చరిత్రలో సువర్ణాధ్యాయం | Sakshi Guest Column On | Sakshi
Sakshi News home page

చరిత్రలో సువర్ణాధ్యాయం

Published Sun, Nov 3 2024 1:06 AM | Last Updated on Sun, Nov 3 2024 1:06 AM

Sakshi Guest Column On

కామెంట్‌

రోమ్‌కు, ఆ తరువాత మధ్యధరా, యూరప్‌కు గ్రీస్‌ ఎలాంటిదో... దక్షిణాసియా, మధ్యఆసియా, ఆ మాటకొస్తే చైనాకూ భారత్‌ అలాంటిదని అంటారు విలియం డార్లింపిల్‌. క్రీ.పూ. 3 నుంచి క్రీ.శ. 12, 13 శతాబ్దాల కాలం ఇండియాలో సువర్ణాధ్యాయం అని చెబుతారు తన తాజా పుస్తకంలో. భారతీయ గణిత, ఖగోళ శాస్త్ర భావనలు అరబ్‌ దేశాలకు, అక్కడి నుంచి యూరప్‌కు వ్యాప్తి చెందిన వైనం గురించి రాశారు. ప్రాచీన భారతదేశం విశ్వగురు అని, 12వ శతాబ్దంలో ముస్లిం పాలకుల రాకతో ఆ బంగారు కాలం అంతరించడం మొదలైందని వాదించే హిందుత్వవాదులకు ఈ పుస్తకం మద్దతుగా నిలుస్తుందన్న విమర్శలను డార్లింపిల్‌ కొట్టేస్తారు. ‘‘అది యాదృచ్ఛికం’’ అంటారు.

విలియం డార్లింపిల్‌ తాజా పుస్తకం భారతీయ చదువరులకు బాగా నచ్చుతుందనుకుంటున్నాను. ఎందుకంటే... మనలాంటి వాళ్లు చాలాకాలంగా నమ్ముతున్న విషయాన్ని ఆయన మరోసారి రూఢి చేశారు. అయితే అదేమిటన్నది ఆయన మాటల్లో వినడమే మేలు. 

డార్లింపిల్‌ రాసిన పుస్తకం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 12 – 13 శతాబ్దాల మధ్య కాలం నాటి పరిణామాలకు సంబంధించినది. ఈ కాలానికి సంబంధించి ఆయన ఏమంటారంటే... ‘‘రోమ్‌కు, ఆ తరువాత మధ్యధరా, యూరప్‌కు గ్రీస్‌ ఎలాంటిదో... దక్షిణాసియా, మ««ధ్య ఆసియా, ఆ మాటకొస్తే చైనాకూ భారత్‌ అలాంటిది’’ అని!

ప్రాచీన భారతదేశం ప్రపంచంలో తీసుకొచ్చిన మార్పుల గురించి డార్లింపిల్‌ ‘ద గోల్డెన్‌  రోడ్‌: హౌ ఏన్షియంట్‌ ఇండియా ట్రాన్స్‌ఫార్మ్‌డ్‌ ద వరల్డ్‌’’ పేరుతో రాసిన పుస్తకంలో అక్షరబద్ధం చేశారు. భారతీయల చెవులకు ఇంపైన ఇంకో మాట కూడా ఇందులో ఉంది. ఇది చైనాతో భారత్‌ పోలికకు సంబంధించినది. 

చైనా తనను తాను ఈ ప్రపంచానికి కేంద్రంగా చెప్పుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి పాశ్చాత్య దేశాలకు ప్రత్యక్ష వ్యాపారం ఉన్న ఆనవాళ్లేమీ లేవంటారు ఆయన. ఆ కాలంలో ‘‘ఒకరి గురించి మరొకరికి చూచాయగా మాత్రమే తెలుసు’’ అని ఆయన యూరప్, చైనాల గురించి నాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. 

మరోవైపు భారత్, రోమన్‌  సామ్రాజ్యాల మధ్య వాణిజ్య విస్తృతి చాలా ఎక్కువ. భారత్‌ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై వసూలు చేసే సుంకం రోమన్‌  సామ్రాజ్య ఖజానాలో మూడో వంతు వరకూ ఉండేది. ఇంకో రుజువు ఏమిటంటే... భారతీయ సంగ్రహాలయాల్లో రోమ్‌ సరిహద్దుల్లోని దేశాల్లోనూ లేనన్ని రోమన్‌  నాణేలు ఉండటం. ఇది భారత్‌– చైనాల మధ్య శత్రుత్వాన్ని కొత్త రూపంలో రాజేసినట్టుగా లేదూ?

ఇవన్నీ డార్లింపిల్‌ పుస్తకంలో మూడు రకాల కథనాల్లో కనిపిస్తాయి. చైనా, మధ్యాసియాలకు ఆపై సైబీరియా, మంగోలియాల వరకూ విస్తరించిన బౌద్ధం తాలూకూ కథనం ఒకటైతే... భారతీయ గణిత, ఖగోళ శాస్త్ర భావనలు అరబ్‌ దేశాలకు, అక్కడి నుంచి యూరప్‌కు వ్యాప్తి చెందిన వైనం రెండో కథనం. హిందూయిజ, సంస్కృతాలు దక్షిణాసియాలో కంబోడియా, లావోస్, జావాల వరకూ వ్యాపించిన కథనం చివరిది. 

బాగ్ధాద్‌ మంత్రుల మొదలుకొని ఇటలీ గణిత శాస్త్రవేత్తల వరకూ రకరకాల పాత్రల ద్వారా ఈ కథనాలు నడుస్తాయి. టొలెడో మతాధికారి, చైనాలోని ఏకైక మహిళ సామ్రాజ్ఞి, కంబోడియాలోని అంగ్‌కోర్‌వాట్, జావాలోని బోరోబుడుర్, బిహార్‌లోని నలందాల వెనుక దాగి ఉన్న ఎన్నో కథలను వివరిస్తుందీ పుస్తకం. 

టొలెడో మతాధికారి 1068లో ప్రపంచంలోని మే«ధా చరిత్ర గురించి రాస్తూ... అది భారత కాలమని వర్ణించాడు. ‘విలియం ద కాంకరర్‌’ తొలిసారిగా బ్రిటిష్‌ గడ్డపై అడుగుపెట్టిన ఈ కాలంలోనే రాసిన ఈ చరిత్రలో భారత్‌ తన వరాలకు పేరొందిందని రాశాడు. 

‘‘శతాబ్దాలుగా విజ్ఞానానికి సంబంధించిన అన్ని శాఖల్లో భారతీయుల సామర్థ్యాన్ని రాజులు అందరూ గుర్తించారు. జ్ఞానవంతులు వాళ్లు. జ్యామితి, అంక గణితాల్లో ఎంతో పురోగతి సాధించారు. వైద్యం విషయంలో మానవులందరి కంటే ముందున్నారు’’ అని కీర్తించాడు. 

ఈ పుస్తకం ద్వారా నాకు మూడు విషయాలు స్పష్టమయ్యాయి. పుస్తక శీర్షికలోని బంగారు దారి నేల మార్గం కాదు. సముద్రాల పైది. శక్తిమంతమైన వానాకాలపు గాలులు భారతీయ వర్తకులను పశ్చిమాన అరేబియాకు, తూర్పున సుమత్రా, జావా వరకు చేరేలా చేశాయి.

దక్షిణాసియాకు హిందూయిజం, సంస్కృత సంబంధిత సంస్కృతి విస్తరించేందుకు యుద్ధాలు కారణం కాదు. ఇందులో బ్రాహ్మణ మిషనరీలు ముందుంటే... తరువాతి కాలంలో వ్యాపారులు వ్యాప్తి చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... భారత్‌లోని అన్యాయ కుల వ్యవస్థ ఇక్కడకు విస్తరించకపోవడం. దురదృష్టం కొద్దీ డార్లింపిల్‌ ఈ విషయంపై ఎక్కువగా వివరించలేదు.

అన్నింటికంటే ఆసక్తికరమైన అంశం, ఇది మనం ఆశించేది అయినప్పటికీ చారిత్రక వాస్తవం కాకపోవచ్చు... సోర్‌బోన్‌ , ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్‌ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాన్నీ నలందా విశ్వవిద్యాలయ స్ఫూర్తితో ఏర్పాటు చేశారని అనిపిస్తుంది. 

చివరగా... ప్రాచీన భారతదేశం విశ్వగురు అని, 12వ శతాబ్దంలో ముస్లిం పాలకుల రాకతో ఆ బంగారు కాలం అంతరించడం మొదలైందని వాదించే హిందుత్వవాదులకు ఈ పుస్తకం మద్దతుగా నిలుస్తుందని కొంతమంది విమర్శకులు ఎత్తిచూపుతున్నారు. డార్లింపిల్‌ రెండింటికీ సంబంధమే లేదని స్పష్టం చేస్తారు. ‘‘అది యాదృచ్ఛికం, అసంగతం.’’ ఆయన పుస్తకంలో చెప్పే ఇంకా ఆసక్తికరమైన సంగతులు చాలానే ఉన్నాయి. వాటిని మీ కోసమే వదిలేస్తాను.

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement