
అనారోగ్యంతో మంచానపడ్డ తండ్రి
సపర్యలు, ఇంటి పనుల్లో నిమగ్నమైన తల్లి
కుటుంబ పోషణ, తండ్రి వైద్యం కోసం ఇళ్ల పనికి వెళ్తున్న కుమార్తె
మెరుగైన వైద్యం కోసం ఆపన్న హస్తమందించాలని వేడుకోలు
కుటుంబాన్ని పోషించేందుకు ఆ తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుని బండరాళ్లు కొట్టాడు. మండుటెండలో పునాది రాళ్లను కొడుతూ అహర్నిశలు శ్రమించాడు. నాలుగు రాళ్లు సంపాదించి కుమార్తెలకు పెళ్లిళ్లు చేయాలనే తపనతో ఆకలి దప్పికలు మరిచాడు. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది. విధి వక్రీకరించి మంచానపడ్డాడు. ఏనాడూ గడప దాటి ఎరుగని కుమార్తె.. నేడు తండ్రి వైద్యం ఖర్చులు, కుటుంబ పోషణ కోసం పలువురి ఇళ్లలో పనులకు వెళుతోంది. మెరుగైన వైద్యం అందిస్తే తన తండ్రి మామూలు మనిషిగా మారుతాడని, అయితే వైద్యానికి అయ్యే ఖర్చు తమ తలకు మించిన భారం కావడంతో ఆపన్నహస్తమందించాలని నిరుపేద కుటుంబం వేడుకుంటోంది.
ధర్మవరం అర్బన్: స్థానిక మహాత్మాగాంధీ కాలనీకి చెందిన మల్లిపోగుల శ్రీనివాసులు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంటి పునాదులకు అవసరమైన రాళ్లను కొడుతూ కుటుంబాన్ని శ్రీనివాసులు పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో అరకొర సంపాదనలోనే దాచుకుంటూ వచ్చిన డబ్బుతో పెద్ద కుమార్తె శిరీషకు పెళ్లి చేసి, అత్తారింటికి పంపారు. చిన్న కుమార్తె జ్యోతిని పదో తరగతి వరకు చదివించగలిగారు. అపై చదువులకు పంపే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఇంటి పట్టునే ఉంచేశారు.
సాధారణ జబ్బు కాదది
నెల రోజుల క్రితం మహాశివరాత్రి పండుగను సంతోషంగా జరుపుకునేందుకు శ్రీనివాసులు కుటుంబం సిద్ధమైంది. ఉదయం తలంటి స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజలు చేసుకుని ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా శ్రీనివాసులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. పరిస్థితి గమనించిన భార్య లక్ష్మికి, కుమార్తె జ్యోతి వెంటనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం శ్రీనివాసులుకు రెండు కిడ్నీలు చెడిపోయాయని వైద్యులు నిర్ధారించారు. పరిస్థితి విషమిస్తుండడంతో వెంటనే కర్నూలులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డయాలసిస్ చేయడంతో కాస్త ఉపశమనం దక్కింది. ఈ క్రమంలో ఎడమ కాలికి ఇన్‌ఫెక్షన్ సోకి సెఫ్టిక్ కావడంతో పెద్ద గాయమైంది. దీంతో శ్రీనివాసులు కనీసం కూర్చొనే పరిస్థితి కూడా లేకపోయింది.
ఇంటి వద్ద మంచానికే పరిమితం
ఎడమ కాలికి కట్టు కట్టిన తర్వాత కర్నూలు ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేసి, ఇంటికి పంపారు. ఈ నేపథ్యంలో మరోసారి డయాలసిస్ అవసరం కావడంతో ఆస్పత్రికి తీసుకెళితే.. శ్రీనివాసులు పరిస్థితిని గమనించిన వైద్యులు డయాలసిస్ చేయడానికి సాధ్యం కాదని వెనక్కు పంపారు. అప్పటి నుంచి ఇంట్లోనే మంచానికే ఆయన పరిమితమయ్యాడు. ఈ మొత్తం ప్రక్రియలో ఇంట్లో చిన్న కుమార్తె పెళ్లికని దాచిన డబ్బు మొత్తం శ్రీనివాసులు చికిత్స కింద ఖర్చయి.. మరికొంత తెలిసిన వారి వద్ద అప్పులు చేయాల్సి వచ్చింది. నిరుపేద కుటుంబం కావడంతో రోజూ పనికి వెళితే తప్ప పూట గడవని పరిస్థితి.
ఈ పరిస్థితుల్లో ఇంటి వద్ద భర్తకు సపర్యలు చేయడంలోనే భార్య లక్ష్మికి సమయం సరిపోతోంది. దీంతో ఏనాడు గడప దాటి ఎరుగని చిన్న కుమార్తె జ్యోతి.. తండ్రి ఆరోగ్యం మెరుగుపడాలనే తపనతో తొలిసారిగా ఇల్లు విడిచి బయట కూలి పనులకు సిద్ధమైంది. ఇంటింటికీ తిరిగి వారికి అవసరమైన పనులు చేసి పెట్టి, వారిచ్చిన కొద్ది పాటి డబ్బుతో తండ్రికి అవసరమైన మందులు, కాలికి డ్రస్సింగ్ చేసేందుకు అవసరమైన మందులు, డయపర్స్ కొనుగోలు చేస్తోంది. వీరి దుస్థితిని గమనించిన చుట్టుపక్కల వారు అప్పుడప్పుడు చిన్నపాటి సాయం అందిస్తున్నారు.
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు
తన తండ్రి మంచాన పడటంతో కుటుంబ పోషణ భుజాల మీదకు వేసుకున్న జ్యోతి ఇంటి పనులతో కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. అయితే తన సంపాదనతో తండ్రి ఆరోగ్యం ఎన్నటికీ బాగుపడదని గుర్తించిన ఆమె ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. తన తండ్రికి మెరుగైన వైద్యానికి ఆర్థిక సాయం అందించాలని దాతలను వేడుకుంటోంది.