
కొరియన్ గామ్జా బొక్కియుమ్
కావలసినవి: బేబీ పొటాటో– 6 లేదా 8 (పెద్ద బంగాళదుంపలను చిన్నగా కట్ చేసుకుని వాడుకోవచ్చు), ఉల్లిపాయ ముక్కలు– 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరగాలి), వెల్లుల్లి– 2 లేదా 3 రెబ్బలు (చిన్నగా తరగాలి), క్యారట్ తరుగు– కొద్దిగా, సోయా సాస్– 4 టేబుల్ స్పూన్లు, పంచదార– 3 టేబుల్ స్పూన్లు, నువ్వుల నూనె– 1 టేబుల్ స్పూన్, నువ్వులు– ఒకటిన్నర టేబుల్ స్పూన్లు,
వంట నూనె– 3 టేబుల్ స్పూన్లు
తయారీ: ముందుగా బేబీ పొటాటోలను తొక్క తీసి, నచ్చిన విధంగా కట్ చేసుకుని, కాసేపు చల్లని నీటిలో వేసి ఉంచాలి. అనంతరం కళాయిలో నూనె వేడి చేసుకుని, దానిలో ఆ ముక్కలు వేసుకుని, చిన్న మంట మీద బాగా మగ్గనివ్వాలి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యారట్ తరుగు వేసుకుని వేయించుకోవాలి.
ఈలోపు చిన్న బౌల్‌లో సోయా సాస్, పంచదార వేసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని, ముక్కల్లో వేసుకుని బాగా కలపాలి. ఆపై నువ్వులు, నువ్వుల నూనె వేసుకుని 2 నిమిషాల పాటు బాగా కలిపి, దగ్గరపడగానే స్టవ్ ఆఫ్ చేస్తే సర్వ్ చేసుకోవాలి.
త్రిపుర భంగుయి
కావలసినవి: బియ్యం పిండి– 1 కప్పు, బెల్లం– అర కప్పు (లేదా రుచికి తగినంత), కొబ్బరి తురుము– పావు కప్పు, ఏలకుల పొడి– పావు టీస్పూన్, ఉప్పు– చిటికెడు, నీరు– తగినన్ని, అరిటాకు– ఒకటి (చిన్నచిన్న ముక్కలు చేసి వినియోగించుకోవాలి)
తయారీ: ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండి, కొబ్బరి తురుము, ఏలకుల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. కొద్దికొద్దిగా నీరు పోస్తూ ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఈలోపు మరో గిన్నెలో బెల్లం, కొద్దిగా నీరు వేసి బెల్లం కరిగే వరకు వేడి చేయాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత, దానిని వడకట్టి, బియ్యం పిండి మిశ్రమంలో కలపాలి.
అనంతరం అరటి ఆకు ముక్కలుగా కత్తిరించి, వాటిని శుభ్రంగా కడిగి, ఆరబెట్టాలి. ఇప్పుడు ఒక్కొక్క అరటి ఆకు ముక్కను తీసుకుని, పొట్లంలా చేసి, దానిపై కొద్దిగా పిండి మిశ్రమాన్ని వేసి, ఆకును మడిచి, ఊడిపోకుండా పుల్లలు గుచ్చాలి. అవసరమైతే పుల్లలు గుచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని 15 నుంచి 20 నిమిషాల పాటూ ఆవిరిపై ఉడికిస్తే సరిపోతుంది. వీటిని మసాలా కూరలతో లేదా ఫ్రైలతో కలిసి తింటే భలే రుచిగా ఉంటాయి.
బాదం బన్స్
కావలసినవి:
మైదా పిండి– 1 కప్పుగోధుమ పిండి, జొన్న పిండి– అర కప్పు చొప్పున, రాగి పిండి– పావు కప్పు (అభిరుచిని బట్టి మరిన్ని పిండులు జోడించుకోవచ్చు), బాదం పౌడర్ – 1 కప్పు కస్టర్డ్ మిల్క్, బాదం పాలు– పావు కప్పు చొప్పున, ఉప్పు– అర టీ స్పూన్, గుడ్డు– 1, బటర్– అర కప్పు (కరిగించి పెట్టుకోవాలి), దాల్చిన పొడి– కొద్దిగా, జాజికాయ పొడి– అర టీ స్పూన్, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్– 1 టేబుల్ స్పూన్, ఎండు ద్రాక్ష, చెర్రీ ముక్కలు, స్ట్రాబెర్రీ ముక్కలు– కొద్దికొద్దిగా, నీళ్లు– కొద్దిగా, బ్రౌన్ సుగర్– 2 టేబుల్ స్పూన్లు
తయారీ: ముందుగా ఒక బౌల్‌లో మైదాపిండి, గోధుమ పిండి, జొన్న పిండి, రాగి పిండి, దాల్చిన పొడి, జాజికాయ పొడి, బాదం పౌడర్, బ్రౌన్ సుగర్‌తో పాటు తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. అనంతరం మరో బౌల్‌లో బాదం పాలు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్, కస్టర్డ్ మిల్క్, కరిగించిన బటర్, ఎండు ద్రాక్ష, చెర్రీ ముక్కలు, స్ట్రాబెర్రీ ముక్కలతో పాటు గుడ్డు వేసుకుని బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు మైదా మిశ్రమంలో, బాదం పాల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పోసుకుని, ముద్దలా బాగా కలుపుకుని, బన్స్ మాదిరి చేసుకుని, ఓవెన్‌లో బేక్ చేసుకోవాలి. తర్వాత వేయించిన నువ్వులు, పంచదార పొడి, క్రీమ్ వంటి వాటితో, నచ్చినవిధంగా గార్నిష్ చేసుకుని సర్వ్
చేసుకోవాలి.
(చదవండి: అక్కడ న్యూ ఇయర్‌కి శుభాకాంక్షలు చెప్పుకోరు..! ఏం చేస్తారో తెలిస్తే షాకవ్వుతారు..)