహం లేదు. ఎందుకంటే ఎంపికైన వారంతా అవినీతిపరులు కాదు. వారి సంఖ్య 5,300 మించివుండదంటున్నారు. ఇలాంటి ఎంపికల్లో మొత్తం ప్రక్రియను భ్రష్టుపట్టించటం ఎంతటి అవినీతిపరులకైనా అసాధ్యం. కానీ సరైన మార్గంలో వచ్చినవారెవరో తెలిసేదెలా? ఇందుకు ప్రధానంగా నిందించాల్సింది ప్రభుత్వాన్నే.
ఈ రిక్రూట్‌మెంట్‌ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన సీపీఎం నేత, న్యాయవాది వికాస్‌రంజన్ భట్టాచార్యకు నోబెల్ బహుమతి ఇవ్వాలని మమత వ్యంగ్యంగా వ్యాఖ్యానించటం సరేగానీ... తన వంతు ఆమె చేసిందేమిటి? ఒకపక్క ఆరోపణలొస్తున్నప్పుడు ఓఎంఆర్ షీట్లు భద్రపరచటం వంటి కనీస చర్యనైనా ఎందుకు తీసుకోలేకపోయారు? ఉపద్రవం ముంచుకొస్తున్నదని తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టు ఎలావున్నారు? ఓఎంఆర్ షీట్లుంటే అక్రమార్కుల నిర్ధారణ సులభమయ్యేది. నిజాయితీ పరులకు రక్షణ దొరికేది. అయినా తమ వద్ద కచ్చితంగా నిర్ధారించగల ఇతరేతర సాక్ష్యాలున్నాయని ఉన్నతాధికారులంటున్నారు.
ఉద్యోగాలు కోల్పోయిన టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఆగ్రహం అర్థం చేసుకోదగిందే. వారు ఇప్పటికే తమకంటూ గూడు నిర్మించుకుని వుంటారు. నెలవారీ వాయిదాల్లో చెల్లించేలా రుణాలు తీసుకుంటారు. అనారోగ్యం వల్లనో, మరే ఇతర కారణంతోనో దొరికినచోట అప్పుచేస్తారు. ఈ రుణవలయం నుంచి బయటపడేదెలా? అందరూ దొంగలు కాదు. అయినా కొలువు పోయింది... జీవనాధారం మాయమైంది, కానీ అదొక్కటే సమస్య కాదు తమ శిష్యుల ముందు చులకనై పోయారు.
అవినీతిపరులన్న ముద్రపడింది. దీన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. విద్యా ర్థులది మరో సమస్య. వార్షిక పరీక్షలు దగ్గర పడుతుండగా గురువులు లేకపోవటం, కొన్నిచోట్ల సిబ్బంది కొరతతో యూనిట్ పరీక్షలు వాయిదా పడటం వారిని కలచి వేస్తోంది. అస్తవ్యస్త పాలనకు బెంగాల్ చిరునామాగా మారింది. నిరుడు ఆగస్టులో ఆర్‌జీ కార్ ఆస్పత్రిలో ఒక మహిళా వైద్యు రాలిపై అత్యాచార ఉదంతంలో సైతం స్పందన అంతంతమాత్రం.
చివరకు సుప్రీంకోర్టు జోక్యం తప్పలేదు. ఇప్పుడు ఎస్‌ఎస్‌సీ స్కాంలోనూ అదే నిర్వాకం. ప్రస్తుతం నిజంగా అర్హులైన ఉపాధ్యాయులను గుర్తించి వారికి న్యాయం చేసేందుకు ఏయే అవకాశాలున్నాయో చూడటం, తమ దగ్గరున్న సాక్ష్యాధారాలివ్వటం తప్ప మరే మార్గమూ లేదు. దానికి బదులు కోర్టుల్ని నిందించి, మరొకరిని తప్పు బట్టి ప్రయోజనం లేదని మమతా బెనర్జీ గ్రహించాలి.