
జీవితంలో కష్టాలనేవి సహజం. సాధారణంగా మన కంటే వయసులో చిన్నవాళ్లు మనకళ్లముందే వెళ్లిపోతుంటే ఏ వ్యక్తులకైనా.. తట్టుకోవడం అంత ఈజీ కాదు. వాటన్నింటిని దిగమింగుకుంటూ ఏదోలా బతికినా..చివరికి విధి మరింత కఠినంగా పరీక్షలు పెట్టి.. ఉపాధి లేకుండా చేసి ఆడుకుంటే..ఆ బాధ మాములుగా ఉండదు. అదికూడా ఏడు పదుల వయసులో ఈ సమస్యలు చుట్టుముడితే పరిస్థితి మరింత ఘోరం. ఎవ్వరైనా..విలవిలలాడతారు. కానీ ఈ బామ్మ మాత్రం ఆ కష్టాలకు వెరవలేదు. పైగా మనవడికి సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అతడికి జీవనమార్గాన్ని అందించింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.
ఆ బామ్మే 79 ఏళ్ల ఊర్మిళ ఆషర్ అకా. అంతా ముద్దుగా ఆమెను గుజ్జు బెన్‌గా పిలుచుకుంటారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు, తాతలకు సాయం అదించడం విని ఉంటాం. కానీ మనవడికోసం ఓ బామ్మ తన పాకకళా నైపుణ్యన్ని వెలికి తీసి..అతడి జీవనోపాధికి ఆసరాగా మారడం గురించి విన్నారా.?. అది కూడా 75 ఏళ్ల వయసులో.. అయితే ఈ బామ్మ చాలా ధీమాగా ఆ సాహసం చేసింది. రెస్ట్ తీసుకుని "కృష్ణా.. రామ.." అని జపించే వయసులో మనవడి కోసం వ్యాపారం మెదలు పెట్టింది. ఆమె కథ వింటుంటే..ఒక వ్యక్తికి వరుస కష్టాలు పలకరిస్తుంటే.. బతకగలరా..? అనే బాధ కలుగుతుంది.
కానీ ఊర్మిళ వాటన్నింటిని ఒక్క చిరునవ్వుతో ఎదిరించి నిలబడింది. గుజరాత్‌కి చెందిన ఈ బామ్మ గుజ్జు బెన్ నా నాస్తా అనే స్నాక్ సెంటర్‌ని నడిపింది. దాన్ని లాభాల్లో దూసుకుపోయేలా చేసింది. ఆమె మాస్టర్ చెఫ్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ప్రముఖ చెఫ్ రణవీర్‌బ్రార్ వంటి ప్రముఖుల మన్ననలకు కూడా పొందారామె.
వ్యాపారం ప్రారంభించడానికి కారణం..
2019లో, ఆమె ఏకైక మనవడు హర్ష్ ఒక ప్రమాదంలో కింది పెదవిని కోల్పోయాడు. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా జాబ్ కోల్పోయాడు. ప్రమాదం ఇచ్చిన వికృత రూపం కారణంగా ఎవ్వరూ అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. పైగా అతడు కూడా ఆత్మనూన్యత భావంతో ఇక ఇంట్లోనే ఒంటిరిగా ఉండిపోయేవాడు.
అతనిలో స్థైర్యం నింపేందుకు ఆమె వ్యాపారం చేయాలని సంకల్పించి 'గుజ్జు బెన్ నా నాస్తా' అనే గుజరాతీ స్నాక్ సెంటర్‌ని ప్రారంభించింది. తన మనవడితో కలిసి గుజరాతీ వంటకాలైనా.. థెప్లాస్, ధోక్లా, ఖాఖ్రా, ఫరాలి వంటి రుచులతో కస్టమర్‌లను మెప్పించారు. అనతి కాలంలోనే పెద్ద స్నాక్ సెంటర్‌గా మారింది. అంతేగాదు ఊర్మిళ ఆషర్ టెడ్‌ఎక్స్ స్పీకర్‌గా మారి తప కథని వినిపించిది. అక్కడున్న వారందర్నీ ఆమె గాథ కదిలించింది.
చాలా కష్టాలు చూశారామె..
మాజీ మాస్టర్ చెఫ్ అయిన ఊర్మిళ జీవితంలో వరుస విషాదాలను చవిచూసిందని ఆమె సన్నహితులు చెబుతుంటారు. రెండున్నర సంవత్సరాల కూతురుని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత తన ఇద్దరు కొడుకులు ఒకరు బ్రెయిన్ ట్యూమర్‌తో మరొకరు గుండెజబ్బుతో చనిపోవడం. చివరికి మిగిలిన ఒక్కగానొక్క మనవడు ప్రమాదం బారినపడి వికృతరూపంతో బాధపడటం వరకు చాలా కష్టాలను అధిగమించారు.
ఏడు పదుల వయసు వరకు వెన్నంటిన కష్టాలకు చలించలేదు. ఉన్న ఒక్క మనవడు ముఖంలో చిరునవ్వు తెప్పించేందుకు తాపత్రయపడింది. ఆ నేపథ్యంలోనే ఈ ఏజ్‌లో వ్యాపారమా..? అనే సందేహానికి తావివ్వకుండా కష్టపడింది. అనుకున్నట్లుగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మంచి సక్సెస్‌ని అందుకున్నారామె.
త్వరలోనే ఆమె చిన్న వ్యాపారం కాస్త సొంతంగా వెబ్‌సైట్‌ని ఏర్పాటు చేసుకుని మరింత మంది కస్టమర్ల మన్నలను అందుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఊర్మిళ 79 ఏళ్ల వయసులో ఏప్రిల్ 07న గుండెపోటుతో చనిపోయారు. చనిపోయేంత వరకు తరుముతున్న కష్టాలని చూసి కన్నీళ్లు పెట్టకుండా పోరాడారు.. గెలిచారు. ఉక్కు సంకల్పం ఉంటే..సంపాదనకు వయసుతో సంబంధం లేదని చాటిచెప్పారు ఊర్మిళ. చిన్న చిన్న వాటికే కుంగిపోయి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే యువతకు కనువిప్పు ఈ బామ్మ కథ..!.
(చదవండి: ద్రౌపది తెలివిగా సృష్టించిన వంటకమే పానీపూరి.. పూర్తి కథ ఏంటంటే?)