
మంచిమాట
మనకు మేలు చేసిన వారికి కృతజ్ఞులై ఉండడం మన కనీస ధర్మం... మనం ఎవరి నుంచైతే మేలు పొందుతున్నామో, వారు ప్రత్యుపకారాన్ని ఆశించకపోయినా, వారి
ఉదారతను గుర్తించి వారికి కృతజ్ఞతలు తెలుపుకోవడం మన విధిగా భావించాలి. ఎందుకంటే అలా కృతజ్ఞతలు తెలియ చేసినపుడే మన సంస్కారం ఏమిటో ఇతరులకు అర్థమవుతుంది. అంతేకాదు అది మనసుకు కూడా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది.
మనం ఇతరుల నుంచి ఎలాంటి సహాయం పొందినా వారికి కృతజ్ఞులై ఉండాలి. తల్లితండ్రులు మనకి జన్మనిస్తారు.. మన భవిష్యత్ కు పునాదులు వేస్తారు.. అందువల్ల మనం వారికి జీవితాంతం కృతజ్ఞులై ఉండాలి. మన గురువులు మన భవిష్యత్ కు దిశానిర్దేశం చేస్తారు, మన స్నేహితులు మనకు చేదోడు వాదోడుగా ఉంటారు, ఇలా అనేక మంది పరోక్షంగా మన భవిష్యత్‌కు ఎంతగానో సహకరిస్తున్నారన్నమాట.. మన భవిష్యత్‌ను వారంతా తీర్చి దిద్దుతున్నపుడు వారికి మనం కృతజ్ఞతలు చూపించుకోవాలి కదా.. కృతజ్ఞతలు తెలియ చేయడం మన వ్యక్తిత్వాన్ని చాటి చెబుతుంది.. మనం ఎవరి దగ్గర నుంచైనా సహాయం పొందినపుడు నవ్వుతూ ధాంక్సండీ.. మీ మేలు మరచి పోలేను అని చెప్పి వారి కళ్లలోకి ఒక్కసారి తొంగి చూస్తే, వారి కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం మనకు కనిపిస్తుంది.. వారికి మన పట్ల మంచి అభిప్రాయం కూడా ఏర్పడుతుంది. దానివల్ల అవతలి వారు భవిష్యత్‌లో వారితో మనకేదైనా పని పడ్డప్పుడు, వారు ఇక ఆలోచించకుండా మనకు సహాయం చేస్తారు.
శ్రీరామచంద్రుడ్ని మనం దేవుడిగా పూజిస్తాం.. అయితే రామచంద్రుడు సాక్షాత్తు పరమాత్ముడే అయినా ‘ఆత్మానాం మానుషం మన్యే’ అన్నట్లు తనను ఒక మానవమాత్రునిగానే భావించుకున్నాడు. అందరిలో తాను ఒకడిగా, అందరికోసం తాను అన్నట్లుగా మెలిగాడు. మానవతా విలువలకు, కృతజ్ఞతా భావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. అలా రాముడు ప్రతీ విషయంలోనూ కృతజ్ఞతను చాటుకోవడం వల్లనే ఆయనను మనం పూజిస్తున్నాం.. ఆరాధిస్తున్నాం... మనం భూమి మీద నడుస్తున్నాం. పంటలను పండించుకుంటున్నాం... కనుక భూమిని భూదేవి‘ అనీ, మనం బతికుండడానికి ముఖ్య పాత్ర వహిస్తున్న నీటిని ‘గంగాదేవి’ అనీ, గాలిని వాయుదేవుడు అనీ పిలుస్తూ కృతజ్ఞతలు అర్పిస్తున్నాం.
ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ, మన నిత్య జీవితంలో అనేకానేకం మనకు ఉపయోగపడుతూంటాయి. వాటన్నింటి పట్ల, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పట్ల, విద్య నేర్పిన గురువుల పట్ల, అందరి పట్ల కృతజ్ఞతతో వుండాలి. సమస్త ప్రకృతి మన భావాలను గ్రహించి తదనుగుణంగా స్పందిస్తుంది కనుక మనకు చక్కగా ఆక్సిజన్ ఇస్తున్న చెట్లకూ, నీటికీ కృతజ్ఞతలు చెప్పాలి. మన జీవితానికి ఉపయోగపడే ప్రతి వ్యక్తికీ, వస్తువుకు, జీవికి మనం కృతజ్ఞులై ఉంటే, అదే మన భావి జీవితానికి కొత్త బాటలు వేస్తుంది. మన జీవితాన్ని నందనవనం చేస్తుంది.
ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ, మన నిత్య జీవితంలో అనేకానేకం మనకు ఉపయోగపడుతూంటాయి. వాటన్నింటి పట్ల, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పట్ల, విద్య నేర్పిన గురువుల పట్ల, అందరి పట్ల కృతజ్ఞతతో వుండాలి.
– దాసరి దుర్గా ప్రసాద్, ఆధ్యాత్మిక పర్యాటకులు