Telidevara Bhanumurthy: మందల బడి మురుస్తాంది గొర్రె | Telidevara Bhanumurthy Write on Bharat Rashtra Samithi Party Launch | Sakshi
Sakshi News home page

Telidevara Bhanumurthy: మందల బడి మురుస్తాంది గొర్రె

Published Fri, Dec 16 2022 4:21 PM | Last Updated on Fri, Dec 16 2022 4:21 PM

Telidevara Bhanumurthy Write on Bharat Rashtra Samithi Party Launch - Sakshi

జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్‌ దీస్కోని బొందల గడ్డ దిక్కు బోయిండు. గాడ రొండం త్రాల బంగ్లల బేతాలుడు ఉంటు న్నడు. పొద్దుబోకుంటె టివిల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జూస్కుంట గూసున్నడు. ఇంటి ముంగట మోటరాపి విక్రమార్కుడు హారన్‌ గొట్టిండు. టివి బంద్‌ జేసి బేతాలుడు ఇవుతలకొచ్చిండు. మోటరెన్క సీట్ల ఆరాంగ గూసున్నడు. గాడు గూసోంగనే విక్రమార్కుడు మోటర్‌ నడ్ప బట్టిండు.

‘‘ఇగమున్నా, సిగలేటు ముట్టిచ్చెతంద్కు ఇంగలం దొరకకున్నా, ఆనగొట్టి తొవ్వలు చెర్ల తీర్గ అయినా మోటర్‌ దీస్కోని వొస్తవు. గుంతలు, ఎత్తు గడ్డలని సూడ
కుంట మోటర్‌ నడ్పుతవు. ఎవడన్న సైడియ్యకుంటె నీకు కోపం రావొచ్చు. నీ యాస్టనంత యాది మర్సెతందుకు బీఆర్‌ఎస్‌ కత జెప్త ఇను’’ అని అన్నడు బేతాలుడు.
‘‘చెప్పుడు నీ పనైతె ఇనుడు నా పనే గదా’’ అని విక్రమార్కుడు అన్నడు.

‘‘కతంత అయినంక నేనడ్గేటి సవాల్కు జవాబ్‌ జెప్పుడు గుడ్క నీ పనే. బొంతు పుర్గు సీతాకోక చిల్క అయిన తీర్గ టీఆర్‌ఎస్‌ పార్టి బీఆర్‌ఎస్‌ అయ్యింది. టీఆర్‌ఎస్‌ జెండల తెలంగాన నక్ష ఉన్నది గని బీఆర్‌ఎస్‌ జెండల బారతదేసం జెండ ఉన్నది. బీఆర్‌ఎస్‌ అంటె బరండి, రమ్ము, స్కాచ్‌ అని కొందరనబట్టిండ్రు. టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌ అయ్యింది; బీఆర్‌ఎస్‌ వీఆర్‌ఎస్‌ అయితదని రేవంత్‌ రెడ్డి అసువంటోల్లు అనబట్టిండ్రు.’’

‘‘ఇంతకు బీఆర్‌ఎస్‌ అంటె ఏంది?’’
‘‘భారత రాష్ట్ర సమితి. ముందుగాల రాస్ట్రం సంగతి జూస్కోవాలె. అటెంకల దేసంను బాగ జేస్త ననాలె. గట్ల గాకుంట కేసీఆర్‌ ఇల్లు మించిన పందిరేస్తున్నడు. ఎంటిక పోసతోని గుట్టను గుంజాలని సూస్తున్నడు.’’

‘‘తెలంగాన గురించి కేసీఆర్‌ ఎన్నిటినో జేస్తె గిట్లంటవేంది?’’
‘‘శాన జేసిండు. మాటల్తోని కోటలు గట్టిండు. రొండేండ్ల కిందట వాసాల మర్రి ఊరును దత్తు దీస్కుండు. యాడాదిల గా ఊరును బంగారి మర్రి జేస్తనన్నడు. రొండు నూర్ల గజాల వొంతున అందర్కి ఇండ్లు గట్టిపిచ్చి ఇస్తనన్నడు. శ్రమదానం కమిటి, హరిత హారం కమిటి అసువంటి కమిటిలు ఏసిండు. మొగులు మీది సర్గంను కిందికి దించుతనని ఒక్క తీర్గ జెప్పిండు. తొవ్వ ఏసెతంద్కు అడ్డమున్నయని శానమంది ఇండ్లను కూలగొట్టిండ్రు. అంగన్‌వాడి, బడి, పంచాయతి ఆపిస్, చెర్వులను బాగ జేసెతందుకు 150 కోట్లు కర్సయితదని అప్సర్లు సర్కార్‌కు జెప్పిండ్రు. గని ఇదువర దాంక సర్కార్‌ ఒక్క రూపాయి గుడ్క మంజూరు జెయ్యలేదు. గిప్పుడు వాసాల మర్రిల వాసాలే మిగిలినయి. కొత్త ఇండ్లేమొగని ఉన్న ఇండ్లు బోయినయి’’ అని బేతాలుడు అన్నడు.

‘‘ఇంతకు కేసీఆర్, బీఆర్‌ఎస్‌ జెండను యాడ ఎగిరేసిండు?’’
‘‘డిల్లిల సర్దార్‌ పటేల్‌ మార్గ్‌ల ఒక బంగ్లను కిరాయికి దీస్కుండు. తీస్కునే ముంగట గది వాస్తు ప్రకారం మంచి గున్నదా లేదా అని అర్సుకుండు. పెండ్లాం, పిల్లలను దీస్కోని డిల్లికి బోయిండు. అయ్యగార్లు బెట్టిన మంచి మూర్తంల నవ చండీయాగం జేసిండు. యాగ మైనంక ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అని వొచ్చి నోల్లందరు వొర్లుతుండంగ బీఆర్‌ఎస్‌ జెండ ఎక్కిచ్చిండు. మంగలార్తి దీస్కోని పార్టి అపిస్లకు బోయిండు.’’

‘మోదీ జైశ్రీరాం అంటడు. జైశ్రీరాం గాదు జైసియా రాం అనాలని రాహుల్‌ గాందీ అంటున్నడు. రాంరాం అన్కుంట సీతా మాతను ఇడ్సిపెడ్తె ఎట్లని అడుగు తున్నడు. మన దేసమే గాకుంట దునియంత మంచి గుండెతందుకే రాజ శ్యామల యాగం జేసిననని కేసీఆర్‌ అంటున్నడు. గీల్లు గిట్లెందుకు జేస్తున్నరు’’ అని విక్ర మార్కుడు అడిగిండు.

‘‘లీడర్లందరు మతం పేరు మీద మాయలు జేస్తుంటరు. గుళ్లు గట్టిస్తరు. దీపాలు ముట్టిస్తరు. జెనా లను గొర్లను జేస్తరు. జెనం గొల్రు గుడ్క లీడర్ల యెంబడి దిరుక్కుంట మురుస్తుంటయి. రేపొద్దుగాల ఏమైతయో మరుస్తుంటయి. దేసంల అన్నిటి కన్న ఎక్వ గొర్లున్న రాస్ట్రం తెలంగాన అని గీనడ్మ ఒక పేపర్ల రాసిండ్రు ఎందుకు? గీ సవాల్కు జవాబ్‌ ఎర్కుండి గూడ జెప్ప కుంటివా అంటె నీ మోటర్‌ బిరక్‌ ఫేలైతది’’ అని బేతాలుడన్నడు.

‘‘ముందుగాల నీ లెక్కనే నాకు అర్తం గాలేదు. జెర సోంచాయిస్తె అర్తమైంది. ఆడు అబద్దం రాయలేదు. ఉన్న నిజమే రాసిండని’’ విక్ర మార్కుడు జెప్పిండు.
ఇంతల బొందల గడ్డ వొచ్చింది. బేతాలుడు మోటర్‌ దిగి ఇంట్లకు బోయిండు.

తోక:– ‘‘నేను ఇంటర్ల ఫస్ట్‌ కిలాస్ల పాసైన. గీ సదువుతోని నీకు కొల్వు యాడ దొరుక్తది. డిగ్రి మంచిగ సద్వు. మంచిగ సద్వకుంటివా అంటె మిర్చి బజ్జిలు ఏస్కోని బత్కాలె అని మా నాయిన అన్నడు. డిగ్రిల ఫస్ట్‌ కిలాస్ల పాసైన. కొల్వు దొర్కలే. బిటెక్‌ మంచిగ సద్వు. మంచిగ సద్వకుంటివా అంటె మిర్చి బండి బెట్టుకోని బత్కాలె అని మా కాక అన్నడు. బిటెక్‌ల మంచి మార్కులొచ్చినయి. కొల్వు దొర్కలే. ఎంబిఏ మంచిగ సదివితివా అంటె సర్కార్‌ కొల్వు దొరక్తది. మంచిగ సద్వకుంటివా అంటె మిర్చి బజ్జీలు ఏస్కోని బత్కాలె అని మా మామ అన్నడు. ఎంబిఏ గుడ్క మంచి మార్కులతోని పాసైన. ఏం లాబం. కొల్వులు లెవ్వు. మిర్చి బజ్జీలేస్కోని బత్కు అని సర్కా రోల్లు జెప్పిండ్రు. ముప్‌పై రూపాయలకు నాలుగు మిర్చి బజ్జీలు. మీకెన్ని బజ్జీలు గావాలె.’’ (క్లిక్‌ చేయండి: బీఆర్‌ఎస్‌ అంటే ఏంది?)


- తెలిదేవర భానుమూర్తి 
సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement