
కర్మఫలం
భూమిపై ఎవరైనా సరే కర్మఫలం అనుభవించక తప్పదు. అది మంచైనా చెడైనా తగిన ప్రతిఫలం అనుభవించ వలసిందే అని కృష్ణపరమాత్మ మాట. యుద్ధంలో తమ కుమారులు మరణించిన దుఃఖంలో ఉన్న ధృతరాష్ట్ర దంపతులను ఓదార్చ డానికి కృష్ణుడు రాజభవనానికి మర్యాదపూర్వకంగా వెళ్ళాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ‘నేను అంధుడిగా ఎందుకు పుట్టానో, యుద్ధంలో నా వంద మంది కొడుకులను ఎందుకు కోల్పోయానో, ఈ వయసులో మాకీ పుత్రశోకం ఎందుకు వచ్చిందో చెప్పు కృష్ణా’ అన్నాడు.
అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు -‘ఈ ప్రపంచం అంతా కర్మతో ముడి పడింది. ఈ ప్రపంచంలో మానవుడు చేసే ప్రతి చర్యా... అది మంచిదైనా చెడ్డదైనా అతని ప్రస్తుత జీవితంపై మాత్రమే కాకుండా అతని భవిష్యత్తు జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది. మానవ జీవితంలోని ప్రతి మంచి, చెడు వెనుక, ఒక కర్మ కారణమై ఉంటుంది. కాబట్టి, మీరిప్పుడు ఆ వంద జీవితాల వెనుక మరొక జీవి తానికి వెళ్లి మీరు ఏమి చేశారో చూస్తే, ఈ జీవితంలో మీ అన్ని బాధల వెనుక ఉన్న కారణాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఈ జీవితానికి ముందు నువ్వు క్రూరమైన రాజువి. ఒకరోజు నువ్వు వేటకు వెళ్లి చెరువులో ఆడుకుంటున్న తల్లి హంస – పిల్ల హంసలను చూశావు. దేవుడు నీకు ఇచ్చిన కళ్ళతో వాటి ఆటను ఆస్వాదించడానికి బదులుగా నువ్వు తల్లి హంస కళ్ళను నిర్దాక్షిణ్యంగా లాక్కుని పిల్లలను క్రూరంగాచంపావు. తల్లి హంస దుర్భరమైన మరణాన్ని చవిచూసింది. ఇంతటి అన్యాయమైన, క్రూరమైన కర్మను చేసినందుకు ఒక జీవితాంతం బాధపడాలి. అయితే, తరువాతి వంద జన్మలలో అనేక మంచి కర్మలను చేశావు. ఆ వంద జన్మలలో నువ్వు చేసిన మంచి కర్మలన్నిటినీ కూడబెట్టుకుని, ఈ జన్మలో రాజుగా జన్మించావు; కానీ ఆ జన్మలో నువ్వు చేసిన క్రూరమైన చెడు కర్మలు కూడా అదే స్థాయిలో పరిపక్వం చెందడంతో నువ్వు అంధత్వంతో బాధ పడుతున్నావు. ఆ దుష్ట కర్మ గత వంద జన్మలుగా నిన్ను వెంటాడుతూనే ఉంది. చివరికి ఈ జన్మలో నువ్వు అంధుడిగా పుట్టి, నీ క్రూరత్వం వల్ల తల్లి హంస తన వంద మంది పిల్లలను కోల్పోయినట్లే, నీ వంద మంది కుమారులనూ కోల్పోయావు.’ ఎన్ని జన్మలెత్తినా, ఎంతటి వారైనా కర్మఫలం తప్పించుకోలేరని గ్రహించాలి.
– యామిజాల జగదీశ్